వర్ణాక్షర సంయోగం

ABN , First Publish Date - 2022-09-12T05:54:00+05:30 IST

ప్రకృతి రంగులకూ కవికీ ఉన్న సంబంధం కంటే చిత్రకారుడికి ఉన్న సంబంధం మరింత సన్నిహిత మైనదనే చెప్పాలి. కవి అక్షర రూపంలో వ్యక్తపరిచే ప్రకృతీ...

వర్ణాక్షర సంయోగం

ప్రకృతి రంగులకూ కవికీ ఉన్న సంబంధం కంటే చిత్రకారుడికి ఉన్న సంబంధం మరింత సన్నిహిత మైనదనే చెప్పాలి. కవి అక్షర రూపంలో వ్యక్తపరిచే ప్రకృతీ, రంగులూ అర్థం చేసుకోవడానికి భాషా సామర్థ్యం అవసరం కానీ చిత్రకారుడి కుంచె ప్రకృతినీ, రంగుల్నీ మన కళ్ళ ముందు నిలబెడుతుంది.


ఒక చిత్రకారుడు కవిగా అక్షరాల్ని సృష్టించినా అవి అతని చిత్రాల్లోని వర్ణాలకు మల్లేనే మనని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అలాంటి వర్ణ అక్షర సంయోగమే ‘ఆలోలాంతరాళాలలో’. ఈ సంపుటి లోని కవితలు ఒక కవి అక్షరాల పేర్పు కాదు. ఒక చిత్రకారుడి ‘చిత్రాల ఆల్బమ్‌’. ఆ కవీ చిత్రకారుడు పద్మశ్రీ యస్‌.వి. రామారావుగారు. సత్యజిత్‌ రే చిత్రాలు, రవిశంకర్‌ సితార్‌, ఎం.ఎంస్‌. సంగీతం లాంటిదే యస్‌.వి. రామారావు గారి చిత్రకళ అన్నాడు కొడవటిగంటి కుటుంబరావు. పికాసో అంత గొప్పవాడుగా గుర్తించబడ్డ రామారావును ‘అంతర్జాతీయ కళారంగం మీద చెరిగిపోని సంతకం చేసిన కళాకారుడు’ అన్నారు అబ్దుల్‌ కలాం. ‘ఆలోలాంతరాళాలలో’ అనేది నలభై చిత్రాలు, వివిధ వర్ణాలూ, ధ్వనులూ ఉన్న ‘medley’.


శిల్పమూ, గీతలు, ముఖాలు ఒక చిత్రకారుని ఆలోచనకూ, దృష్టికీ సంబంధించిన ప్రధాన అంశాలు. ఈ అంశాలతోనే మొదలవుతుంది మొట్టమొదటి కవిత ‘బెనిన్‌ శిల్పాలగీతలు: నాముఖాలు’. ఈ కవిత ఈ సంపుటిలోని అక్షరాల కూర్పు, వాక్యాల వరుస ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. కొందరు కవులు సృజించే వాక్యాలలోని సంక్లిష్టత పాఠకులకు అంత సులభ గ్రాహ్యం కాదు. కొందరు సృజనకారులు తమలోతాము సంభాషించు కోవడాన్ని ఇతరులు అర్థం చేసుకోలేరు. కొందరు కవులు మనకూ తమకూ మధ్య ఎటువంటి అడ్డుతెర లేకుండా సరళమైన పదాలు, సెలయేటి గలగలల్లా ధ్వనించే వాక్యాలు ఉపయోగిస్తారు. ఒక స్నేహితుడిలా పలకరించి ఆప్యాయంగా ఆత్మీయంగా సంభాషి స్తారు. ఆలోలాంతరాళాలలో యస్‌.వి. రామారావు గారి కవిత్వీకరణ సరిగ్గా అలాంటిదే. చాలా కవితల్లో పదాల విరుపు వాక్యాల పేర్పు ఆంగ్ల కవి విలియం బ్లేక్‌ను గుర్తు చేస్తాయి. బ్లేక్‌ కవిత ‘"Spring'’ లోని swift movement ఈ కవితల్లో కనిపిస్తుంది ("Birds delight/ Day and Night./ Nightingale/ In the dale/ Lark in Sky/ Merrily''). అద్దం లాంటి కొలను, కొలనుగట్టు, కొత్తగా పెరిగిన పచ్చగడ్డి పరుపు, తెల్లని హంస, అస్తమించే సూర్యుడు, పూర్ణచంద్రుడు, నీటి అలల చక్రాలు, విరబూసిన నక్షత్రాలు, జలకాలాడుతున్న పూరేకుల గుంపు వంటి వాక్యాలతో సాక్షాత్కరించే ప్రకృతి తన విశాలమైన బాహువుల్తో మనల్ని ఆలింగనం చేసుకుంటుంది. 


