అమర జవాన్ జ్యోతి, జాతీయ యుద్ధ స్మారక జ్యోతి విలీనం

ABN , First Publish Date - 2022-01-21T22:41:06+05:30 IST

దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న

అమర జవాన్ జ్యోతి, జాతీయ యుద్ధ స్మారక జ్యోతి విలీనం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న అమర జవాన్ జ్యోతిని దానికి సమీపంలో ఉన్న జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో శుక్రవారం విలీనం చేశారు. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ బీఆర్ కృష్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమర జవాన్ జ్యోతిని ఆర్పబోమని కేంద్రం స్పష్టం చేసింది. 


ఇదిలావుండగా, అమర జవాన్ జ్యోతిని ఆర్పేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిని ఆర్పేయడమంటే చరిత్రను చెరిపేయడమేనని, ఇది నేరమని తెలిపింది. ఆ పార్టీ ఎంపీ మనీశ్ తివారీ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, అమర జవాన్ జ్యోతిని ఆర్పేయడమంటే చరిత్రను చెరిపేయడమేనని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ను రెండు భాగాలుగా చేసి,  దేశ విభజన తర్వాత దక్షిణాసియా మ్యాప్‌ను తిరగరాసిన 3,483 మంది సాహసోపేతులైన సైనికుల త్యాగాలను వివరించే చరిత్ర ఇది అని తెలిపారు. స్వాతంత్ర్యానంతర భారత దేశ చరిత్రలో ఓ అద్భుతమైన ఘట్టాన్ని చెరిపేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. మన దేశంలో రెండు శాశ్వత జ్యోతులు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. అమర జవాన్ జ్యోతి, జాతీయ యుద్ధ స్మారక జ్యోతి రెండూ ఉండవచ్చునన్నారు. 


అమర జవాన్ జ్యోతి, జాతీయ యుద్ధ స్మారక జ్యోతులను విలీనం చేయడం చారిత్రక ఘట్టమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ రెండిటి మధ్య దూరం దాదాపు 400 మీటర్లు ఉంటుంది. అమర జవాన్ జ్యోతి నుంచి ఓ దివిటీని తీసుకెళ్ళి జాతీయ యుద్ధ స్మారకంలోని జ్యోతికి కలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ బలభద్ర రాధా కృష్ణ నిర్వహించారు. 


1971లో జరిగిన భారత్, పాక్ యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్‌‌ నుంచి బంగ్లాదేశ్ వేరుపడి, ప్రత్యేక దేశంగా ఏర్పడిన సంగతి తెలిసిందే.


Updated Date - 2022-01-21T22:41:06+05:30 IST