పార్లమెంటు వెలుపల కాంగ్రెస్, ఎస్ఏడీ ఎంపీల వాగ్వాదం

ABN , First Publish Date - 2021-08-04T20:12:50+05:30 IST

శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి

పార్లమెంటు వెలుపల కాంగ్రెస్, ఎస్ఏడీ ఎంపీల వాగ్వాదం

న్యూఢిల్లీ : శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, కాంగ్రెస్ ఎంపీ రవనీత్ సింగ్ బిట్టు మధ్య వాగ్వాదం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలపై వీరు పార్లమెంటు వెలుపల బుధవారం బిగ్గరగా పరస్పర ఆరోపణలకు దిగారు. 


సాగు చట్టాలకు సంబంధించిన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు కాంగ్రెస్ పార్లమెంటు నుంచి పారిపోయిందని హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై రవనీత్ సింగ్ బిట్టు స్పందిస్తూ, కేంద్ర కేబినెట్‌లో కౌర్ ఉన్నపుడే ఈ బిల్లులు ఆమోదం పొందాయన్నారు. ఈ బిల్లులకు కేబినెట్ ఆమోదం లభించినపుడు కౌర్ కేంద్ర మంత్రిగా ఉండేవారన్నారు. ఈ బిల్లులకు ఆమోదం లభించిన తర్వాత ఆమె మంత్రివర్గం నుంచి వైదొలగారన్నారు. కేబినెట్‌లో ఉండగా ఆమె ఈ బిల్లులకు వ్యతిరేకంగా కనీసం ఒక్క మాట అయినా మాట్లాడలేదన్నారు. 


దీనిపై కౌర్ స్పందిస్తూ, వాళ్ళని అడగండి. రాహుల్ గాంధీ ఎక్కడ? సోనియా గాంధీ ఎక్కడ? పార్లమెంటులో ఈ బిల్లులు ఆమోదం పొందినపుడు సోనియా, రాహుల్ ఎక్కడ ఉన్నారో అడగండన్నారు. పార్లమెంటు నుంచి వాకౌట్ చేసి, ఈ బిల్లులకు ఆమోదం లభించే విధంగా సహాయపడ్డారని మండిపడ్డారు. 


ఓ విలేకరి రవనీత్ బిట్టూతో మాట్లాడుతూ, ప్రతిపక్షాల ఐక్యత గురించి చెప్పాలని అడిగారు. దీనిపై బిట్టూ స్పందిస్తూ, ‘‘ఏం సమైక్యత? వాళ్ళు (ఎస్ఏడీ) బిల్లులను ఆమోదింపజేశారు. ఎస్ఏడీ చీఫ్ సుఖ్‌బిర్ సింగ్ బాదల్ ఎక్కడున్నారో అడగండి. ఇప్పటికి ఐదు రోజులయింది. వాళ్ళు (ఎస్ఏడీ) పార్లమెంటు బయట నాటకాలు ఆడుతున్నారు’’ అన్నారు. 


వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు వెలుపల ఎస్ఏడీ మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ధర్నాలో హర్‌సిమ్రత్ కౌర్ కూడా పాల్గొంటున్నారు.


Updated Date - 2021-08-04T20:12:50+05:30 IST