విస్తరణకు నోచుకోని ఆమనగల్లు బస్టాండ్‌

ABN , First Publish Date - 2022-05-09T04:55:33+05:30 IST

విస్తరణకు నోచుకోని ఆమనగల్లు బస్టాండ్‌

విస్తరణకు నోచుకోని ఆమనగల్లు బస్టాండ్‌
అసౌకర్యాల నడుమ కొనసాగుతున్న ఆమనగల్లు ఆర్టీసీ బస్టాండ్‌

  • 19 ఏళ్లుగా సదుపాయాలు లేక ప్రయాణికుల ఇబ్బందులు 
  • తాగునీటి వసతి కల్పనలో అధికారులు విఫలం 
  • ప్లాట్‌ఫారాలు లేక ఏ బస్సు ఎక్కడికి వెళ్తుందో తెలియని దుస్థితి 
  • సౌకర్యాలపై ఆర్టీసీ అధికారుల అశ్రద్ధ 


ఆమనగల్లు, మే 8: ఆర్టీసీ అధికారులు ఆదాయంపై చూపుతున్న శ్రద్ధ ప్రయాణికులకు వసతులు కల్పించడంలో చూపించడంలేదు. హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై ఉన్న ఆమనగల్లు ఆర్టీసీ బస్టాండ్‌లో వసతులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వకుర్తి ఆర్టీసీ డిపోకు ప్రధాన ఆదాయ మార్గమైన ఆమనగల్లు బస్టాండ్‌ అభివృద్ధికి నోచుకోవడంలేదు. ప్రయాణికులకు సదుపాయాల కల్పనపై అధికారులు పట్టించుకోకపోవడంతో విమర్శలకు తావిస్తోంది. నిత్యం వందల ఆర్టీసీ బస్సులు, వేలమంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్టాండ్‌ 19ఏళ్లుగా విస్తరణకు నోచుకోవడం లేదు. బస్టాండ్‌ ఏటేటా వ్యాపార సముదాయంగా మారుతోంది. ఇప్పటికే దుకాణాల నిర్మాణంతో బస్టాండ్‌ ఆవరణం పూర్తిగా కుంచించుకుపోయింది.  

వసతులు కరువు.. ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు 

ఆమనగల్లు పట్టణంలో 2003లో ప్రారంభించిన బస్టాండ్‌లో నేటికీ సరైన సదుపాయలు సమకూర్చకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. బస్టాండ్‌ విస్తరణ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ పట్టించుకోడంలేదని ప్రయాణికులు, స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆమనగల్లు బస్టాండ్‌ మీదుగా హైదరాబాద్‌, శ్రీశైలం, యాదగిరి గుట్ట దేవరకొండ, అచ్చంపేట, సంగారెడ్డి, షాద్‌నగర్‌, వరంగల్‌, మాల్‌, ఇబ్రహీంపట్నం, నర్సంపేట, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌ తదితర సుదూర ప్రాంతాలకు నిత్యం వందలసంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల సంక్షేమమే తమ ధ్యేయమని గొప్పగా ప్రకటించుకునే ఆర్టీసీ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం లేదనడానికి ఆమనగల్లు బస్టాండ్‌ నిదర్శనంగా నిలిచింది. బస్టాండ్‌లో క్యాంటీన్‌ సదుపాయం లేదు. ప్రయాణికులకు అనుగుణంగా మరుగుదొడ్లు, మూత్రశాలలూ ఏర్పాటు చేయలేదు. 

బస్టాండ్‌ ప్రధాన ద్వారం ఎదుట కళావిహీనంగా రోడ్డు 

శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిని అనుసరించి ఉన్న బస్టాండ్‌ ముందు భాగంలో కంకరతేలి రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. ఫలితంగా బస్టాండ్‌ కళావిహీనంగా కనిపిస్తోంది. బస్టాండ్‌, జాతీయ రహదారి మధ్య 50ఫీట్లు సీసీచేస్తే రాకపోకలకు కూడా ఇబ్బందులు తొలుగుతాయి. రాజీవ్‌కూడలి నుంచి షాద్‌నగర్‌ రోడ్డు వైపు కూడా బస్టాండ్‌లోకి వెళ్లేరోడ్డు చాలాకాలంగా పాడైంది. తాత్కాలిక మరమ్మతులు చేసినా ఇక్కడ కాల్వపై నాణ్యతగా స్లాబ్‌ నిర్మాణం చేపట్టకపోతే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. 

