రూ.వంద ఇస్తేనే టీసీ..!

ABN , First Publish Date - 2020-09-23T17:46:00+05:30 IST

‘పరీక్షలు రాయకుండానే పదో తరగతి పాసయ్యారు. పరీక్ష ఫీజు కూడా..

రూ.వంద ఇస్తేనే టీసీ..!

అమడగుంట్ల పాఠశాలలో వసూళ్లు

పదో తరగతి పాసైనవారికి పాట్లు


కోడుమూరు(కర్నూలు): ‘పరీక్షలు రాయకుండానే పదో తరగతి పాసయ్యారు. పరీక్ష ఫీజు కూడా కట్టలేదు. టీసీకి రూ.వంద ఇవ్వలేరా..?’ అని డిమాండ్‌ చేసి మరీ విద్యార్థుల నుంచి డబ్బు గుంజుతున్నారు. కోడుమూరు మండలంలోని అమడగుంట్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈ తంతు జరుగుతోంది. పై చదువులకు వెళ్లేందుకు టీసీ కోసం వచ్చిన పదో తరగతి విద్యార్థుల నుంచి ఓ ఉద్యోగి వసూళ్లకు దిగారు. డబ్బులు ఇవ్వకపోతే ఏదో కారణం చెప్పి టీసీ ఇవ్వ డంలో జాప్యం చేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. రెండు రోజులుగా పాఠశాలలో ఈ తంతు కొనసాగుతోంది. 


హాస్టల్‌ విద్యార్థుల ఆకలి బాధలు

గ్రామీణ విద్యార్థులు అమడగుంట్ల బీసీ హాస్టల్‌లో ఉండి చదువుకునేవారు. పదో తరగతి పూర్తి చేసుకున్న హాస్టల్‌ విద్యార్థులు కొందరు టీసీ కోసం తెలిసి సోమవారం పాఠశాలకు వచ్చారు. వివరాలు నమోదు చేయలేదని సిబ్బంది చెప్పడంతో తిరిగి స్వగ్రామాలకు వెళ్లలేక రాత్రికి హాస్టల్‌లో ఉండిపోయారు. మంగళవారం మరోమారు పాఠశాలకు వెళితే హెడ్‌మాస్టర్‌ రాలేదని చెప్పారు.


దీంతో విద్యార్థులు చార్జీలకు తెచ్చుకున్న డబ్బులతో స్థానికంగా ఉన్న ఓ హోటళ్లలో బొరుగులు తిని పగలంతా గడిపారు. విద్యార్థుల పరిస్థితిని గమనించిన స్థానిక నాయకుడు చెన్నారెడ్డి రాత్రికి భోజనం ఏర్పాటు చేశారు. అధికారులు స్పందించి టీసీలు ఇప్పిస్తే ఎలాగోలా స్వగ్రామాలకు వెళతామని దేవనకొండ, తెర్నేకల్‌, గొల్లలదొడ్డి, పెద్దమరివీడు, కరిడికొండ విద్యార్థులు విన్నవిస్తున్నారు. ఈ విషయమై హెచ్‌ఎం శరభయ్యను వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు  

Updated Date - 2020-09-23T17:46:00+05:30 IST