Abn logo
Jun 11 2021 @ 00:03AM

మానవతా మణిదీపం

కుల మతాలకూ, వర్గ వర్ణాలకూ అతీతంగా... సమస్త సమాజాన్నీ అక్కున చేర్చుకున్న అమరానందమయి జిల్లెళ్ళమూడి అమ్మ. సామ్యవాద స్ఫూర్తిని ఆచరణీయం చేసిన ఆనందహేల... అమ్మ జీవిత గమనం.


ఆరు దశాబ్దాలకు పైగా దేహంలోనూ, మూడున్నర దశాబ్దాలు దేహాతీతంగా, సర్వవ్యాపిగా అమ్మ సంచారం సమస్తం ఒక అనుష్ఠాన వేదాంత భూమిక. అరవై సంవత్సరాల జీవన ప్రయాణంలో అమ్మ చేసిన అంకురార్పణలన్నీ విద్య, వైద్యం, సమాజ సేవ, సంప్రదాయ పునరుద్ధరణ, మానవతా వికాసం, వ్యక్తి పరిణామం, అధివాస్తవిక జీవన విధానం, జీవన్ముక్త స్థితులు, జీవకారుణ్యం, సమత్వం, సర్వత్రా ఆత్మదర్శనం తదితర మహోదాత్త భావనల చుట్టూ అల్లుకున్న పందిరి. అక్కడ అందరికీ అమ్మే ఆలంబన, ఆశ్వాసన.

అమ్మ సంకల్పాలన్నీ రూపుదాల్చి, అవనిలో మానవతా స్ఫూర్తిని రలిగించే వరకూ ఆరని జ్వాలల్లా వెలుగులీనడం ఈనాటి వాస్తవం. విద్యాలయంలో ప్రజ్ఞాన జ్యోతులు ప్రతిభావంతంగా ప్రకాశిస్తూ, జ్ఞాన దీపాలను వెలిగిస్తూ ఉండడం నేటికీ నిజం. వైద్యాలయంలో అమ్మ అనుగ్రహం ఎందరికో ఆయువునివ్వడం నిత్య సత్యం. అమ్మ తాను నివసించిన ప్రదేశానికి ‘అందరిల్లు’ అని పేరు పెట్టినందుకు, వేలాది జనులకు అది స్వాంతనాలయం అయింది. ఎలాంటి భేదాలూ లేకుండా... అందరికీ అది పుట్టినిల్లే! 


‘అన్ని బాధల కన్నా ఆకలి బాధ భయంకరమైనది, దుర్భరమైనది. అన్నం దొరక్క ఎవరూ మరణించకూడదు’ అని అమ్మ వెలిగించిన పొయ్యి అరవయ్యేళ్ళుగా ఆరకుండా వెలుగుతోంది. అది అమ్మ భావనా బలం. అదే భావం, అదే స్ఫూర్తి, అదే ఆదరణ, అదే ఆప్యాయతలతో నేటికీ జిల్లెళ్ళమూడిలో అన్నపూర్ణాలయంగా అది విలసిల్లుతోంది. 

‘విన్నవాడు విమర్శిస్తాడు. కన్నవాడు వివరిస్తాడు’ అన్న అమ్మ మాట విశ్వజనీనమైనది. ఒకసారి ఆశ్రమాన్ని దర్శించుకున్న వారికి జీవిత మాధుర్యం, సహజీవన సౌందర్యం, సమతాభావనలో దాగిన శక్తి, భగవద్విశ్వాసం, మానవ సంబంధాల స్ఫూర్తి, పంచడంలో ఉన్న ఆనందం, ఇవ్వడంలో ఉన్న సంతృప్తి, సంప్రదాయాల బలం, సంస్కృతీ వికాసం, జీవితాన్ని అధివాస్తవిక దృష్టితో అనుభవించగలిగే నేర్పు, ఏ కష్టాన్నయినా ఎదుర్కోగలిగే ఓర్పు, అవాంఛనీయ మూఢవిశ్వాసాలను దరిచేరనీయని వాస్తవిక దృష్టి ఏర్పడతాయి. ఇవన్నీ ఎవరూ ఎవరికీ చెప్పకుండానే జరిగిపోతాయి. ప్రవచన ప్రవాహాలు ఎవరినీ ముంచెత్తవు. ప్రబోధాల పెనుగాలులు ఎవరినీ తాకవు. ఆచరణకు నోచుకోని సూక్తులు ఎవరినీ గాయపరచవు, భయపెట్టవు. పాశ్చాత్య నాగరికతా ప్రభావం ప్రసరించని పుణ్యభూమిగా... స్వస్థితిలో నిలిచిన గంభీర ఆధ్యాత్మమూర్తి- అందరిల్లు! అక్కడ ఎవరి పనిలో వారు, ఎవరి సాధనలో వారు... కానీ అందరూ ఒకరుగా సాగించే ఆధ్యాత్మిక సాధన... ఒక అనుపమాన దృశ్యం. 

‘‘నీకున్నది తిని, ఇతరులకు ఆదరంగా పెట్టు! అంతా భగవంతుడే చేయిస్తున్నాడనుకో! తమ బతుకు బతకలేని బలహీనులు ఉన్నారు. వారికి తోడ్పడండి. సమస్త సమాజమూ, ఈ సృష్టీ భగవంతుడే. సమాజసేవ ఈశ్వర సేవే. ఆ సేవ కలిగించే తృప్తే ఆనందం. అదే ఐశ్వర్యం. తృప్తే ముక్తి’’ అని అమ్మ చేసిన బోధ మహాచైతన్య విలసితం.

తొంభై ఎనిమిదేళ్ళ క్రితం జగజ్జనీ చైతన్యం మానవదేహం ధరించి, స్త్రీ రూపం దాల్చి, మాతృభావాన్నీ, భారాన్నీ వహించి నేలపై నిలవడం ఒక ఆధ్యాత్మిక వసంతం. నాడు ప్రత్యక్షంగా ఎందరెందరినో ఆదుకున్న ఆదర హస్తం ఇప్పటికీ దివ్య స్పర్శగా... అమ్మ చేతలుగా అనుగ్రహిస్తూనే ఉంది. కన్నీళ్ళను తుడుస్తూనే ఉంది. కడుపు నిండా అన్నం పెడుతూనే ఉంది. అవిద్యలో కూరుకుపోయిన వారిని ప్రేమపూర్వకంగా చేరదీస్తూనే ఉంది. మానవతా పరిమళాన్ని వెదజల్లుతూనే ఉంది. నిరతాన్నదాన మహాయజ్ఞ కర్తగా... అమ్మ ఒక మానవతా మణిదీపం. 

(జూన్‌ 12- జిల్లెళ్ళమూడి అమ్మ నిర్యాణం 

చెందిన రోజు)

- విఎస్‌ఆర్‌ మూర్తి


Advertisement