వ్యాపార సముదాయంగా బస్టాండ్‌ 

ఆమనగల్లు బస్టాండ్‌ వ్యాపార సముదాయంగా మారింది. ఆమనగల్లు పట్టణం నడిబొడ్డులో ఎంతో విలువైన స్థలంలో ఉన్న బస్టాండ్‌లో ఇప్పటికే సగభాగానికి పైగా దుకాణ సముదాయాలు నిర్మించి ఆర్టీసీ అధికారులు అద్దెకు ఇచ్చారు. దీంతో బస్టాండ్‌లో స్థలం ఇరుకుగా మారి బస్సులు కదలలేని పరిస్థితి నెలకొంది.

తాగునీటికి ప్రయాణికుల ఇబ్బంది 

బస్టాండ్‌లో తాగునీటి వసతిలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అసలే ఎండలు మండిపోతుండడంతో ప్రయాణికులు దాహార్తితో అల్లాడుతున్నారు. విధిలేక ప్రయాణికులు వాటర్‌ ప్యాకెట్లు, బాటిళ్లను కొనుగోలు చేస్తున్నారు. బస్టాండ్‌లో వాసవీ క్లబ్‌ నిర్మించిన మినీవాటర్‌ ట్యాంక్‌కు కుళాయి కనెక్షన్‌ ఉన్నా నీరుఅందక కొద్దిరోజులుగా  నిరుపయోగంగా మారింది. బస్టాండ్‌ ముందు భాగంలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోంది. ప్లాట్‌ఫారాలు చాలినన్ని లేక ఎక్కడపడితే అక్కడ బస్సులు నిలుపుతుండడంతో కొన్ని సందర్భాల్లో ఏబస్సు ఎక్కడికి వెళ్తుందో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. 


బస్టాండ్‌ను విస్తరించాలి : సుండూరు శేఖర్‌, ఆమనగల్లు 

ఆమనగల్లు ఆర్టీసీ బస్టాండ్‌ను విస్తరించాలి. ప్రయాణికులకు అనుగుణంగా వసతులు కల్పించాలి.  బస్టాండ్‌ అబివృద్ధి, వసతుల కల్పన విషయంలో ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు చొరవ తీసుకోవాలి. రెండు ప్రధాన ద్వారాల ఎదుట కంకర తేలిన రోడ్డుపై సీసీ ఏర్పాటు చేయాలి. తగినన్ని ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేయాలి. శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలి.

తాగు నీటి వసతి కల్పించాలి : కిషన్‌, తలకొండపల్లి

ఆర్టీసీ బస్టాండ్‌లో తాగునీటి వసతి లేక తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. బస్టాండ్‌కు నీటివసతి కల్పించి వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి. క్యాంటీన్‌ ఏర్పాటు చేసి ప్రయాణికులకు అనుగుణంగా కూర్చోవడానికి వసతులు కల్పించాలి. ప్రయాణికులకు సదుపాయాల కల్పనకు ఆర్టీసీ అధికారులకు తోడు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. ఆదాయం పెంచుకోవడంతో పాటు ప్రయాణికులకు తగినవసతుల కల్పనలో శ్రద్ధ చూపాలి.  

ప్రతిపాదనలు పంపించాం: అనురాధపత్యానాయక్‌, జడ్పీటీసీ - ఆమనగల్లు 

ఆమనగల్లు బస్టాండ్‌ విస్తరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రయాణికులకు అనుగుణంగా బస్టాండ్‌లో మౌలిక వసతుల కల్పనకు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ ద్వారా బస్టాండ్‌లో నెలకొన్న సమస్యలు, బస్టాండ్‌ విస్తరణ గురించి మంత్రి, ఉన్నతాధికారులను కలిశాం. నాలుగు మండలాలకు కూడలిగా జాతీయ రహదారిపై ఉన్న బస్టాండ్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. 


Read more