ప్రొటీన్‌కు ప్రత్యామ్నాయం... ఆరోగ్యమూ పదిలం..!

ABN , First Publish Date - 2021-03-08T18:13:11+05:30 IST

కోవిడ్‌ కేసులు తగ్గుతున్నట్లు అనిపిస్తున్నా, గత కొద్ది రోజులుగా కొన్ని రాష్ట్రాలలో పెరుగుతున్న కేసులు కొత్త భయాలను సృష్టిస్తూనే ఉన్నాయి. కోవిడ్‌ వచ్చిన తరువాత ప్రొటీన్‌ ఫుడ్‌కు ఆదరణ పెరిగింది. నాన్‌వెజ్‌ అమ్మకాలూ గణనీయంగా పెరిగాయి. వాటితో పాటుగా బాదం లాంటి నట్స్‌కూ

ప్రొటీన్‌కు ప్రత్యామ్నాయం... ఆరోగ్యమూ పదిలం..!

వెగాన్‌ ప్రియులకు వరంగా టోఫు

శాఖాహారం వైపు చూపు సారించిన మాంసాహారుల కోసం సీతాన్‌

బర్ల్‌ ఫ్లూ భయాల వేళ ప్రత్యామ్నాయాలు కోరుకునే వారికేనంటున్న డైటీషియన్లు


కోవిడ్‌ కేసులు తగ్గుతున్నట్లు అనిపిస్తున్నా, గత కొద్ది రోజులుగా కొన్ని రాష్ట్రాలలో పెరుగుతున్న కేసులు కొత్త భయాలను సృష్టిస్తూనే ఉన్నాయి. కోవిడ్‌ వచ్చిన తరువాత ప్రొటీన్‌ ఫుడ్‌కు ఆదరణ పెరిగింది. నాన్‌వెజ్‌ అమ్మకాలూ గణనీయంగా పెరిగాయి. వాటితో పాటుగా బాదం లాంటి నట్స్‌కూ డిమాండ్‌ పెరిగింది. కానీ తక్కువ ధరలో శరీరానికి అవసరమయ్యే ప్రొటీన్‌ మార్గంగా మాత్రం చాలామంది చికెన్‌ లాంటివాటి వైపే చూశారు. కొంతకాలం క్రితం వరకూ చికెన్‌ అమ్మకాలు బాగానే ఉన్నా, బర్డ్‌ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందుతుందనే వార్తలు కాస్త ఆందోళనకు గురి చేశాయి. బర్డ్ ఫ్లూ ప్రభావం లేదని ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నా, ఎక్కడో ఒక చోట కోళ్లు చనిపోవడం, బర్డ్‌ ఫ్లూ వల్లనేనంటూ సామాజిక మాధ్యమాలలో పుకార్లు... వెరసి చికెన్‌ అంటేనే భయపడుతున్నారు చాలామంది. బర్డ్‌ ఫ్లూ ప్రధానంగా పౌల్ట్రీ పక్షులు అయినటువంటి కోళ్లు లేదంటే టర్కీలపై అధిక ప్రభావం చూపుతుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందక పోయినప్పటికీ, చాలా మంది ముందు జాగ్రత్త చర్య అంటూ పౌల్ట్రీ పదార్ధాలను తినడం మానేస్తున్నారు. ఇప్పటి వరకూ చికెన్‌, గుడ్లు వంటివి మాంసాహారుల పౌష్టికాహార అవసరాలను తీర్చాయి కానీ మరిప్పుడు ప్రత్యామ్నాయం ఏమిటంటే చాలానే ఉన్నాయంటున్నారు  పిలాట్స్‌ నిపుణురాలు, డైట్‌ అండ్‌ న్యూట్రిషన్‌ కన్సల్టెంట్‌ మాధురి రుయా.


రోగ నిరోధక శక్తికి కీలకం...

