దేశవ్యాప్త రైతు ఉద్యమంగా అమరావతి!

ABN , First Publish Date - 2020-02-02T04:47:30+05:30 IST

నాగజెముడు వలే నవ్యాంధ్రను నాశనం చేస్తున్నది వైసీపీ ప్రభుత్వం. జగన్‌ సంకుచిత రాజకీయ పైత్యం రాష్ట్రాభివృద్ధికి శరాఘాతంగా మారింది. రాష్ట్ర విభజనతో నవ్యాంధ్ర ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న

దేశవ్యాప్త రైతు ఉద్యమంగా అమరావతి!

నాగజెముడు వలే నవ్యాంధ్రను నాశనం చేస్తున్నది వైసీపీ ప్రభుత్వం. జగన్‌ సంకుచిత రాజకీయ పైత్యం రాష్ట్రాభివృద్ధికి శరాఘాతంగా మారింది. రాష్ట్ర విభజనతో నవ్యాంధ్ర ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో రాజధానిని మార్చి మరోసారి వికృత ప్రయోగం చేయడం మంచిది కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్‌ తన ఆలోచనా ధోరణిని విరమించుకోవాలి. 

ఆవేశం తప్ప ఆలోచన లేదు. ఏది చేయాల్నో, ఏది చెయ్యకూడదో అన్న అంశాలపై స్పష్టత లేదు. ఎనిమిది నెలలుగా నిరంతరం నిరర్ధక వివాదాలే. ప్రజలను బతికించాల్సిన అధికారం బలితీస్తున్నది. తాను అనుకున్నదే జరగాలన్న మంకుపట్టు పాలకుల్లో ప్రమాదకర స్థాయికి చేరింది. 2014 లో అమరావతి పై అభ్యంతరం చెప్పని వైసీపీ ఇప్పుడు దానిపై కత్తి దూసింది. అమరావతి రాజధాని నిర్మాణానికి ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్‌ రెడ్డి అంగీకరించబట్టే , దయాధర్మాలతో రైతులు ఇచ్చిన భూముల్లో నిర్మితమైన శాసనసభే అమరావతికి మరణ శాసనం విధించింది. అబద్ధాలు అభాండాలతో అమరావతిని అంతర్ధానం చెయ్యడానికి యత్నిస్తున్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అన్నారు, అమరావతి వల్ల ఒక సామాజిక వర్గానికే మేలు అని ప్రచారం చేశారు. ఈ ప్రాంతం సురక్షితం కాదని, రాజధాని ముంపునకు గురి అవుతుందని ప్రకటనలు చేశారు. ఈ కారణంగా రాజధాని ఆపేయాలని కోరుతూ కొందరు కోర్టుకెక్కారు. 

పిటీషనర్లు లేవనెత్తిన ప్రతి అంశాన్ని పరిశీలించి దాఖలైన నాలుగు కేసులను కొట్టి వేస్తూ జస్టిస్‌ స్వతంత్రకుమార్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం 2017 నవంబర్‌ 17 వ తేదీన 145 పేజీల సుదీర్ఘ తీర్పు వెల్లడించింది. ఈ ప్రాంతం మునిగి పోయే అంత వరదలు ఎప్పుడు రాలేదని, 1853 లో చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ వరదలు వచ్చినప్పుడు కూడా కృష్ణానది ఈ ప్రాంతంలోకి పొంగి వచ్చిన దాఖలాలు లేవని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తన తీర్పులో చెప్పింది. రాజధానిగా అమరావతిని ఎంపికచేయడం శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులకు విరుద్ధమన్న వాదనలను కూడా తోసిపుచ్చింది. కొన్ని రోజులు మాత్రమే ప్రవహించే కొండవీటి వాగువల్ల ముంపేమీ ఉండదని వ్యాఖ్యానించింది. 

