Abn logo
Aug 9 2021 @ 17:48PM

'అమరావతి' అంటే అంత భయమెందుకు : శివారెడ్డి

అమరావతి: అమరావతి అంటేనే వైసీపీ ప్రభుత్వం గజగజలాడుతోందని.. అందుకే ర్యాలీలను అడ్డుకునేందుకు వేలాది మంది పోలీసులను మోహరిస్తోందని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి అన్నారు. అమరావతి రాజధాని సాధన కోసం రైతులు, ప్రజలు చేపట్టిన నిరసనలను పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ అమరావతి రాజధాని సాధన కోసం ఇంతమంది పోరాడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందన్నారు. మా సంకల్పం నెరవేరే వరకూ పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు.

అమరావతి రాజధాని జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ పోలీసులు మానవత్వాన్ని మరచి ప్రవర్తిస్తున్నారని.. మహిళలు అని కూడా చూడకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిపై మంత్రి కన్నబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఉద్యమాలకు రాజకీయాలను ఆపాదించడం సరికాదని హితవు పలికారు. శాంతియుత ఉద్యమాలకు.. పోటీ ఉద్యమాలు నడిపి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దళిత జేఏసీ నేత మార్టిన్ మాట్లాడుతూ పోలీసులను అడ్డుపెట్టుకుని అమరావతి ఉద్యమాన్ని అపలేరని చెప్పారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న వారిని రెచ్చగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జేఏసీ నాయకుడు గద్దె తిరుపతిరావు మట్లాడుతూ శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నా.. పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని వారు హితవు పలికారు.