విధులు సక్రమంగా నిర్వహించకుండా మాపై అక్రమ కేసులా?

ABN , First Publish Date - 2020-06-04T10:42:24+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు సక్రమంగా నిర్వహించని అధికారుల తీరును ప్రశ్నించినందుకు టీడీపీ నేతలపై అక్రమ కేసులు ..

విధులు సక్రమంగా నిర్వహించకుండా  మాపై అక్రమ కేసులా?

 మాజీ మంత్రి అమరనాథరెడ్డి


వి.కోట, జూన్‌ 3: స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు సక్రమంగా నిర్వహించని అధికారుల తీరును ప్రశ్నించినందుకు టీడీపీ నేతలపై  అక్రమ కేసులు బనాయించారనిమాజీ మంత్రి అమరనాథరెడ్డి విమర్శించారు. బుధవారం సాయంత్రం ఆయన  టీడీపీ నేతలతో కలసి ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై వి.కోట అర్బన్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో విచారణకు హాజరయ్యారు. మండల టీడీపీ అధినేతలతో పాటు రెండు కేసుల్లో నిందితులుగా ఉన్న 36 మంది స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. వీరందరూ సెక్షన్‌ 41 కింద నోటీసులు తీసుకుని విచారణ అనంతరం వెనుదిరిగారు. అర్బన్‌ సీఐ యతీంద్ర మాట్లాడుతూ... ఓ కేసులో మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఏ1 నిందితుడిగా ఉన్నారన్నారు. అరగంట పాటు స్టేషన్‌లో గడిపిన  అనంతరం అమరనాథరెడ్డి మీడియాతో మాట్లాడారు.


వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక అధికారులను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడిందని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు గద్దెనెక్కిన నాటి నుంచి  కక్షసాధింపులు.. బెదిరింపులు.. విధ్వంస కాండతోనే పాలన కొనసాగిస్తున్నారన్నారు. సీనియర్‌ నాయకుడినైన తనపైనే తప్పుడు కేసులు బనాయిస్తే ఇక సామాన్యుడి గతేమిటని  ప్రశ్నించారు.ఏఎంసీ మాజీ చైర్మన్‌ రామచంద్రనాయుడు,  టీడీపీ  మండల అధ్యక్షుడు రంగనాథ్‌, ప్రధాన కార్యదర్శి సోము,  తెలుగుయువత నాయకుడు ధీరజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-04T10:42:24+05:30 IST