రాజధాని ప్రాంతం సంపన్నమైన వ్యవసాయ క్షేత్రం అన్న వాదనలతోనూ ట్రైబ్యునల్‌ అంగీకరించలేదు. రాష్ట్రంలో వున్నమొత్తం సాగు భూమితో చూస్తే అక్కడవున్న వ్యవసాయ భూమి కేవలం 0.027శాతమేనని, అక్కడ సాగు అవుతున్న వరి 0.077 శాతం మాత్రమే నని పేర్కొన్నది. రైతులనుండి బలవంతంగా భూములు గుంజుకుంటున్నారన్న పిటీషనర్ల వాదనలో పసలేదని చెప్పింది. పర్యావరణ ప్రభావ మధింపు సమయంలో బహిరంగ విచారణ జరగలేదన్న వాదనను ట్రైబ్యునల్‌ తోసిపుచ్చినది. ప్రభుత్వం రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను బహిర్గతం చేసి అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించిన తరువాతనే తర్వాతనే నోటిఫై చేసినట్లు గుర్తు చేసింది. అమరావతి కొత్త రాష్ట్రానికి కేంద్రస్థానంలో ఉందని వెల్లడించింది. వరదముంపునకు ఎలాంటి ఆధారాలు లేవని, వి.వి. శ్రీనివాస్‌, కె. రవి, డి. కాశీ విశ్వేశ్వర్రావు కమిటీ స్పష్టం చేసింది. కానీ, ఉత్తుత్తి నివేదికల పేరు చెబుతూ అమరావతిని తరలించేందుకు ప్రభుత్వం ముందుకెళుతుంది. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనుకూలంకాదని, అది ముంపు ప్రాంతమని మద్రాస్‌ ఐ.ఐ.టి నివేదిక ఇచ్చినట్లు బీసీజి నివేదికలో వెల్లడించారు. 

నిజమేనేమో అనుకున్నారు అందరూ. కానీ, అలాంటి నివేదికే ఇవ్వలేదని, అభిప్రాయాలు కూడా చెప్పలేదని ఆ విద్యాలయం తేల్చి చెప్పింది. రాజధానిని విశాఖలో పెట్టాలని జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఇచ్చింది అని ప్రచారం చేశారు. కానీ, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం వద్దేవద్దని జీఎన్‌ రావు కమిటీ చెప్పింది. తుఫాన్ల ముప్పు ఉంది, అందుకే సముద్ర తీరానికి 50 కిలోమీటర్ల దూరంగా రాజధాని పెట్టాలని సూచించామని జీఎన్‌ రావు స్వయంగా చెప్పారు. కానీ, విశాఖ కేంద్రంగానే కీలక కార్యాలయాల కోసం తీరం వెంబడి ఉన్న భవనాలనే ఎంపిక చేస్తున్నారు. దీనిని బట్టి ప్రభుత్వం వేసిన కమిటీలు వెల్లడిస్తున్న నివేదికల్లో కూడా వాస్తవాలు ఎంతో ప్రజలే అర్ధం చేసుకోవాలి. విచక్షణ కోల్పోయి విద్వేషంతో వ్యవహరిస్తే అది వినాశనానికి దారి తీస్తుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. విశాలమైన, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన రాజధాని అవసరమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఏ రాష్ట్రానికైనా రాజధానే గుండెకాయ. కాబట్టి, అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ ప్రణాళికలతోనే భావితరాల అవసరాలు తీర్చేలా ప్రభుత్వం ముందడుగు వేయాలి. రాజధాని అంటే ఒక్క పాలనా కేంద్రమే కాదు. 

