నాలుగు లేన్లుగా ఆమనగల్లు-మాడ్గుల రోడ్డు

ABN , First Publish Date - 2021-06-17T04:38:10+05:30 IST

నాలుగు లేన్లుగా ఆమనగల్లు-మాడ్గుల రోడ్డు

నాలుగు లేన్లుగా ఆమనగల్లు-మాడ్గుల రోడ్డు
ఆమనగల్లు పట్టణంలో విస్తరించనున్న మాడ్గుల రోడ్డు

  • సందబావి నుంచి సురసముద్రం చెరువు వరకు  సీసీ రోడ్డు నిర్మాణం  
  • వంద ఫీట్ల వెడల్పుతో విస్తరణ
  • నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు  
  • నెల రోజుల్లో పనుల ప్రారంభానికి అధికారుల సన్నాహాలు 

ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలో మాడ్గుల రోడ్డును విస్తరించనున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఆమనగల్లు సందబావి నుంచి సురసముద్రం చెరువు బ్రిడ్జి వరకు 600 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి నిధుల మంజూరుకు ప్రభుత్వానికి నివేదించారు. నాలుగేళ్ల క్రితం ఆమనగల్లులోని శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారి నుంచి జంగారెడ్డిపల్లి, ఆకుతోటపల్లి గేటు, అవురుపల్లి, మాడ్గుల మీదుగా నాగార్జున సాగర్‌ ప్రధాన రహదారి వరకు 30 కిలోమీటర్లు డబుల్‌ రోడ్డు నిర్మాణానికి నిఽధులు మంజూరయ్యాయి. మూడేళ్ల క్రితం బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా జంగారెడ్డిపల్లి, అవురుపల్లి, మాడ్గుల, నర్సాయిపల్లిలో సీసీ రోడ్డు నిర్మించినప్పటికీ ఆమనగల్లులో మాత్రం రోడ్డు నిర్మించలేదు.దీంతో పట్టణంలోని మాడ్గుల రోడ్డు ఇరుకుగా ఉండి వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇరుకు రోడ్డుతో తరుచుప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు రోడ్డు విస్తరణకు మరో సారి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దాదాపు 600 మీటర్ల రోడ్డును నాలుగు లేన్లుగా వంద పీట్ల వెడల్పు, మధ్య డివైడర్‌తో నిర్మించడానికి ప్రతిపాదనలు రూపొందించారు. నిధులు త్వరలో మంజూరు కానున్నట్లు సమాచారం. కాగా మాడ్గుల రోడ్డు విస్తరణతో పట్టణంలో పెద్ద ఎత్తున ఇళ్లు తొలగించాల్సి ఉన్న నేపథ్యంలో సీసీ రోడ్డు నిర్మాణానికి రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల యజమానులు ఏ మేరకు సహకరిస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రోడ్డు నిర్మాణంలో భాగంగా ఇళ్లు కోల్పోయే వారికి ప్రభుత్వం పరిహారం అందించేందుకు కూడా నిధులు కేటాయిస్తున్నట్లు సమాచారం. మాడ్గుల రోడ్డు విస్తరణతో పట్టణం అభివృద్ధి దిశగా అడుగు ముందుకెళ్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా మాడ్గుల రోడ్డు వంద ఫీట్ల విస్తరణ నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న స్థలాల్లో నూతన నిర్మాణానికి అనుమతి ఇవ్వొద్దని ఆర్‌అండ్‌బీ శాఖ ఆమనగల్లు మున్సిపాలిటీకి ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలిసింది. 

Updated Date - 2021-06-17T04:38:10+05:30 IST