కరోనా కారణంగా ఆరోగ్యంగా ఉండాల్సిన ఆవశ్యకత మరీ ముఖ్యంగా రోగ నిరోధక శక్తి గురించి చాలా మందికి అవగాహన కలిగింది. శక్తివంతమైన రోగ నిరోధక శక్తి ద్వారా మాత్రమే వ్యాధులతో పోరాటం చేయగలమనీ తెలుసుకున్నారు. అదే సమయంలో మనం తీసుకునే ఆహారంపైనే మన రోగ నిరోధక శక్తి కూడా ఆధారపడి ఉంటుందనీ గుర్తించారు. ఈ రోగ నిరోధక శక్తిలో అత్యంత కీలకమైన అంశంగా ప్రోటీన్‌ నిలుస్తుంటుందన్నారు మాధురి. ‘‘మన శరీరంలో శక్తికి, మన శరీరంలో రక్త సరఫరాలో భాగంగా ఆక్సిజన్‌ను శరీరంలోని అవయవాలకు చేరవేయడానికి కూడా అత్యంత కీలకంగా ప్రొటీన్‌ నిలుస్తుంది. అంటువ్యాధులు, అనారోగ్యంతో పోరాడే యాంటీ బాడీలను తయారుచేయడంలో  కూడా ప్రొటీన్‌ సహాయపడుతుంది. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా నూతన కణాలనూ తయారు చేస్తాయి’’ అని అన్నారామె. చికెన్‌ తినడం పట్ల ఇప్పటికీ భయపడుతున్న వారికి ప్రత్యామ్నాయ ఆహారం గురించి చెప్పమన్నప్పుడు మాంసాహారులు మాత్రమే కాదు వెగాన్స్‌(పాలను కూడా మాంసాహారం అని భావించేవాళ్లు)కు సైతం ప్రొటీన్‌ అవసరాలను తీర్చే మూడు రకాల పదార్ధాల గురించి ఆమె చెప్పుకొచ్చారు. అవి..


1.బాదములు

ప్రొటీన్‌ అధికంగా కలిగిన ఆహారం బాదము. శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, బాదములలో అత్యధిక స్థాయిలో ప్రొటీన్‌ ఉంది. ఓ గుప్పెడు బాదములు ఆకలిని నియంత్రించడంలో తోడ్పడటంతో పాటుగా అధికంగా కేలరీలు తీసుకోవడాన్నీ నిరోధిస్తాయి. వీటితో పాటుగా, బాదములను పోషకాలు అధికంగా కలిగిన, సౌకర్యవంతమైన స్నాక్‌గానూ భావించవచ్చు. వీటిలో విటమిన్‌ ఈ, మెగ్నీషియం, రిబోఫ్లావిన్‌, జింక్‌ లాంటి 15కు పైగా అత్యవసర పోషకాలు ఉంటాయి.

ఇక మన భారతీయ మసాలా/స్పైసెస్‌తో అయినా వీటిని జోడించవచ్చు. ఈ బాదములలో అద్భుతమైన అంశమేమిటంటే  వీటిలో ట్రాన్స్‌ఫ్యాట్‌ ఉండదు సరికదా ఆరోగ్యవంతమైన మోనోశాచురేటెడ్‌ కొవ్వు అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.


2.టోఫు

శాఖాహారుల్లో ఇప్పటికే  ప్రాచుర్యం పొందిన ఆహారం టోఫు. దీనిని సోయా పాలతో తయారుచేస్తారు. ప్రొటీన్‌  పుష్కలంగా దీనిలో ఉంటుంది. అదనంగా, దీనిలో అత్యవసర అమినో యాసిడ్స్‌తో పాటుగా ఫాస్ఫరస్‌, ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం వంటివి సైతం ఉంటాయి. శాశ్వతంగా లేదా తాత్కాలికంగా మొక్కల ద్వారా ప్రొటీన్‌ పొందాలనుకునే వారికి ఇది చక్కటి స్టార్టర్‌గా నిలుస్తుంది. వైవిధ్యత కారణంగా కూడా టోఫు అత్యంత ప్రాచుర్యం పొందింది. ఎన్నో సోయా ఉత్పత్తులు లాగానే దీనిని  సైతం ఎన్నో రెసిపీలలో ఎలాంటి కష్టం లేకుండానే వినియోగించవచ్చు. టోఫును ముక్కలుగా, తురుము రూపంలో, గ్రిల్‌ చేసి ఆఖరకు నేరుగా కూడా తినవచ్చు!


సీతాన్‌: వెగానిజంపై దృష్టి సారించిన వారికి అత్యంత ప్రాచుర్యం పొందిన మరో అవకాశం సీతాన్‌. దీనిలో  సోయ్‌ కంటెంట్‌ అసలు ఉండదు. వాస్తవానికి దీని ఆకారం చూడగానే మాంసం లాగానే ఉంటుంది! మొక్కల ఆధారిత డైట్‌ వైపు మారాలనే మాంస ప్రియులకు ఇది ఓ రకంగా వరమనే చెప్పాలి. సీతాన్‌లో ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది, కేలరీలు అతి తక్కువగా ఉంటాయి. ఇది వెయిట్‌ లాస్‌ డైట్‌గా కూడా తోడ్పడుతుంది. కొద్ది పరిమాణంలో ఐరన్‌, కాల్షియం, ఫాస్ఫరస్‌ దీనిలో ఉంటాయి. అయితే దీనిని పూర్తిగా వీట్‌ గ్లూటెన్‌తో తయారుచేస్తారు. అందువల్ల గ్లూటెన్‌‌తో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే వారు దీనికి దూరంగా ఉండటం మంచిది.

Updated Date - 2021-03-08T18:13:11+05:30 IST