ఆర్థిక సముపార్జనకు, సేవారంగానికి, ఉపాధి అవకాశాలకు నిలయంగా వుండాలి. కడుతున్నది రాజధానే కాదు, జాతినిర్మాణం, సాంస్కృతిక పునర్జీవంతో ఏపీ వైభవాన్ని తెలిపే అంశాలన్నీ అమరావతి తనలో ఇముడ్చుకొనున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతి ఆంధ్రప్రదేశ్‌ కి ప్రాణ వాయువు అవుతుంది. విశాలమైన అమరావతి రాజధాని నిర్మాణం ఎందుకంటే భవిష్యత్‌ అవసరాలు, ఎదురయ్యే సవాళ్లే రాజధానికి పునాదులు. ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, వంటి అనేక నగరాలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితుల ఏవీ అమరావతి ఎదుర్కొన కూడదన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం దూరదృష్టితో నగర నిర్మాణానికి ప్రణాళికలు వేసింది. ఇప్పుడు 12లక్షలున్న జనాభా కోటికి పెరిగినా ఇబ్బందుల్లేని విధంగా ప్రపంచానికి నమూనాగా నిలవనున్నది. భారత్‌లో నగరాలు ఎదుర్కొంటున్న మరో పెను ముప్పు కాలుష్యం. గ్రీన్‌ జోన్‌ లేకపోవడం, గ్రీన్‌ పాలసీ జోలికి వెళ్లకపోవడం, వాహనాలు పెరిగి గాలి కాలుష్యం పెరగిపోవడం, డ్రైనేజీ లాంటి కనీస వ్యవస్థలు లేకపోవడం తో నీరు, భూమి కలుషితం అవుతున్నాయి. పరిశ్రమ లెక్కడ, జనావాసాలెక్కడ అనే స్పష్టత ఇప్పటికీ కనిపించని దేశ నగరాలు అవస్థలకి ఆనవాళ్ళు గా నిలిచాయి. ఉదాహరణకి హైదారాబాద్‌లో ఎప్పుడో నిజాం కాలం నాటి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి వ్యవస్థ కొత్తగా పెరిగిన వలసల భారాన్ని తట్టుకోలేకపోతుంది. మౌలిక సౌకర్యాలు కల్పించలేక పోవడంతో నగర జీవనం అత్యంత దుర్భరంగా మారింది.

 ఈ నేపథ్యంలో వైశాల్యాన్ని బట్టి చూసినా, ప్లానింగ్‌ ప్రకారం చూసినా ఇండియాలో మహానగర నిర్మాణానికి పునాది కానున్నది అమరావతి ఒక్కటే. నేటి అవసరాలు, రేపటి మార్పులను తట్టుకొంటూ భవిష్యత్‌ నగరాన్ని ఎలా నిర్మించాలో చూపించనున్నది అమరావతి. అన్ని అవసరాలు ఒకే చోట తీరే విధంగా తొమ్మిది సిటీల నిర్మాణానికి ప్రణాళిక సిద్దం చేశారు. ఇండియాలో ఇప్పటి వరకు ఇలాంటి మోడల్‌ ప్లానింగ్‌ లేదు. పార్కింగ్‌, డ్రైనేజీ వంటి సమస్యలు రాకుండా అమరావతి నిర్మాణ ప్లానింగ్‌ చేశారు. బతుకు దెరువు కోసం పక్క రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లడమే ఇప్పటి వరకు మనకు తెలిసింది. ఇక ఆ అవసరం లేకుండా మన ముందు తరాలకు వర్క్‌ ప్లేస్‌ గా మారనుంది అమరావతి. పాలనే కాదు, ఆలన కూడా వుండబోతుంది. హైదారాబాద్‌ లో మూడో నగరం సైబరాబాద్‌ పుట్టుకొచ్చాకనే నగర ఆదాయం ఒక్క సారిగా ఆర్ధిక సామర్ధ్యం అమాంతం పెరిగింది. ఐటీ ఎగుమతుల్లో ముందడుగు వేసింది. అమరావతిలో ఇలాంటి వ్యూహం మొదటి ఇటుక నుండే సిద్ధం చేశారు. అందుకే అమరావతి అపూర్వం కానుంది.

