న్యాయం మావైపే.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలి

ABN , First Publish Date - 2020-08-05T14:20:09+05:30 IST

న్యాయం తమ వైపే ఉందని.. తమది ధర్మపోరాటం అని రాజధాని రైతులు స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో తమ హక్కులు కాలరాస్తున్నారని ఆరోపించారు.

న్యాయం మావైపే.. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలి

మీరే దిక్కంటూ న్యాయమూర్తులకు దండాలు

గుంటూరులో సీపీఐ నారాయణ ఆందోళన

231వ రోజు కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు 


గుంటూరు (ఆంధ్రజ్యోతి): న్యాయం తమ వైపే ఉందని.. తమది ధర్మపోరాటం అని రాజధాని రైతులు స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో తమ హక్కులు కాలరాస్తున్నారని ఆరోపించారు.  చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరామా అని ప్రశ్నించారు.  పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ డిమాడ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు చేస్తున్న ఆందోళనలు మంగళవారం 231వ రోజుకు చేరాయి. ప్రజా రాజధాని నిర్మిస్తామని భూములు తీసుకుని, రాజధానిని రాజకీయ  క్రీడగా మార్చారని మండిపడుతూ అమరావతి 29 గ్రామాల రైతులు, మహిళలు రోడ్డెక్కారు. 


రాజధానిలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రపాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ డిమాడ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు చేస్తున్న ఆందోళనలు మంగళవారం 231వ రోజుకు చేరాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్షా శిబిరాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం, పెదపరిమి గ్రామాల్లో రైతు దీక్షా శిబిరంలో నిరసనలు  కొనసాగించారు. తాళ్లాయపాలెం నుంచి నేలపాడు వరకు 29 గ్రామాల రైతులు, మహిళలు భౌతికదూరం పాటిస్తూ మానవహారంగా ఏర్పడ్డారు.  హైకోర్టు న్యాయమూర్తులు కోర్టుకు వెళ్లే సమయంలో మోకాళ్లపై నిలబడి దండం పెడుతూ ’మీరే దిక్కు... మా జీవితాలు మీ చేతుల్లో’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి వేడుకున్నారు. తాము చేస్తున్న ధర్మపోరాటంలో విజయం చేకూరాలని కోరుతూ మహిళా రైతులు శిబిరాల్లో, గుంటూరు విద్యానగర్‌లోని సాయిమందిరంలో నాన్‌ పొలిటికల్‌ జేఏసీ నేతృత్వంలో హనుమాచాలిసా పఠించారు. రైతులకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలిపారు.


మూడు రాజధానుల బిల్లులపై గవర్నర్‌ సంతకానికి నిరసనగా మంగళవారం గుంటూరులో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ నేతృత్వంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు, తర్వాత నవరత్నాల ప్రచారం తప్ప రాజఽధాని మార్పు ఎక్కడైనా చెప్పారా అని ప్రశ్నించారు.  అదే ప్రభుత్వ కోరిక అయితే మరలా ఎన్నికలకు అదే అజెండాతో వెళ్ళాలన్నారు. బీజేపీ ఈ విషయంలో మూడో ముద్దాయన్నారు. కేవలం కన్నా లక్ష్మీనారాయణ రాజధానికి అనుకూలంగా ఉన్నారన్న కారణంతోనే తొలిగించారన్నారు. రాజధాని పెడతామంటే రైతులు భూములిచ్చారని లేదంటే సెంటు కూడా ఇవ్వరన్నారు. ప్రభుత్వం వెనక్కు తగ్గే వరకు పోరాటం చేస్తామన్నారు. అనంతరం సీసీఐ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరండల్‌పేట  పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.


మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, యర్రబాలెం,  బేతపూడి గ్రామాల్లో మహిళలు, రైతులు ప్లకార్డుల చేతబట్టి నిరసనలో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్లే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని పోలీసుస్టేషన్లలో రైతులు ఫిర్యాదు చేశారు. రాజధాని విషయంలో తమను నమ్మించి మోసం చేశారని ఫిర్యాదులో తెలిపారు.  కార్యక్రమాల్లో జెట్పీటీసీ మాజీ సభ్యురాలు ఆకుల జయసత్య, సీపీఎం నాయకులు ఎం.రవి, భాగ్యరాజ్‌, రైతు సంఘ నాయకులు ఎ.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో రైతులు, మహిళలు మంగళవారం నిరసనలు చేపట్టారు. 

Updated Date - 2020-08-05T14:20:09+05:30 IST