ఉద్యమం .. ఎట్‌ 600

ABN , First Publish Date - 2021-08-08T04:43:53+05:30 IST

పోలీసుల లాఠీ దెబ్బలకు వెరవలేదు..

ఉద్యమం .. ఎట్‌ 600
రాజధాని గ్రామాల్లో రైతులు మహా ర్యాలీ(పాత చిత్రం)

అలుపెరగని అమరావతి పోరు

అప్రతిహతంగా సాగుతున్న ఆందోళనలు

ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం..

నేటితో ఉద్యమానికి 600 రోజులు

న్యాయస్థానం టూ దేవస్థానం.. ర్యాలీని ప్రకటించిన రాజధాని రైతులు

పోటీగా బహుజనపరిరక్షణ సమితి ర్యాలీకి సిద్ధం

అప్రమత్తమైన పోలీసులు 


(ఆంధ్రజ్యోతి, గుంటూరు, తుళ్లూరు): వారంతా ఇల్లు, వ్యవసాయం తప్ప మరో ప్రపంచమే తెలియని సామాన్య మహిళలు, రైతులు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం ప్రకటించిన తొలిరోజు నుంచి అన్నీ వదిలేసి పోరుబాట పట్టారు. పోలీసు ఆంక్షలకు, లాఠీ దెబ్బలకు ఎదురొడ్డారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వెరవక విభిన్న రూపాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. అణచివేతకు అదరం... ఆంక్షలకు బెదరం... అంతిమ లక్ష్యం అమరావతే అంటూ రాజధాని మహిళలు పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. వారి ఉద్యమం నేటి (ఆదివారం)తో 600వ రోజుకు చేరుకోనుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..  


పోలీసుల లాఠీ దెబ్బలకు వెరవలేదు. అక్రమ కేసులు బనాయించి రోజుల తరబడి జైళ్లలో పెట్టినా కుంగిపోలేదు. కరోనా మహమ్మారికి భయపడిపోయి అస్త్రసన్యాసం చేయలేదు. అధికార పార్టీ మూకల కవ్వింపు చర్యలకు రెచ్చిపోలేదు. శాంతియుత మంత్రాన్ని జపిస్తూ అమరావతి ఏకైక రాజధాని నినాదంతో అలసిపోకుండా లక్ష్యం సాధించేంత వరకు విశ్రమించేది లేదని భీష్మించుకొన్నారు. అప్రతిహతంగా సాగుతున్న అమరావతి ఉద్యమం ఆదివారానికి 600వ రోజుకు చేరుకోనుంది. గత ఏడాది డిసెంబరులో ప్రారంభమైన అమరావతి ఉద్యమం ఏ ఒక్క రోజూ విశ్రమించలేదు. తొలుత మూడు గ్రామాలు మందడం, వెలగపూడి, తుళ్లూరులో ప్రారంభమైన ఉద్యమం కొద్దిరోజుల్లోనే రాజధానిలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. క్రమేపీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా రూపాంతరం చెందింది.


వైసీపీ అధికారంలోకి రాగానే..

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే అమరావతికి మరణ శాసనం లిఖించింది. తొలుత పనులు నిలిపేసింది. ఆ తర్వాత డిసెంబరు నెలలో మూడు రాజధానుల ప్రకటన చేసింది. అమరావతి రాజధాని తరలిపోతే తమ బతుకులు బుగ్గి పాలు అవుతాయని, అలానే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని భావించిన రైతులు ఉద్యమబాట పట్టారు. ఉదయాన్నే పనులు ముగించుకొని శిబిరాల బాట పట్టడం వారికి దినచర్యగా మారిపోయింది. మహిళలు చూపిస్తున్న తెగువ చరిత్ర పుటల్లో లిఖించేలా ఉంది. 


ఎన్నో ఆంక్షలు.. అయినా వెరవలేదు..