 చంద్రబాబు తలపెట్టారన్న ద్వేషంతో అమరావతిని చంపేయ వద్దు. చంద్రబాబు కోసం అమరావతి కాదు, అయిదు కోట్ల ఆంధ్రుల భవితకోసమే అమరావతి. ఆంధ్రప్రదేశ్‌ ఆయువు అమరావతే. ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా, ఉజ్వలమైన, విభిన్న మైన, సమ్మిళితమైన, అధునాతన నగరంగా రాజధాని వుండాలన్న ప్రణాళికతో చేపట్టిన నవ్యాంధ్ర రాజధాని అమరావతి భారతదేశ తూర్పు ముఖ ద్వారం కానుంది. అమరావతి పేరు వింటేనే తెలుగుజాతి గుండే సగర్వంగా ఉప్పొంగుతుంది. అమరావతిని అర్దం చేసుకొని ప్రభుత్వం వద్ద చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో రైతులు వారి ప్రాణంతో సమానమైన భూములను రాజధాని నిర్మాణానికి ఈ పద్ధతిలో ఇవ్వడం దేశంలోనే ఓంప్రథమం. భూ సమీకరణ విధానంలో 28 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించారు. రాజధానిని మరో ప్రాంతానికి తరలిస్తే ఇలా భూములు ఇచ్చిన రైతులు ‘మా పరిస్థితి ఏమిట’ని ఆందోళన చెందుతున్నారు. 

రూ 39 వేల కోట్ల విలువ చేసే పనులు మొదలు అయ్యాయి. రాజధానిని మరొకచోటికి మార్చడం వల్ల ఇప్పటి వరకు చేసిన వ్యయం అంతా వృధా అవుతుంది, చేసిన నిర్మాణాలన్నీ వ్యర్థం అవుతాయి.ప్రభుత్వం విచక్షణ కోల్పోయి విద్వేషంతో వ్యవహరించడం మంచిది కాదు. గత ప్రభుత్వం పై వున్నద్వేషాన్ని ప్రజల పై ప్రదర్శించడం మంచిది కాదు. ఆ భూముల, నిర్మాణం విషయంలో ఏదైనా అవకతవకలు, అవినీతి జరిగితే వాటి నిగ్గుతేల్చండి, దోషులను శిక్షించండి. అంతకానీ, ఎలుకల కోసం ఇల్లు తగులబెట్టుకున్న చందంగా చేసి, రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టవద్దు. కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రజా రాజధానిని నిర్మించడానికి ఈ ప్రభుత్వంకూడా నడుం బిగించాలి. అంతర్జాతీయ యువనికపై అమరావతి విజయ పతాక ఎగర వేస్తుందని అయిదు కోట్ల ఆంధ్రులు విశ్వసించారు. వారి నమ్మ కాన్ని వమ్ముకానివ్వ వద్దు. 

రాజధానిని విశాఖకు తరలించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 29 గ్రామాల ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. 45రోజులుగా పిల్లాపాపలతో సహా కుటుంబాలన్నీ రోడ్లపైకి వచ్చి తీవ్ర ఆందోళన చేస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన ఈ రైతులకు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక నుంచి రైతులు సంఘీభావం తెలుపుతున్నారు. తెలంగాణ నుంచి నల్గొండ జిల్లా రైతులు పెద్దఎత్తున తరలివచ్చి తమ మద్దతు తెలిపారు. ఇలా రైతులంతా సంఘటితమవుతూండడం చూస్తుంటే ఈ ఆందోళన దేశవ్యాప్త ఆందోళనగా మారే అవకాశముందని స్పష్టమవుతున్నది. నాగజెముడు వలే నవ్యాంధ్ర ను నాశనం చేస్తున్నది వైసీపీ ప్రభుత్వం. జగన్‌ సంకుచిత రాజకీయ పైత్యం రాష్ట్రాభివృద్ధికి శరాఘాతంగా మారింది. రాష్ట్ర విభజనతో నవ్యాంధ్ర ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో రాజధానిని మార్చి మరోసారి వికృత ప్రయోగం చేయడం మంచిది కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్‌ తన ఆలోచనా ధోరణిని విరమించుకోవాలి.

నెల్లూరు దుర్గాప్రసాద్‌

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి

Updated Date - 2020-02-02T04:47:30+05:30 IST