రైతులకు చేసిన పాపం ఊరికే పోదు

ABN , First Publish Date - 2022-08-08T06:01:39+05:30 IST

అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులను అటకెక్కించి, రాజధానిని నిర్వీర్యంచేస్తూ ఆ ప్రాంత రైతులకు ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని, ఆ పాపం ఊరికే పోదని అమరావతి రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులు, ఆయా ప్రాంతాల మహిళలు అన్నారు.

రైతులకు చేసిన పాపం ఊరికే పోదు
పెదపరిమి ధర్నా శిబిరంలో నినాదాలు చేస్తున్న రైతులు

అమరావతిని పనిగట్టుకొని నిర్వీర్యం చేస్తున్నారు

మూడు రాజధానుల పేరుతో కాలక్షేపం

964వ రోజుకు చేరుకున్న ఆందోళనలు 

తుళ్ళూరు, ఆగస్టు 7: అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులను అటకెక్కించి, రాజధానిని నిర్వీర్యంచేస్తూ ఆ ప్రాంత రైతులకు ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని, ఆ పాపం ఊరికే పోదని అమరావతి రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులు, ఆయా ప్రాంతాల మహిళలు అన్నారు. బిల్డ్‌ అమరావతి  సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, హైకోర్టు తీర్పును అమలు చేయాలని రైతులు, మహిళలు,  రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలు ఆదివారం నాటికి 964వ రోజుకు చేరుకున్నాయి. ఈసందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుండి వారు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం  కేంద్రం మెడలు వంచైనా సరే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని సీఎం జగన్‌రెడ్డి  ఎక్కడని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తెరపైకి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చాన్నారు.  విభజన రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వటమే రైతులు చేసిన మహానేరంగా ప్రస్తుత పాలకుల ప్రవర్తన ఉందన్నారు.  ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అమరావతి అని, అన్నీ పార్టీలు మద్దుతునిస్తుంటే వైసీపీ మాత్రం ఎన్నికల ముందు అమరావతిని స్వాగతించి, అధికారంలోకి రాగానే మూడు ముక్కల ఆటకు తెరతీసి రైతులను మోసం చేసిందన్నారు. అమరావతి రాజధానిని ఆరు నెలల్లో  అభివృద్ది చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పక్కన పెట్టారంటే అమరావతిపై ఏ విధంగా కక్ష పెంచుకున్నారో అర్ధం అవుతుందన్నారు. ఈ విషయంలో కోర్టు ధిక్కారం కింద పాలకులు, అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. బిల్డ్‌ అమరావతి అంటూ దీపాలు వెలిగించి నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి.  


Updated Date - 2022-08-08T06:01:39+05:30 IST