అనాలోచిత నిర్ణయంతో అథోగతి

ABN , First Publish Date - 2022-01-18T06:23:34+05:30 IST

అమరావతి అభివృద్ధిని నిట్టనిలువునా నిలిపేసి మూడు రాజధానులపై సీఎం జగన్‌రెడ్డి తీసుకున్న అనాలోచిత తుగ్లక్‌ నిర్ణయంతో రాష్ట్రం అథోగతి పాలైందని అమరావతి రైతులు తెలిపారు.

అనాలోచిత నిర్ణయంతో అథోగతి
సేవ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ అబ్బరాజుపాలెం శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు

762వ రోజు దీక్షల్లో రాజధాని రైతులు

తుళ్లూరు, జనవరి 17: అమరావతి అభివృద్ధిని నిట్టనిలువునా నిలిపేసి మూడు రాజధానులపై  సీఎం జగన్‌రెడ్డి తీసుకున్న అనాలోచిత తుగ్లక్‌ నిర్ణయంతో రాష్ట్రం అథోగతి పాలైందని అమరావతి  రైతులు తెలిపారు. ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ రైతులు, మహిళలు చేస్తోన్న దీక్షలు సోమవారంతో 762వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేకపోగా, ఒక్క పరిశ్రమ వచ్చిన దాఖలాలు లేవన్నారు. మూడు ముక్కల ఆటతో ఏ ఒక్క సంస్థ ఏపీ వైపు చూడడం లేదన్నారు. యువత ఉపాధి లేక అల్లాడుతుందన్నారు.  అదే అమరావతి అభివృద్ధి కొనసాగుతుంటే రాష్ట్ర ప్రగతి మరో విధంగా ఉండి ఉండేదన్నారు. అమరావతిలోనే అనేక ఉద్యోగాలుండేవన్నారు. స్వార్థ రాజకీయాల కోసం అమరావతిని బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రాష్ట్రం, ఇకే రాజధాని అమరావతి.. ఆంధ్రుల ఆత్మ గౌరవం అమరావతి.. సేవ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ ధర్నా శిబిరాలలో నినాదాలు హోరెత్తాయి. తుళ్లూరు, పెదపరిమి, రాయపూడి, దొండపాడు, నెక్కల్లు, అబ్బరాజుపాలెం, మందడం, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, వెంకటపాలెం, ఐనవోలు తదితర రాజధాని గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. 


Updated Date - 2022-01-18T06:23:34+05:30 IST