ఈ కవితల్లో అద్భుతమైన ‘Paradise’కు ఉదాహరణ ‘బాణం విసిరిన పిచ్చుక’: ‘‘... ...గ్రద్ద గోళ్లలో/ -జీవన్మరణాల మధ్య- / ఇరుక్కున్న పిచ్చుక/ అడుగుతుంది- / ‘ఎగిరే నిన్ను ఇప్పుడు/ ఎవరైనా బాణంతో కొడ్తే/ ఎలా ఉంటుంది?’ అని.’’... ఇలా సాగు తుంది ఈ కవిత. ప్రాణభయంతో పిచ్చుక అన్నమాట ఒక బాణమై తాకడంతో గ్రద్ద పిచ్చుకను నేలమీద వదుల్తుంది. మాటకు ఉన్న అపారమైన శక్తిని కాదనలేం. ఈ కవితలో సాధ్యాసాధ్యాల సంగతి వదిలితే ఒక ప్రాణం రక్షించబడటం వల్ల మనకు కలిగే అనుభూతి చాలాసేపటిదాకా మనల్ని ఒక పరిమళంలా అంటిపెట్టుకుని ఉంటుంది. 


కవిత్వాన్ని మాట్లాడే చిత్రకళగా భావిస్తారు రామారావుగారు. ప్రకృతి సౌందర్యాన్ని ఇనుమడింపజేసే కొండలూ, కాలువలూ, చెట్లూ, పక్షులూ, ఆకాశం, మబ్బులూ, సూర్యకాంతి, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలంవంటి వర్ణాలు, ప్రకృతిలో మార్పులు తీసుకువచ్చే వివిధ కాలాలు, సమస్త విశ్వం మనల్ని కమ్మేస్తుంది. ""To me a lush carpet of pine needles or spongy grass is more welcome than the most luxurious Persian rug'' అంటుంది హెలెన్‌ కెల్లర్‌. ఈ కవితల్లో ప్రకృతిలోని జీవచైతన్యమే ప్రాణశక్తి. దాన్ని మనం కంటితోనూ స్పర్శించే అనుభవిస్తాం, అనుభూతి చెందుతాం. అనుభూతే ప్రధాన మైన అంశంగా కనిపించే ఈ కవితల్లో అర్థాల కోసం వెతకడం కంటే అర్థాల్ని మించిన భావాల్ని వెదకడం అవసరం. ఈ విష యాన్నే ‘అర్థాల కోసరం కాదు నా చిత్రాల్ని చూచేది’ అనే కవిత వ్యక్తం చేస్తుంది: ‘‘అర్థాలకు మించిన భావాలతో/ నవ్వే రంగులు పాడే మూగ సంగీతంగా/ నాలోనుండి/ ప్రవాహంగా వచ్చే చిత్రాలు/... (చూస్తూ) మీరు, నేను/ అనుభూతి పొందుదాం’’. 


ప్రతి కవితలోనూ ఎంతో సాదాసీదాగా కనిపించే వాక్యాల మధ్య ఉలిక్కిపడేట్టు చేసే పదచిత్రాలు ప్రత్యక్షమవుతాయి. ‘కురుస్తున్న మంచులో నగ్నంగా నిల్చున్న చెట్లు’ కవితలో, ‘‘గడ్డ కడ్తున్న చలిలో/ కురుస్తున్న/ వర్షపు చినుకులు/ గుంపులు గుంపులుగా/ ఒక్కదా న్నొక్కటి/ అంటిపెట్టుకొని,/ బిగికౌగిలిలో ఐసికిల్స్‌లా ఒకటై పోయాయి,’’ అన్న పంక్తులు కవి భావనా శక్తికి నిదర్శనం. 


ఆలోలాంతరాళాలలో చిత్రకారుడి కుంచె నుంచి కవితా చిత్రాక్ష రాలుగా రూపుదిద్దుకున్న కవితలే కాక సామాజిక/ వైయక్తిక అంశాలకు సంబంధించిన కవితలు కూడా ఉన్నాయి. ‘పక్షులు ఎందుకు నివాసముండవో నేలపై - తెలిసింది’ కవితలో, ‘‘మనుషుల జీవితాలు,/ సంకుచిత పరిధిలో/ బొంగరంలా గిరగిరా/ తిరిగిన చోటనే/ తిరుగుతాయని/ తెలుసేమో వాటికి’’ అంటారు. మనిషి సంకుచితత్వాన్ని తెలియజెప్పే ఈ కవిత మనిషి ప్రవర్తన కారణంగానే పక్షులు నేలపై ఉండవని తెలియజేస్తుంది. ఈ కవితలో గోళాలు అనంత విశ్వంలో జుగల్‌ బందీ నృత్య విన్యాసాలు, కెంపురంగురాళ్ళపై సూర్యరశ్మి, పసుపు కలిపిన కొలనులో పూర్ణచంద్రబింబం, బంగారాన్ని పండించిన ఆకాశం, అలల మేఘాలు, ఇంద్రధనుస్సుల పీతాంబరాలు, పరమశివుని శరీరం నుండి రాలిన బూడిద కుప్పల మధ్య నుండి తొంగి చూసే కొండల వంటి పదచిత్రాలు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని గుర్తు చేస్తాయి. 


