అమరావతి కోసం.. అలుపెరగని పోరాటం

ABN , First Publish Date - 2021-04-10T05:30:00+05:30 IST

అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ ఆ ప్రాంత వాసులు అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు.

అమరావతి కోసం.. అలుపెరగని పోరాటం
అనంతవరం వేంటేశ్వరస్వామి వారికి పొంగళ్లు, గుమ్మడికాలను తీసుకెళుతున్న మహిళలు

480వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు

కొనసాగుతున్న దళిత చైతన్య యాత్ర 

తుళ్లూరు, తాడికొండ, తాడేపల్లి, ఏప్రిల్‌ 10: అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ ఆ ప్రాంత వాసులు అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు. రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు శనివారం 479వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరాల్లో వారు మాట్లాడుతూ అమరావతినే రాష్ట్ర రాజధానిగా ఐదుకోట్ల మంది ఆంధ్రులు అంగీకరించారన్నారు. కానీ పాలకుల బాధ ఏమిటో అర్ధం కావడం లేదన్నారు. అమరావతి అభివృద్ధి రాష్ట్రాభివృద్ధితో ముడిపడి ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పోరాటం చేస్తామన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. అనంతవరం వేంకటేశ్వరునికి రాజధాని మహిళలు పొంగళ్ళు సమర్పించారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావవతి కొనసాగాలని ప్రార్థించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం ముక్కామల గ్రామంలో రైతులు, మహిళలు  నిరసనలు వ్యక్తం చేశారు. మూడు రాజఽధానుల ప్రకటనను వెనకకు తీసుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఐకాస ఆధ్వర్యంలో రైతుల నిరసన దీక్షలు కొనసాగాయి. 

 

రెండో రోజుకు దళిత చైతన్య యాత్ర


 రాజధాని గ్రామాల దళితవాడల్లో చైతన్య యాత్ర రెండోరోజు కొన సాగింది. శనివారం వడ్డమాను, హరిశ్చంద్రపురం గ్రామాల్లో యాత్ర చేపట్టారు. ముఖ్యఅతిథిగా హాజరైన దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాజధానిలో ఐదువేల టిడ్కో ఇళ్ళ నిర్మాణం పూర్తయి రెండేళ్లు కావస్తున్నా దళితులకు ఇళ్లు కేటాయించలేదన్నారు.  అమరావతిని అభివృద్ధి చేస్తే ఎక్కడ దళితులు బాగుపడతారోనని సీఎం జగన్‌ రాజధానిని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. 41 జీవో అమలు చేయకపోవటంతో దళిత రైతులు రాజధానిలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అమరావతి సాంస్కృతిక చైతన్య వేదిక అధ్యక్షుడు రమణ బృందం ఈ యాత్రలో పాల్గొంది. కార్యక్రమంలో దళిత జేఏసీ సభ్యులు చిలకా బసవయ్య, ముళ్లమూడి రవి, వల్లభనేని సుబ్బారావు, తోకల రాజవర్థన్‌, మట్టుపల్లి గిరీష్‌, శానం జక్రయ్య, చేకూరి రవి, మామిడి సత్యం, చిలకా మోజెస్‌, కొమరాబత్తిన శేఖర్‌, కూరపాటి దాసు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-10T05:30:00+05:30 IST