ధోనీ రికార్డును బద్దలుగొట్టిన మహిళా వికెట్ కీపర్

ABN , First Publish Date - 2020-09-28T01:31:14+05:30 IST

ఆస్ట్రేలియా మహిళా వికెట్ కీపర్ అలిస్సా హీలీ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో విజయవంతమైన వికెట్ కీపర్‌గా రికార్డులకెక్కింది.

ధోనీ రికార్డును బద్దలుగొట్టిన మహిళా వికెట్ కీపర్

బ్రిస్బేన్: ఆస్ట్రేలియా మహిళా వికెట్ కీపర్ అలిస్సా హీలీ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో విజయవంతమైన వికెట్ కీపర్‌గా రికార్డులకెక్కింది. బ్రిస్బేన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో రెండు క్యాచ్‌లు పట్టుకున్న హీలీ మొత్తం 92 మందిని పెవిలియన్ పంపింది. దీంతో ఇప్పటి వరకు 91 అవుట్‌లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా మాజీ సారథి ధోనీ రికార్డు బద్దలైంది.


అంతేకాదు, అత్యధిక టీ20లు ఆడిన కీపర్‌గానూ రికార్డు సృష్టించింది. హీలీ మొత్తం 114 మ్యాచ్‌లు ఆడగా, అందులో 99 మ్యాచుల్లో కీపింగ్ చేసింది. ధోనీ 98 మ్యాచ్‌ల్లో మాత్రమే కీపింగ్ చేశాడు. ఫలితంగా  టీ20 చరిత్రలో మోస్ట్ క్యాప్‌డ్ వికెట్ కీపర్‌గా హీలీ అరుదైన ఘనత అందుకుంది. 


టీ20ల్లో హీలీ 50 స్టంపౌట్లతో ఈ జాబితాలో రెండోస్థానంలో ఉంది. సారా టేలర్ 51 స్టంపౌట్లు చేయగా, పురుషుల టీ20లో ధోనీ 34 స్టంపౌట్లు మాత్రమే చేశాడు. ఓవరాల్ జాబితాలో ధోనీ ఐదో స్థానంలో ఉన్నాడు. అలాగే, హీలీ 42 క్యాచ్‌లు అందుకుని రాచెల్ ప్రీస్ట్ (41)ను అధిగమించగా, ఓవరాల్‌గా ఎంఎస్ ధోనీ (57), దినేశ్ రామ్‌దిన్ (43) తర్వాత ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.


Updated Date - 2020-09-28T01:31:14+05:30 IST