Alt News సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-28T13:23:19+05:30 IST

మతపరమైన మనోభావాలను దెబ్బతీయడంతోపాటు, అల్లర్లను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్‌ను...

Alt News సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్ అరెస్ట్

న్యూఢిల్లీ: మతపరమైన మనోభావాలను దెబ్బతీయడంతోపాటు, అల్లర్లను రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ట్విటర్‌లో ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేసిన వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు.జుబైర్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 153, 295ఎ కింద అభియోగాలు మోపారు.జుబైర్‌ను ఢిల్లీలోని బురారీలోని డ్యూటీ మేజిస్ట్రేట్ నివాసంలో హాజరుపర్చారు. అనంతరం అతడిని ఒకరోజు పోలీసు కస్టడీకి తరలించారు.మత సామరస్యానికి విఘాతం కలిగించే ట్వీట్ల గురించి ట్విట్టర్ హ్యాండిల్ పోలీసులను అప్రమత్తం చేయడంతో జుబైర్‌ను ఢిల్లీ పోలీసు విభాగం అరెస్టు చేసింది. 


ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా మాట్లాడుతూ, జుబైర్‌ కు నోటీసు ఇవ్వలేదని, పలుసార్లు అభ్యర్థించినా ఎఫ్‌ఐఆర్ కాపీని ఇవ్వలేదన్నారు.జుబైర్ అరెస్టు నిజంపై దాడిగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అభివర్ణించారు.ఆల్ట్‌న్యూస్ సహ వ్యవస్థాపకుడు ముహమ్మద్ జుబైర్ అరెస్టును ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది.2020వ సంవత్సరంలో నమోదు చేసిన కేసులో అరెస్టు నుంచి ఢిల్లీ హైకోర్టులో రక్షణ పొందినా, ఢిల్లీ పోలీసులు విచారణ పేరిట పిలిచి అతన్ని అరెస్టు చేశారని ఎడిటర్ గిల్డ్స్ ఆరోపించింది. జుబైర్ అరెస్టును ఖండిస్తూ విడుదల చేసిన ప్రకటనలో ఎడిటర్ గిల్డ్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు సీమా ముస్తఫా, ప్రధాన కార్యదర్శి సంజయ్ కపూర్, కోశాధికారి అనంత్ నాథ్ లు సంతకాలు చేశారు.జర్నలిస్ట్ జుబైర్ ను వెంటనే విడుదల చేయాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. జుబైర్, అతని వెబ్‌సైట్ ఆల్ట్ న్యూస్ గత కొన్ని సంవత్సరాలుగా నకిలీ వార్తలను గుర్తించడంలో, తప్పుడు ప్రచారాలను ఎదుర్కోవడంలో నిష్పాక్షికంగా ఆదర్శప్రాయమైన పని చేస్తోంది’’అని గిల్డ్ ప్రకటన తెలిపింది.

Updated Date - 2022-06-28T13:23:19+05:30 IST