చిత్రాలను ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే వివ రణను ఇచ్చే కవిత ‘అందుకే దూరం చేస్తున్నాయి - నా చిత్రాలు’: ‘‘చిత్రకళారంగంలో నిష్ణాతులు/...అద్భుతమైన వినూత్నమైన శైలిని ఆవిష్కరించానని/ శ్లాఘిస్తుంటుంటే, వ్రాస్తుంటుంటే వివరాలతో/ నా తెలుగువారు, భారతీయులు, అయినవాళ్ళు అందరూ-/ అర్థాలే మిటి ఈ చిత్రాలకు?/ మాకెందుకుంటాయి ఇంత అయోమయంగా?’’ అంటారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. నిస్పృహతో కూడిన ఈ ప్రశ్నకు సమాధా నంగా కవి తన చిత్రాలను కండ్లతో తడమాలని, చిత్రకళలోని తాత్వికత లోతులు చూసేవారి ఆతోచనను, ప్రతిభను బట్టి అవి అర్థమౌతాయని అంటారు. తన చిత్రాలు ‘‘చిత్ర విచిత్ర వర్ణ మిశ్రమాల’’ని, తన ‘‘జీవితాన్నే ఫణంగా పెట్టి’’నవనీ వివ రిస్తారు. నిజమే, నైరూప్య చిత్రాలు కేవలం కళ్ళతో చూసినంత మాత్రాన అర్థం కావు కదా!


స్వదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితి రావడ మనే మూగ బాధను వివరిస్తుంది, ‘తిరిగి వెళ్తే ఇక బ్రతకనేమో!’ అనే కవిత. ఏ పరిస్థితిలో తను పరాయి దేశం వెళ్ళాల్సివచ్చిందో చెప్తూ వలసవెళ్ళిన దేశం నుంచి తిరిగి పుట్టిన ఊరికి వచ్చి గడపాలని ఉందనే ఆశనూ వ్యక్తపరుస్తారు రామారావుగారు. ‘‘ఇక ఎంతో కాలం బ్రతకనేమో/ ఒకవేళ నా కన్న దేశానికి/ తిరిగి వెళ్తే/ అన్న సంకో చంతో/ కూడుకున్న భయం/ వెంటాడుతున్నది’’ అనీ చెప్తారు. కళ్ళు చెమర్చే పంక్తులు ఉన్న ఈ కవిత, ‘‘ఒక్కచోట పుట్టిన నది/ ఎక్కడె క్కడికో/ పరుగులు తీస్తుందేకాని/ తిరిగిరాదుగా/ పుట్టిన చోటుకు/ ఒక్కసారైనా!’’ అనే భావ చిత్రంతో ఆర్ద్రంగా ముగుస్తుందీ కవిత. 


‘ఆలోలాంతరాళాలలో’ సంపుటిలోని కవితాశీర్షికలు సహజంగా అక్షరాల చెట్టుకు కాసిన ఫలాల్లా ఉంటవి. ‘మంచు తెరల ఉద యాన గుసగుసలు’, ‘అర్థాల కోసరం కాదు నా చిత్రాల్ని చూచేది’, ‘కురుస్తున్న మంచులో నగ్నంగా నిల్చున్న చెట్లు’... వంటి శీర్షికలూ ఏ ఆర్భాటమూ లేని పెదాల మీద మెరిసే చిరునవ్వుల్లా ఉంటాయి. 


ఒక చిత్రకారుని గీతలు అక్షరాలుగా రూపుదిద్దుకొని అనేక దృశ్యాలు, ధ్వనులు, రంగులతో హృదయాన్ని ఉత్తేజితం చేసే ప్రకృతి సౌందర్య లహరి, కవితాఝరి ఈ ‘ఆలోలాం తరాళాలలో’. మన ఇంట్లో హాల్లో వేలాడదీసిన పెయింటిం గును పదేపదే చూస్తూ రిలాక్స్‌ అవుతాం. అలాగే ఈ చిత్రాక్షరాల సంగమాన్ని ప్రశాంత చిత్తం కోసం మళ్ళీ మళ్ళీ చదువుకోవచ్చు. మన హృదయ స్పందనను లయబద్ధం చేసుకోవచ్చు.

చింతపట్ల సుదర్శన్‌

92998 09212

Updated Date - 2022-09-12T05:54:00+05:30 IST