తొలి రోజుల్లో రోడ్ల పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో టెంట్లు వేసుకొని ఉద్యమం నిర్వహించారు. అయితే కొద్ది రోజుల తర్వాత పోలీసులు అంగీకరించకపోవడంతో రైతుల సొంత స్థలాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. పోరాటంలో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మని దర్శించుకునేందుకు బయలుదేరిన మహిళలని పాశావికంగా పోలీసులు అడ్డుకొన్నారు. ఇనుప కంచెలు వేసి, లాఠీలకు మేకులు గుచ్చి దాడి చేశారు. అయినాసరే వారు గాయాలకు కట్లు కట్టుకొని మరుసటి రోజే ఉద్యమానికి హాజరై అందరిలో స్ఫూర్తి, చైతన్యాన్ని రగిల్చారు. గత ఏడాది జనవరి నెలలో అసెంబ్లీ ముట్టడికి పిలుపు నిచ్చారు. మహిళలు పోలీసుల వలయాలను ఛేదించుకొంటూ ఎంపీ గల్లా జయదేవ్‌ సారధ్యంలో వెళ్లి అసెంబ్లీ గోడలను తాకి తమ పోరాట పటిమని ప్రదర్శించారు. రాయపూడిలో దళిత, ముస్లిం మైనార్టీ మహిళలు ఉద్యమ శిబిరం ఏర్పాటు చేసి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. 


కరోనా నిబంధనలు పాటిస్తూనే..

మార్చి నెలలో కరోన వైరస్‌ మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పుడు రైతులు భయపడలేదు. సామాజిక దూరం పాటిస్తూ ఉద్యమాన్ని లాక్‌డౌన్‌ సమయంలోనూ ముందుకు నడిపించారు. కాగా రైతుల పుండుపై కారం చల్లినట్లుగా ప్రభుత్వం మూడు రాజధానులకు మద్దతిచ్చే కొద్దిమందిని పోగేసి పోటీగా ఉద్ధండ్రాయునిపాలెం సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వద్ద ఆందోళనలు చేయిస్తోంది. వారిని రాజధాని రైతులు అడ్డుకొన్నారని ఆరోపిస్తూ దళిత రైతుల పైన అక్రమంగా ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు బనాయించింది. దీని వలన నెలపాటు రైతులు జైలులోఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


నేడు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు ర్యాలీ

అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం ఆదివారానికి 600వ రోజుకు చేరనున్న సందర్భంగా ’న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరిట బైక్‌ ర్యాలీ నిర్వహించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదివా రం ఉదయం 9 గంటలకు హైకోర్టు వద్ద నిర్మాణంలో ఉన్న జడ్జిల క్వార్టర్స్‌ నుంచి ర్యాలీగా బయలుదేరి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. మార్గం మద్యంలోని చర్చి, మసీదులో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాజధాని ప్రాంతంలో ఆదివారం ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదంటూ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. గ్రామాల్లో ఇనుప కంచెలు ఏర్పాటుచేశారు. రైతుల ఉద్యమానికి మద్దతు ఇస్తూ ర్యాలీలో పాల్గొంటున్నట్లు టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌ కుమార్‌  ప్రకటించారు.


పోటీగా నిరసనలు

కాగా మూడు రాజధానులకు మద్దతుగా తాళ్లాయపాలెం వై జంక్షన్‌ వద్ద ఆందోళన చేస్తున్న బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం రాజధాని రైతుల నిరసనలకు పోటీగా ర్యాలీ చేపట్టనున్నారు. ఈ మేరకు శనివారం మైకుల్లో ప్రచారం చేశారు. తాము దేవస్థానంటూ న్యాయస్థానం పేరిట ర్యాలీ చేస్తున్నామని ఉదయం 9 గంటలకు మంగళగిరి లక్ష్మీనరసింహాస్వామి ఆలయం వద్ద బయలు దేరతామని ప్రకటించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 


కొనసాగుతున్న ఆందోళనలు

తుళ్లూరు: అమరావతినే రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు శనివారం 599వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఉద్యమ శిబిరాల్లో రైతులు మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి చెందితేనే రాష్ట్ర భవిష్యత్‌ బాగుంటుందని అన్నారు. 600వ రోజు తాము చేపడుతున్న ర్యాలీని భగ్నం చేయటానికి పెయిడ్‌ ఆర్టిస్టులను దించి శాంతి భద్రతల సమస్యను సృష్టించాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. అమరావతి వెల3ుగు కార్యక్రమంలో భాగంగా రాత్రి దీపాలు వెలిగించి జై.. అమరావతి నినాదాలు చేశారు.  


Updated Date - 2021-08-08T04:43:53+05:30 IST