సినిమా కష్టాలు

ABN , First Publish Date - 2020-07-02T09:39:44+05:30 IST

ప్రజల వినోద సాధనాల్లో అత్యంత ప్రధానమైన సినిమా థియేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. లాక్‌డౌన్‌తో మూతపడిన థియేటర్లు

సినిమా కష్టాలు

థియేటర్లు మూతపడి నేటికి వంద రోజులు

లాక్‌డౌన్‌తో మార్చి 23 నుంచి బంద్‌

నిర్వాహకులపై నిర్వహణ భారం

ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు

ప్రభుత్వం ఆదుకుంటేనే అంతో ఇంతో ఊరట


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ప్రజల వినోద సాధనాల్లో అత్యంత ప్రధానమైన సినిమా థియేటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. లాక్‌డౌన్‌తో మూతపడిన థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియకపోవడం, మరోవైపు నిర్వహణ భారం గుదిబండలా మారడంతో ఎగ్జిబిటర్లు గగ్గోలు పెడుతున్నారు. పరిస్థితి మరికొన్నాళ్లు ఇలాగే కొనసాగితే చాలా థియేటర్లు శాశ్వతంగా మూతపడడం ఖాయమని చెబుతున్నారు.

 

జిల్లాలో 150 థియేటర్లు

నగరంతో కలిపి జిల్లావ్యాప్తంగా 150 థియేటర్లు ఉన్నాయి. పోటీ పెరిగిన నేపథ్యంలో అన్ని థియేటర్లు ఏసీతోపాటు కుషన్‌ సీట్ల వంటి ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఇందుకోసం యజమాన్యాలు భారీమొత్తం వెచ్చించారు. ఇక విద్యుత్‌ చార్జీలు, సిబ్బంది జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చుల కింద నెలకు సగటున రూ.6 లక్షలు ఖర్చవుతోంది. సాధారణ రోజుల్లో ఇంత పెద్దమొత్తం ఆదాయం రాకున్నా పండుగ రోజులు, ఇతర ప్రత్యేక రోజుల్లో వచ్చే అధికాదాయంతో ఇన్నాళ్లూ నిర్వాహకులు నెట్టుకు వచ్చేవారు. లాక్‌డౌన్‌తో మార్చి 23 నుంచి అన్ని థియేటర్లు మూతపడ్డాయి.


గురువారం నాటికి వంద రోజులు పూర్తవుతోంది. ఇప్పుడప్పుడే తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. ఆదాయం లేకపోయినా నిర్వహణ భారం తప్పడం లేదు. నెలకు రూ.లక్షల్లో ఖర్చు భరించాల్సి రావడంతో నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పట్లో థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడం, తెరిచినా జనం వస్తారన్న నమ్మకం లేకపోవడంతో చాలా థియేటర్లు శాశ్వతంగా మూతపడడం ఖాయమని నిర్వాహకులు భావిస్తున్నారు. 


సిబ్బంది అర్ధాకలి జీవితాలు

జిల్లాలోని సినిమా థియేటర్లపై ఆధారపడి ప్రత్యక్షంగా రెండు వేల కుటుంబాలు బతుకుతున్నాయి. ప్రస్తుతం వీరంతా అర్ధాకలితో బతుకులీడుస్తున్నారు. నిర్వాహకులు సగం జీతమే ఇస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతానికి అప్పులతో నెట్టుకు వస్తున్నామని, మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి వుంటే ఇబ్బందేనని వాపోతున్నారు. దశాబ్దాలుగా ఇదే వృత్తిలో ఉండడంతో మరో పనిచేతకాక ఇబ్బందులు పడుతున్నారు. 


ఆస్తిపన్ను, విద్యుత్‌ చార్జీలు రద్దు చేయాలి:  కె.వంశీకిశోర్‌ (చిన్ని), మోహిని థియేటర్‌ యజమాని

లాక్‌డౌన్‌ కాలానికి విద్యుత్‌ చార్జీలతోపాటు ఆస్తిపన్ను రద్దు చేయాలి. మద్యం దుకాణాలు, హోటళ్లకు అనుమతిచ్చి థియేటర్లను పక్కనపెట్టడం అన్యాయం. వీటి కంటే థియేటర్లలోనే భౌతిక దూరం పాటించేందుకు అవకాశం ఎక్కువ. ఇప్పటికే వంద రోజులు పూర్తయ్యింది. ఇంకామూత కొనసాగితే శాశ్వతంగా మూతపడడం ఖాయం.

Updated Date - 2020-07-02T09:39:44+05:30 IST