నిన్న కొట్టుడు.. నేడు కేక్ పెట్టుడు.. సుబ్బారావు గుప్తాకు కేక్ తినిపించిన మంత్రి బాలినేని

ABN , First Publish Date - 2021-12-21T20:23:20+05:30 IST

వైసీపీ నేత సుబ్బారావు గుప్తాను మంత్రి బాలినేని మంగళవారం విజయవాడ తీసుకెళ్లారు.

నిన్న కొట్టుడు.. నేడు కేక్ పెట్టుడు.. సుబ్బారావు గుప్తాకు కేక్ తినిపించిన మంత్రి బాలినేని

అమరావతి: వైసీపీ నేత సుబ్బారావు గుప్తాను మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మంగళవారం విజయవాడ తీసుకెళ్లారు. సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారావు గుప్తాకు మంత్రి బాలినేని కేక్‌ తినిపించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ మంత్రి బాలినేని తనకు అండగా ఉంటానన్నారని, పోలీసులు రక్షణ కల్పిస్తారని హామీ ఇచ్చారని చెప్పారు. జై జగన్, జై బాలినేని, వర్ధిల్లాలి జగన్ నాయకత్వం అంటూ సుబ్బారావు నినాదాలు చేశారు. 


కాగా సుబ్బారావు గుప్తాపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఆర్యవైశ్యులు ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా  ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుబ్బారావు గుప్తాపై దాడి చేసిన మంత్రి బాలినేని అనుచరుడు సుబానీ క్షమాపణ చెబుతూ వైసీపీ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే నిరాహార దీక్షకు దిగుతామని ఆర్యవైశ్యులు హెచ్చరించారు. అయితే సుబ్బారావు గుప్తాపై దాడి కేసులో సుబానీని పోలీసులు అరెస్ట్‌ చేయలేదు. అతనిపై కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు.


పూర్తి వివరాలు...

మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీల తీరుతో పార్టీకి నష్టం వాటిల్లుతోందంటూ వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు ఆదివారం అర్ధరాత్రి దాటాక దాడిచేశారు. ఆయన ఇంట్లో వీరంగం సృష్టించిన కొద్ది గంటల్లోనే గుంటూరులోని ఓ లాడ్జీలో గుప్తాను గుర్తించి దాడిచేశారు. ‘నా కొడకా.. నిన్ను చంపేస్తాం’ అంటూ చెలరేగిపోయారు. కాళ్లావేళ్లా పడినా.. పిల్లలు ఉన్నారు...కరుణించాలని వేడుకున్నా వదిలిపెట్టకుండా పిడిగుద్దులు కురిపించారు. బెదిరిస్తూ..బూతులు తిడుతూ..పదేపదే కొడుతూ కొన్ని గంటలపాటు సుబ్బారావు గుప్తాకు నరకం చూపించారు. ఈ దాడి సమయంలో తీసిన వీడియో సోమవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వైసీపీ నేత సుభానీ తన అనుచరులతో కలిసిన ఆ వీడియోలో గుప్తాపై దాడి చేయడం స్పష్టంగా కనిపించింది. ‘‘నా కొడకా! ఎవరి గురించి మాట్లాడావు....ఎవరు చెబితే మాట్లాడావు.. అంటూ సుభానీ పదేపదే గుప్తాను కొట్టాడు. తనకు ఎవరూ చెప్పలేదని, ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయిందని గుప్తా వేడుకున్నా వదలకుండా కొడుతూనే ఉన్నాడు. ‘నా కొడకా.. వాసన్న గురించే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతావా.. తప్పు అయ్యింది వాసన్న అని క్షమాపణలు చెప్పు. నా కొడకా తిన్నింటి వాసాలనే దెబ్బతిస్తావా.....’ అంటూ ముఖం మీద పదేపదే గుద్దాడు. ‘అన్నా.. నేను చిన్నప్పటి నుంచి పార్టీకి సేవ చేశానన్న... నన్ను వదిలేయన్నా’ అని గుప్తా వేడుకున్నారు. ‘ఎవరికి రా చేసింది.. విశ్వాసం లేని కుక్కా..’ అంటూ పదేపదే కొడుతూనే ఉన్నాడు. ఒకదశలో సుభాని మరింత రెచ్చిపోయి.. ‘నా కొడకా నిన్ను చంపేస్తాను.... ఎవరి గురించి మాట్లాడవురా’ అంటూ గద్దించాడు. చివరకు సుబ్బారావు గుప్తాను మోకాళ్లపై కూర్చోబెట్టి మంత్రి బాలినేనికి  క్షమాపణలు చెప్పించారు. ఆ మొత్తాన్ని ఏదో ఘనకార్యం చేస్తున్నట్లుగా ఫోన్‌లో వారికి వారే వీడియో తీశారు. ఈ వీడియో లీకై అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Updated Date - 2021-12-21T20:23:20+05:30 IST