బాదుడే.. బాదుడు!

ABN , First Publish Date - 2022-05-07T05:30:00+05:30 IST

వంట గ్యాస్‌ ధర మరోసారి రూ.50 పెరిగి ప్రజలపై మరింత ఆర్థిక భారాన్ని మోపింది. చమురు సంస్థలు 14.2 ఎల్పీజీ సిలిండర్‌ ధరను శనివారం మరోసారి పెంచాయి.

బాదుడే.. బాదుడు!


  • ఉమ్మడి జిల్లా ప్రజలపై రోజుకు రూ.38.75 లక్షల అదనపు భారం
  • వంట గ్యాస్‌ సిలిండర్‌పై మరోసారి రూ.50 పెంపు
  • రూ.1,052.50కి చేరిన గృహ వినియోగ సిలిండర్‌
  • ధర పెంపుతో సామాన్యుల బెంబేలు
  • డొమెస్టిక్‌ గ్యాస్‌పై పెంచిన రేటునుతగ్గించాలని డిమాండ్‌
  • పెంపును నిరసిస్తూ ఈ నెల 15న బాలాపూర్‌ చౌరస్తాలో మహాధర్నా

    వంట గ్యాస్‌ ధర మరోసారి రూ.50 పెరిగి ప్రజలపై మరింత ఆర్థిక భారాన్ని మోపింది. చమురు సంస్థలు 14.2 ఎల్పీజీ సిలిండర్‌ ధరను శనివారం మరోసారి పెంచాయి. రెండు నెలల్లోపు సిలిండర్‌ వంద పెరిగింది. సబ్సిడీ సిలిండర్‌ ధర ఇప్పుడు రూ.1,052.5కు చేరింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెంపు భారం రోజుకు 38.75లక్షలు ఉండనుంది. మోదీ ప్రభుత్వం తరచూ గ్యాస్‌ ధరలు పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజలు గ్యాస్‌ వినియోగించకుండా చేస్తోందని రాజకీయ పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు. గ్యాస్‌ ధర పెంపునకు నిరసనగా, పెంచిన ధరను వెంటనే తగ్గించాలనే డిమాండ్‌తో ఈ నెల 15న మంత్రి సబితారెడ్డి నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ మహాధర్నా చేపట్టనుంది. 

రంగారెడ్డి అర్బన్‌, మే 7  కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్యులకు షాకిచ్చింది. ఈ నెల 1న వాణిజ్య సిలిండర్‌ ధరలు పెంచిన ప్రభుత్వం.. ఈ సారి గృహ వినియోగ (డొమెస్టిక్‌ గ్యాస్‌) సిలిండర్‌పై వడ్డించింది. 14.2కేజీల ఎల్పీజీ సిలిండర్‌పై రూ.50 పెంచుతూ శనివారం చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,052.5కు చేరింది. దీనికి డెలివరీ బాయ్స్‌ తీసుకునే రూ.30 కలిపితే రూ.1,082 చేరుకుంది. డొమెస్టిక్‌ సిలిండర్‌ ధరను మార్చి 22న రూ.50పెంచిన విషయం తెలిసిందే. గత ఏడునెలల కాలంలో సిలిండర్‌పై రూ.320 పెంచింది. వంట గ్యాస్‌ బండ సామాన్యులకు గుదిబండలా మారింది. ఓ వైపు పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరలు మోత మోగుతోంటే మరో వైపు గ్యాస్‌ ధర పెంపుతో ప్రజలు బేజారవుతున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో ఇప్పటికే వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.500 ఉండగా ఇప్పుడు వెయ్యి దాటిపోవడంతో గృహిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్‌ పొయ్యి కంటే.. కట్టెల పొయ్యే బెటర్‌ అంటున్నారు.

ఉమ్మడి జిల్లా ప్రజలపై రూ.లక్షల్లో అదనపు ధరాభారం!

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారత్‌, ఇండేన్‌, హెచ్‌పీ కంపెనీల గ్యాస్‌ డిస్ర్టిబ్యూటరీ ఏజెన్సీలు వందకుపైగానే ఉంటాయి. వీటి పరిధిలో 24,45,839 వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు సగటున 78,808 రీఫిల్‌ డెలివరీలు చే స్తున్నారు. ఈ లెక్కన సిలిండర్‌ ధరపై రూ.50చొప్పున పెరిగితే నిత్యం ప్రజలపై రూ.38,75,000 భారం పెరిగింది.

అందని సబ్సిడీ..

