అమరావతి అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి

ABN , First Publish Date - 2022-05-19T05:04:46+05:30 IST

రాజధాని అమరావతి అభివృద్ధితోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి ఆధారపడి ఉందని రాజధాని రైతులు తెలిపారు.

అమరావతి అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి
వెంకటపాలెం రైతు ధర్నా శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు, రైతులు

883వ రోజు దీక్షలో రాజధాని రైతులు, మహిళలు

తుళ్లూరు, మే 18: రాజధాని అమరావతి అభివృద్ధితోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి ఆధారపడి ఉందని రాజధాని రైతులు తెలిపారు. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, హైకోర్టు తీర్పును అమలు చేయాలని రైతులు, మహిళలు,  రైతు కూలీలు చేస్తున్న ఉద్యమం బుధవారం నాటికి 883వ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా వారు  రైతు ధర్నా శిబిరాల నుంచి మాట్లాడుతూ ప్రజా రాజధాని అమరావతి అభివృద్థిని వైసీపీ ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటుందనీ, తమ వ్యక్తిగత, స్వార్ధ రాజకీయ ప్రయోజ నాల కోసమే మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చి ప్రజలను గందరగోళ పరిచారని రైతులు ఆరోపించారు. నవ నగరాలుగా రాజధాని అమరావతిని మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అభివృద్థిని కొనసాగించి ఉంటే రాష్ట్ర ప్రగతి అద్భుతంగా ఉండేదన్నారు. రాష్ట్రానికి పెట్టబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండేవని కానీ వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని నిర్వీర్య పరిచి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుందని అన్నారు. పాలకులు మారినప్పుడల్లా రాజధానిని మార్చుకుంటూ పోతే రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడతాయని, ఇప్పుడు ఆ దశలోనే రాష్ట్రం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హైకోర్టు తీర్పును గౌరవించి అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమం  కొనసాగింది. రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు  కొనసాగాయి.


Updated Date - 2022-05-19T05:04:46+05:30 IST