కరోనా కంటే కాఠిన్యమా?

ABN , First Publish Date - 2020-03-31T08:59:06+05:30 IST

తాము చేస్తున్న రాజధాని ఉద్యమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌ కన్నా కఠినంగా వ్యవహరిస్తున్నాయని రాజధాని అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీలు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా కంటే కాఠిన్యమా?

  • 104 రోజులైనా పట్టించుకోరా?
  • మేం ఈ దేశంలో భాగం కాదా?
  • అమరావతి రైతులు, మహిళల ఆవేదన
  • కొనసాగిన రాజధాని ఆందోళనలు


గుంటూరు, మార్చి 30(ఆంధ్రజ్యోతి): తాము చేస్తున్న రాజధాని ఉద్యమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌ కన్నా కఠినంగా వ్యవహరిస్తున్నాయని రాజధాని అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీలు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి కొనసాగిన జమ్ము కశ్మీర్‌ సమస్యకు కేవలం రెండు గంటల్లోనే చెక్‌ పెట్టారని, కానీ, 104 రోజులుగా రాజధాని కోసం పోరాడుతున్న తమను కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రతికూల పరిస్థితుల్లో ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్నామన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని ప్రాంతాల్లో చేస్తున్న ఆందోళనల సోమవారం 104వ రోజు కూడా కొనసాగాయి. కరోనా నేపథ్యంలో దూరం దూరంగా కూర్చుంటూ  ఆందోళనలు కొనసాగించారు.


రాష్ట్ర వ్యాప్తంగా ‘జై అమరావతి’ మాస్కులు

‘ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పోవాలి.. రాజధానిగా అమరావతి కావాలి’ అంటూ మహిళలు మాస్కులు తయారీ చేసి అందరికీ పంపిణీ చేశారు.  కాగా, సోమవారం మొత్తం 29 గ్రామాల్లో మహిళలు బృందాలుగా ఏర్పడి ఆందోళనలు కొనసాగించారు. రాత్రి 7.30 గంటలకు విద్యుత్‌ నిలిపివేసి కొవ్వొత్తులు వెలిగించి ‘అమరావతి వెలుగు’ పేరిట నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-03-31T08:59:06+05:30 IST