ఆదాయం సరే.. సౌకర్యాలేవి?

ABN , First Publish Date - 2020-08-03T10:10:53+05:30 IST

నాలుగు మండలాలకు ప్రధాన కూడలిగా, హైదరాబాద్‌ నగరానికి చేరువలో, శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారి పక్కన ఉన్న ఆమనగల్లు ఆర్టీసీ

ఆదాయం సరే.. సౌకర్యాలేవి?

విస్తరణకు నోచుకోని ఆమనగల్లు బస్టాండ్‌

సదుపాయాల కల్పనలో ఆర్టీసీ నిర్లక్ష్యం

సీసీ కెమెరాలు లేక కొరవడిన నిఘా 

ప్రతిపాదనలకే పరిమితమైన క్యాంటీన్‌, పార్కింగ్‌

తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలూ లేవు 

ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు 


ఆమనగల్లు: నాలుగు మండలాలకు ప్రధాన కూడలిగా, హైదరాబాద్‌ నగరానికి చేరువలో, శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారి పక్కన ఉన్న ఆమనగల్లు ఆర్టీసీ బస్టాండ్‌ అభివృద్ధికి నోచుకోవడంలేదు. సదుపాయాలు లేక, విస్తరణకు నోచుకోక ప్రయాణికులు ఏళ్లుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అధికారులకు ఆదాయంపై ఉన్న శ్రద్ధ  సౌకర్యాల కల్పనపై లేదా? అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. 


ఏళ్లుగా కనీస వసతులు కరువు

బస్టాండ్‌లో మరుగుదొడ్లు, మూత్రశాలలు కూడా లేకపోవడంతో ప్రయాణికులు మలమూత్ర విసర్జనకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి వసతి లేదు. వాసవీ క్లబ్‌ నిర్మించిన మినీ ట్యాంక్‌ కుళాయి కనెక్షన్‌ తొలగించడంతో నిరుపయోగంగా మారింది. విధిలేక నీళ్లబాటిళ్లు కొనుగోలు చేసి తాగాల్సివస్తోంది. క్యాంటీన్‌ లేక ప్రధాన రహదారిపై గల హోటల్స్‌కు వెళ్లాల్సివస్తోంది. సీసీకెమెరాలు లేకపోవడంతో నిఘాలేకుండా పోయింది.  దీంతో బస్టాండ్‌లో విలువైన వస్తువులు పోగొట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. బైక్‌పార్క్‌ చేసుకుందామన్నా వాహన పార్కింగ్‌ సదుపాయమూ లేదు. ప్లాట్‌ఫాంలు చాలక ఏబస్సు ఎక్కడికి వెళ్తుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. కూర్చోడానికి బెంచీలు లేని దుస్థితి నెలకొంది.


విస్తరణకు నోచుకోని వైనం 

2003లో జాతీయ రహదారిని అనుసరించి ఆమనగల్లులో బస్టాండ్‌ నిర్మించారు. 17ఏళ్లు అయినా సదుపాయాలు కార్యరూపం దాల్చడంలేదు. నిత్యం వేల మంది ప్రయాణికుల రాకపోకలు, వందలాది బస్సులతో ఆమనగల్లు బస్టాండ్‌ కిటకిటలాడుతుంది. నిత్యం హైదరాబాద్‌, యాదగిరిగుట్ట, సంగారెడ్డి, వరంగల్‌,  మహబూబ్‌నగర్‌ తదితర ప్రాంతాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో వ్యాపార సముదాయాలు పెరిగి బస్టాండ్‌ ఆవరణం ఇరుకుగా మారింది. బస్టాండ్‌ను విస్తరించి క్యాంటిన్‌, పార్కింగ్‌ ఏర్పాటు చేయాల్సిన అధికారులు కేవలం ప్రతిపాదనలకే పరిమితం చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్‌ను విస్తరించి, సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు. 


బస్టాండ్‌ను విస్తరించాలి

ఆమనగల్లు బస్టాండ్‌ విస్తరించి ప్రయాణికులకు తాగునీటి, ఇతర వసతులు కల్పించాలి. నీటిశుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేయాలి. పార్కింగ్‌ ఏర్పాటుచేస్తే ఆర్టీసీకి ఆదాయం సమకూరుతుంది. ప్రయాణికుల ఇబ్బందులు తీరుతాయి. వాహనాల రద్దీ తగ్గుతుంది. క్యాంటీన్‌, ప్లాట్‌ఫారాలు, బెంచీలు ఏర్పాటు చేయాలి.

మండ్లీ రాములు, మాజీ ఎంపీటీసీ, మేడిగడ్డ


విస్తరణకు ప్రతిపాదనలు పంపాం

ఆమనగల్లు ఆర్టీసీ బస్టాండ్‌ విస్తరణకు అధికారులకు ప్రతిపాదనలు పంపాం. స్థానిక ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ద్వారా సంబంధిత అధికారులు, మంత్రిని కలిసి విస్తరణ ఆవశ్యకత గురించి వివరించాం. వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటుకు, పార్కింగ్‌ స్థలానికి కల్వకుర్తి ఆర్టీసీ డీఎంతో మాట్లాడుతాం. ప్రయాణికులకు అనుగుణంగా వసతుల కల్పనకు కృషి చేస్తాం.

నేనావత్‌ అనురాధ పత్యనాయక్‌, జడ్పీటీసీ, ఆమనగల్లు 

Updated Date - 2020-08-03T10:10:53+05:30 IST