ఐదారేళ్ల కిందటి వరకు సబ్సిడీ పోగా సిలిండర్‌ ధర తీసుకునే వారు. అప్పుడు ధర రూ.550లోపే ఉండేది.  ఈ విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. మొదట వినియోగదారులు 14.2కిలోల సిలిండర్‌ ధర మొత్తం చెల్లిస్తే ప్రభుత్వ సబ్సిడీని కస్టమర్ల బ్యాంక్‌ ఖాతాకు బదిలీ చేయడం ప్రారంభించింది. గతంలో గ్యాస్‌ సిలిండర్‌పై సబ్సిడీని బ్యాంక్‌ ఖాతాల్లో వేసేవారు. ఏడాదిన్నరగా సబ్సిడీ డబ్బు బ్యాంక్‌ ఖాతాల్లో జమ కావడం లేదు. కొందరికి రూ.42 అడపాదడపా పడుతున్నా చాలా మందికి డబ్బు రాలేదు. సబ్సిడీ గ్యాస్‌ ధర ఎంతో తెలియడం లేదని, సబ్సిడీ వస్తుందో.. రాదో ఏజెన్సీలూ చెప్పడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. 

ధర తగ్గించాలని 15న మంత్రి ఆధ్వర్యంలో మహాధర్నా

తరచూ పెంచుతున్న గ్యాస్‌ సిలిండర్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి నేతృత్వంలో ఈ నెల 15న మహా ధర్నా నిర్వహించనున్నారు. సామాన్య ప్రజలపై ఈ పెంపు పెనుభారంగా మారింది. మహేశ్వరం నియోజకవర్గ పరిధి బాలాపూర్‌ చౌరస్తాలో 15న సాయంత్రం 4గంటలకు మహాధర్నా నిర్వహిస్తామని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని మోడీ వల్ల మళ్లీ కట్టెల పొయ్యి వినియోగించాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. గ్యాస్‌ ధర పెంపుతో, మహిళా లోకం తరపున ధర్నాను తలపెట్టామని నాయకులు పేర్కొన్నారు. ‘మోదీజీ.. సిలిండర్‌ తీస్కపో.. కట్టెల పొయ్యి ఇచ్చిపో’ అనే నినాదంతో ధర్నా కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. ధర్నా విజయంతానికి మహిళలు పెద్దఎత్తున తరలిరావాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.

పాత రోజులే మేలు..!

గ్యాస్‌ ధరలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్నేండ్ల కింద అడవులు, పొలం గట్ల వెంబడి లభించే కట్టెలతో వంట చేసుకునే వాళ్లం అని, గ్యాస్‌ ఖర్చు ఉండేది కాదంటున్నారు. ఆరో గ్యం కోసమంటూ గ్యాస్‌ను అలవాటు చేసి ఇప్పుడు ధరలు పెంచుతున్నారని వాపోతున్నారు.

  • కట్టెల పొయ్యే బాగుండే.. :నందికొండ ఇందిరమ్మ, రతన్‌ కాలనీ, షాద్‌నగర్‌
కట్టెల పొయ్యి ఉన్నప్పుడే బాగుండే. అడవిలో, పొలం గడ్ల వద్ద కట్టెలు సేకరించి తెచ్చి వంట చేసుకునే వాళ్లం. కట్టెల పొయ్యి పొగతో కండ్లు మండేవి. కండ్లు పాడవుతాయని గ్యాస్‌ పొయ్యిని అలవాటు చేశారు. నాకు తెలిసి సిలిండర్‌ ధర రూ.247 ఉండె. దాని ధర ఇప్పుడు వెయ్యి యాభైకి చేరింది. పదో ఐదో పెంచితే పర్వాలేదు. పెంచినప్పుడల్లా 50 పెంచుతున్నారు. పేదలు ఇప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ను కొనే పరిస్థితి లేదు.
  • సబ్సిడీని కేంద్రం భరించాలి : మహేశ్వరి, షాద్‌నగర్‌ 

మళ్లీ కట్టెల పొయ్యే దిక్కయ్యేలా ఉంది. పెట్రోల్‌, డీజిల్‌తో పాటు గ్యాస్‌ ధరను తరచూ పెంచుతున్నారు. మా లాంటి సామాన్యులు బతకడం కష్టంగా మారుతోంది. పెరుగుతున్న నిత్యావసర ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. పెంచిన గ్యాస్‌ సిలిండర్‌పై 50 శాతం సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరించి ఆర్థికంగా పేదలను ఆదుకోవాలి.

  • గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గించాలి : కావలి లావణ్య, హిమాయత్‌నగర్‌

పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరను వెంటనే తగ్గించాలి. ఇప్పటికే ఆర్థిక పరిస్థితుల కారనంగా కుటుం బ పోషణ ఇబ్బందిగా మారింది. నిత్యావసర సరుకుల ధరలు విపరీంతంగా పెరిగిపోయాయి. వంట గ్యాస్‌ ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వాలు సిలిండర్‌ ధరలో 50శాతం సబ్సిడీ భరించి సామాన్యులకు సగం ధరకే సిలిండర్‌ సరఫరా చేయాలి.                                                      

Read more