అల్‌ కాయిదా చీఫ్‌ అల్‌ జవహరి హతం

ABN , First Publish Date - 2022-08-03T09:13:34+05:30 IST

అల్‌-కాయిదా చీఫ్‌.. 9/11 అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌(డబ్ల్యూటీసీ) ట్విన్‌ టవర్స్‌పై ఉగ్రదాడిలో భాగస్వామి అయ్‌మాన్‌ అల్‌-జవహరి(71) హతమయ్యాడు.

అల్‌ కాయిదా చీఫ్‌ అల్‌ జవహరి హతం

  • కాబూల్‌లో మట్టుబెట్టిన సీఐఏ.. అతనొక్కడే టార్గెట్‌గా డ్రోన్‌ దాడి
  • 9/11 మృతుల కుటుంబాలకు సాంత్వన లభించిందన్న బైడెన్‌
  • యుద్ధం లేకుండా ఉగ్రవాదాన్ని అంతం చేయొచ్చు: ఒబామా
  • అమెరికా మిత్రులకు ముప్పుగా ఉన్నా వేటాడతాం: బ్లింకెన్‌

కాబూల్‌, వాషింగ్టన్‌, ఆగస్టు 2: అల్‌-కాయిదా చీఫ్‌.. 9/11 అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌(డబ్ల్యూటీసీ) ట్విన్‌ టవర్స్‌పై ఉగ్రదాడిలో భాగస్వామి అయ్‌మాన్‌ అల్‌-జవహరి(71) హతమయ్యాడు. పకడ్బందీగా చేపట్టిన ఆపరేషన్‌లో అమెరికా గూఢచార సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(సీఐఏ), కౌంటర్‌ టెర్రరిజం ఆపరేషన్‌ బృందాలు అఫ్ఘానిస్థాన్‌ రాజధాని నగరం కాబూల్‌లో ఆదివారం ఉదయం అతడిని మట్టుబెట్టాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.30 గంటలకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ వైట్‌హౌస్‌ వేదికగా ఈ విషయాన్ని నిర్ధారించారు. కాబూల్‌లోని షేర్పూర్‌ ప్రాంతంలోని ఓ నివాసంలో జవహరి తన కుటుంబంతోసహా కొన్నాళ్లుగా ఉంటున్నట్లు ఉప్పందుకున్న సీఐఏ.. నిఘా పెట్టింది. ఆ ఇల్లు తాలిబాన్‌ సీనియర్‌ నాయకుడు, హక్కానీ నెట్‌వర్క్‌ నేత సిరాజుద్దీన్‌ హక్కానీకి చెందినది అని గుర్తించింది.


అఫ్ఘాన్‌ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున జవహరి ఆ ఇంటి బాల్కనీలో ఒంటరిగా ఉన్నట్లు గుర్తించిన సీఐఏ క్షేత్రస్థాయి ఏజెంట్లు.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి ఆదేశాలతో.. వెంటనే ఆపరేషన్‌ ప్రారంభమైంది. డ్రోన్ల ద్వారా రెండు హెల్‌ఫైర్‌ క్షిపణులను ప్రయోగించారు. జవహరి అక్కడికక్కడే మరణించగా.. ఆయన నిల్చున్న బాల్కనీ(మొదటి అంతస్తు), దానికి సమీప ప్రాంతాలు మాత్రమే దెబ్బతిన్నాయి. మిగతా భవనానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ దాడి జరిగినప్పుడు ఆ ఇంట్లో జవహరితోపాటు.. అతని భార్య, కుమార్తెలు, మనవలు ఉన్నారు. అయితే.. కేవలం జవహరి మాత్రమే టార్గెట్‌ అయ్యేలా ఈ దాడి జరిగింది. ఈ దాడిని తాలిబాన్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ నిర్ధారించారు. ‘‘కాబూల్‌లోని షేర్పూర్‌ ప్రాంతంలో ఓ నివాసంపై వైమానిక దాడి జరిగింది’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఈ దాడిని దోహా ఒప్పందం, అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా ఆయన పేర్కొన్నారు. అయితే.. చనిపోయింది అల్‌-జవహరి అని మాత్రం నిర్ధారించలేదు. 


