అమరావతి రైతులంటే ఎందుకంత కక్ష

ABN , First Publish Date - 2022-08-06T05:11:10+05:30 IST

రైతులను అన్యాయం చేసిన ప్రభుత్వాలు ఎక్కువకాలం మనుగడ సాగించిన దాఖలాలు లేవని రాజధాని అమరావతికి 33వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు.

అమరావతి రైతులంటే ఎందుకంత కక్ష
వెలగపూడి శిబిరంలో బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న రైతులు

న్యాయం అడిగితే అక్రమ కేసులు పెడతారా..?
962వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు
తుళ్లూరు, ఆగస్టు 5: రైతులను అన్యాయం చేసిన ప్రభుత్వాలు ఎక్కువకాలం మనుగడ సాగించిన దాఖలాలు లేవని రాజధాని అమరావతికి 33వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు శుక్రవారం 962వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ న్యాయం అడుతుంటే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రైతులపై ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. మూడు ముక్కల ఆటతో భూములు త్యాగం చేసిన రైతుల గొంతు కోయాలని పాలకులు చూస్తున్నారని అన్నారు. న్యాయదేవత తమ ఆవేదన, బాధను అర్థం చేసుకుందన్నారు. అమరావతిని అభివృద్ధి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుండటం సిగ్గుచేటన్నారు. బిల్డ్‌ అమరావతి అంటూ దీపాలు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2022-08-06T05:11:10+05:30 IST