రోడ్డు పక్కనే చెత్తడంప్‌

ABN , First Publish Date - 2020-10-30T10:17:28+05:30 IST

ఆమనగల్లు పట్టణ సమీపంలోని మాడ్గుల రోడ్డులో చెత్త డంపుతో ప్రయాణికులు, సమీప రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్డు పక్కనే చెత్తడంప్‌

ఆమనగల్లు-మాడ్గుల రహదారి పక్కన  పేరుకుపోయిన చెత్త 

దుర్వాసనతో ప్రజల ఇబ్బందులు 

మూగజీవాలు రోగాల బారిన పడే ప్రమాదం


ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణ సమీపంలోని మాడ్గుల రోడ్డులో చెత్త డంపుతో ప్రయాణికులు, సమీప రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంపు నుంచి వస్తున్న దుర్వాసనతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యర్థాలను రోడ్డును అనుసరించి డంప్‌ చేస్తుండడంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. చెత్త డంపులో జీవాలు, పశువులు సంచరిస్తూ రోగాల బారిన పడే ప్రమాదం ఏర్పడింది. మాడ్గుల, మాల్‌, చారగొండ, దేవర కొండ, నల్గొండ పట్టణాలకు నిత్యం వందల వాహనాలు, అనేక గ్రామాల ప్రజలు, సమీప రైతులు ఈ రోడ్డు నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. కాగా దుర్వాసనతో ఊపిరాడని పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీలో నిత్యం ట్రాక్టర్లు, ఆటోలు, రిక్షాల ద్వారా టన్నుల కొద్దీ చెత్త సేకరించి డంపింగ్‌యార్డ్‌ లేనికారణంగా  పట్టణ సమీపంలోని  మాడ్గుల రోడ్డు పక్కన డంప్‌ చేస్తున్నారు.


రోడ్డును అనుసరించే నెలల కాలంగా చెత్త డంపుతో కుప్పలు పేరుకుపోయాయి. చెత్తంతా క్రమంగా రోడ్డుపైకి వస్తోంది. దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షాలకు డంపు పక్కనుంచే గోతుల్లో నీరు చేరి దుర్వాసన వ్యాపిస్తోంది. పందులు, కుక్కలు చెత్తలో స్వైర విహారం చేస్తున్నాయి. చెత్త డంపు విషయంలో మున్సిపాలిటీ కనీస నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఓ గోతి లాంటి ప్రదేశంలో చెత్తను డంపు చేసి ఎప్పడికప్పుడు రీసైక్లింగ్‌ చేస్తే చెత్త పేరుకుపోయే అవకాశం ఉండదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చాలా కాలంగా మున్సిపాలిటీలో చెత్త డంపు సమస్య ఇబ్బందిగా మారింది. ఇటీవల మున్సిపాలిటీకి డంపింగ్‌ యార్డు మంజూరు కాగా నిర్మాణ దశలో ఉంది. డంపింగ్‌ యార్డు నిర్మాణం పూర్తయ్యే వరకు  చెత్తను పట్టణానికి దూరంగా తరలించాలని ప్రజలు కోరుతున్నారు.   

Updated Date - 2020-10-30T10:17:28+05:30 IST