మూడు రాజధానులకు వ్యతిరేకంగా మందడం శిబిరంలో నిరసన తెలుపుతున్న రైతులు
720వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతులు
తుళ్లూరు, డిసెంబరు 6: అమరావతికి తరతరాలుగా వస్తున్న భూములను ఇచ్చిన అన్నదాతలను ప్రస్తుత పాలకులు అవమానిస్తున్నారని రాజధాని రైతులు వాపోయారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని రైతులు చేస్తోన్న ఉద్యమం సోమవారంతో 720వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు రైతు ధర్నా శిబిరాల నుంచి మాట్లాడుతూ వ్యక్తులను చూసి కాదు అమరావతి కోసం తాము భూములిచ్చామన్నారు. ఎన్నికల ముందు స్వాగతిస్తున్నామని అధికారం చేపట్టిన తర్వాత జగన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారన్నారు. అమరావతిపైన, భూములు ఇచ్చిన రైతులపైన కక్షతో సీఎం జగన్‌రెడ్డి అభివృద్ధిని మరిచి విధ్వంసం చేయటమే లక్ష్యంగా పని చేస్తున్నారని తెలిపారు. రాజధాని ప్రాంతంలో కూడా వైసీపీ గెలిచినా కక్ష కట్టి అమరావతిని నాశనం చేస్తున్న జగన్‌రెడ్డికి తగిన గుణపాఠం చెపుతామన్నారు. ప్రజాస్వామ్యంలో నియంత పాలన జగన్‌రెడ్డితోనే ఆవిర్భవించిందన్నారు. రాజధాని 29 గ్రామాల్లో అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.