Abn logo
Sep 19 2021 @ 01:10AM

జిల్లాకు మరో హైవే

ముక్కామల-ఈదరపల్లి రహదారి ఇదే

జాతీయ రహదారి కానున్న అమలాపురం-రావులపాలెం రహదారి
ట్వీట్‌ చేసిన కేంద్రమంత్రి.. నితిన్‌ గడ్కరీకి మంత్రి విశ్వరూప్‌ లేఖలు
రహదారి ఏర్పాటు నిర్ణయం పట్ల కోనసీమవాసుల హర్షం


(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
కోనసీమలోని ఒక ప్రధాన రహదారిని జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అమలాపురం పట్టణంలోని ఈదరపల్లి నుంచి ముక్కామల, పలివెల మీదుగా రావులపాలెంలోని 16వ జాతీయ రహదారికి అనుసంధానమయ్యేలా రహదారి నిర్మాణానికి నేషనల్‌ హైవే నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈమేరకు శనివారం ట్వీట్‌ చేశారు. కోనసీమలోని నాలుగు రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని కోరుతూ గత రెండేళ్ల నుంచి రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ కేంద్ర ఉప రితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కారీకి పలుమార్లు లిఖిత పూర్వకంగా వినతి పత్రాలు ఇవ్వడంతోపాటు లేఖలు కూడా రాశారు. అమలాపురం ఎంపీ చింతా అనురాధ కూడా ఈ రహదారి నిర్మాణం కోసం కృషిచేశారు. దీనిలో భాగంగా అమలాపురం, ఈదరపల్లి కెనాల్‌ నుంచి పలివెల మీదుగా రావులపాలెం 16వ జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ రూ.600 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నాలు గు ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానంచేసే క్రమంలో భాగంగా అమలాపురం రహదారికి మోక్షం కలిగింది. అమలాపురం రూరల్‌ భట్లపాలెంలోని బీవీసీ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంతం నుంచి ఇందుపల్లి, ఈదరపల్లి మీదుగా బైపాస్‌ రోడ్డు నిర్మాణం కూడా చేసే ప్రతిపాదనలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. గత ఏడాది జూలై 24న నేషనల్‌ హైవే రహదారుల ఏర్పాటు ఆవిష్కరణను వివరిస్తూ ఒక లేఖ రాశారు. మంత్రి విశ్వరూప్‌ రాసిన లేఖపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఫిబ్రవరి 18న మంత్రి విశ్వరూప్‌కు అమలాపురం రహదారిని నేషనల్‌ హైవే 216-ఏగా అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలుపుతూ లేఖ రాశారు. అమలాపు రంలోని భట్లపాలెం నుంచి ఈదరపల్లి బ్రిడ్జి మీదుగా కెనాల్‌ వెంబడి ఈ రహ దారి నిర్మాణం జరగనుంది. అమలాపురంలోని 216 నుంచి రావులపాలెంలోని ఎన్‌ హెచ్‌-16కు అనుసంధానమయ్యే ఈ రహదారికి 216-ఏగా నామకరణం చేశారు. జాతీయ రహదారి మంజూరుకావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.