భద్రతా వలయంలో అమలాపురం

ABN , First Publish Date - 2022-05-24T06:09:17+05:30 IST

కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం సోమవారం పోలీసుల దిగ్బంధనంలో ఉంది. కలెక్టరేట్‌ పరిసర ప్రాంతాలతో పాటు డీఆర్సీ మీటింగ్‌ జరుగుతున్న క్షత్రియ కల్యాణ మండపాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు.

భద్రతా వలయంలో అమలాపురం
కలెక్టరేట్‌ స్పందనకు వచ్చిన అర్జీదారులను ప్రశ్నిస్తున్న పోలీసులు

అమలాపురం, మే 23 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం సోమవారం పోలీసుల దిగ్బంధనంలో ఉంది. కలెక్టరేట్‌ పరిసర ప్రాంతాలతో పాటు డీఆర్సీ మీటింగ్‌ జరుగుతున్న క్షత్రియ కల్యాణ మండపాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. కలెక్టర్‌ స్పందనకు వేలాదిగా జనం వస్తారన్న ముందస్తు సమాచారంతో కోనసీమ జిల్లా సాధన సమితి నాయకులు కొందరిని అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అమలాపురం పట్టణానికి చెందిన యల్లమిల్లి నాగసుధాకొండలరావు, కాశిన ఫణీంద్ర, కాశిన బాబి... ఉప్పలగుప్తంలో ముగ్గురు, ఇలా పలు ప్రాంతాలకు చెందిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషనకు తరలించారు. ఎక్కడికక్కడే అనూహ్య రీతిలో పోలీసులను మోహరింపజేశారు. నల్లవంతెన నుంచి కలెక్టరేట్‌ వరకు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ కార్యాలయం వద్ద స్పందనకు వెళ్లే ప్రజలను ప్రశ్నల వర్షం కురిపించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కొందరిని ఇబ్బందులకు గురి చేశారు. అయితే జిల్లా పేరు మార్పునకు సంబంధించి 588 అభ్యంతరాలు సూచనలపై దరఖాస్తులు అందాయని కలెక్టరేట్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. కలెక్టర్‌ సహా అధికారులెవరూ స్పందనకు హాజరు కాకపోవడం, మరోవైపు పోలీసుల నిర్బంధం మధ్య స్పందన ప్రశాంతంగా ముగిసింది. కాగా డీఆర్సీ మీటింగ్‌ జరిగిన క్షత్రియ కల్యాణ మండపం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆందోళనలు జరుగుతాయన్న హెచ్చరికలతో పోలీసులు గస్తీ తిరిగారు. ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి, డీఎస్పీ వై.మాధవరెడ్డిలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన డీఎస్పీలు, సీఐలు సుమారు 400 మందికిపైగా సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. సోమవారం ఎటువంటి  అవాంచనీయ పరిస్థితులు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.  


Updated Date - 2022-05-24T06:09:17+05:30 IST