జవహరిని మట్టుబెట్టాం: బైడెన్‌

భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7.30 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వైట్‌హౌస్‌ నుంచి చేసిన ప్రత్యేక ప్రసంగంలో.. జవహరి హతమైనట్లు అధికారికంగా ప్రకటించారు. కాబూల్‌లో సీఐఏ ఆపరేషన్‌ వివరాలను వెల్లడిస్తూ.. ‘‘జవహరి ఇకపై అఫ్ఘానిస్థాన్‌ను ఉగ్రవాదుల స్వర్గధామంగా మార్చలేడు. ఎందుకంటే.. ఆయన హతమయ్యాడు. ప్రత్యేక ఆపరేషన్‌లో అతణ్ని మట్టుబెట్టాం. 9/11 దాడుల సూత్రధారులెవరూ మిగలకుండా చర్యలు తీసుకుంటాం. 9/11 దాడిలో ప్రాణాలు కోల్పోయిన 2997 మంది కుటుంబాల బాధకు, ఆవేదనకు జవహరి మరణం ఓ ముగింపు అని భావిస్తున్నా. వారికి న్యాయం జరిగిందని విశ్వసిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. అమెరికా పౌరులకు హాని కలిగిస్తే.. ఎక్కడ దాక్కున్నా.. ఎంతకాలమైనా.. గుర్తించి, మట్టుబెడతామని హెచ్చరించారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసిన నిఘా, ఆపరేషన్‌ బృందాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. తాను గతనెల 25న ఈ ఆపరేషన్‌కు ఆమోదముద్ర వేసినట్లు వివరించారు. కాగా.. ఒక్క పౌరుడికీ నష్టం జరగకుండా ఈ ఆపరేషన్‌ను పూర్తిచేయడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రశంసలు కురిపించారు. 20 ఏళ్ల తర్వాత 9/11 సూత్రధారికి ఎట్టకేలకు శిక్ష పడిందన్నారు.


యుద్ధం లేకుండానే ఉగ్రవాదాన్ని అంతమొందించవచ్చనడానికి ఈ ఆపరేషన్‌ నిదర్శనమని కొనియాడారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ దీనిపై స్పందిస్తూ.. అమెరికా పాలిట.. అమెరికా పౌరుల పాలిట.. అమెరికా మిత్ర దేశాల పాలి ట ముప్పుగా ఉన్నవారిని నిరంతరం వేటాడుతామని హెచ్చరించారు. కాగా.. 9/11 దాడి తర్వాత జవహరి అఫ్ఘానిస్థాన్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో తలదాచుకున్నాడు. 2011లో ఒసామా బిన్‌ లాడెన్‌ను అమెరికా సేనలు పాకిస్థాన్‌లో మట్టుబెట్టాక.. అల్‌ ఖాయిదా బాధ్యతలను జవహరి భుజాలకెత్తుకున్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాదిగా.. ఉగ్రవాదానికే గుర్తింపుగా జవహరి ఎదిగాడు. దీంతో అమెరికా అతని తలపై రూ. 196.25 కోట్ల(25 మిలియన్ల డాలర్లు) రివార్డును ప్రకటించింది. మరోవైపు.. అల్‌-జవహరిని అమెరికా మట్టుబెట్టడంపై 9/11 ఉగ్రదాడి’ బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. 


వారసుడెవరు? 

న్యూఢిల్లీ, ఆగస్టు 2: అల్‌ జవహరి మరణంతో అల్‌ కాయిదా తదుపరి చీఫ్‌ ఎవరన్నదానిపై చర్చ జరుగుతోంది. జవహరి వారసుడి రేసులో నలుగురు ఉగ్రవాదులున్నట్లు తెలుస్తోంది. సీనియారిటీ లిస్టులో మొదట ఉన్న సైఫ్‌ అల్‌ ఆదిలే తదుపరి చీఫ్‌ అవుతారని చాలా మంది భావిస్తున్నారు. అబ్దుల్‌ రహమాన్‌ అల్‌ మఘ్రెబీ, యాజిద్‌ మెబారక్‌, అహ్మద్‌ దరియే పేర్లను కూడా పరిశీలించే అవకాశం ఉందని మరికొందరు చెప్తున్నారు.  

Updated Date - 2022-08-03T09:13:34+05:30 IST