మూడు రాజధానులు ముగిసిన అధ్యాయం

ABN , First Publish Date - 2022-07-04T05:59:34+05:30 IST

మూడు రాజధానులు ఇక ముగిసిన అధ్యాయమేనని, ఇప్పటికైనా ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి తన చిత్త శుద్దిని చాటుకోవాలని రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులు పేర్కొ న్నారు.

మూడు రాజధానులు ముగిసిన అధ్యాయం
దొండపాడు శిబిరంలో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న రైతులు

929వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల దీక్షలు

తుళ్ళూరు, జులై 3: మూడు రాజధానులు ఇక ముగిసిన అధ్యాయమేనని, ఇప్పటికైనా ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి తన చిత్త శుద్దిని చాటుకోవాలని రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులు పేర్కొ న్నారు. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు చేస్తున్న ఉద్యమం ఆదివారం నాటికి 929వ రోజుకు చేరుకుంది ఈ సందర్బంగా రైతు ధర్నా శిబిరాల నుండి వారు మాట్లాడుతూ హైకోర్టు తీర్పును గౌరవించి రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతిలో మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి పనులను ప్రారంభించాలని కోరారు. తమకు జీవనాధరమైన భూములను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో రాజధాని నిర్మాణానికి త్యాగం చేస్తే, ఈ ప్రభుత్వం రాజధాని అభివృద్ధిని కుంటుపర్చి తమను రోడ్డున పడేసిందన్నారు. పాలకులు ఏనాడైనా భూముల త్యాగానికి పూనుకుంటే కదా వారికి తమ బాద తెలిసొచ్చేదని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే రాజధాని ప్రాంత పేదలకు టిడ్కో గృహాలను వెంటనే అందజేయాలన్నారు. వ్యవసాయ కూలీలు, పేదలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన పింఛన్‌ను నిలిపివేయడంతో వారు ఇబ్బంది పడుతున్నారని వెంటనే పింఛను చెల్లింపు చేయాలన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. బిల్డ్‌ అమరావతి అంటూ దీపాలు వెలిగించి నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి.


Updated Date - 2022-07-04T05:59:34+05:30 IST