ఏ మబ్బు అంచునుంచో

ABN , First Publish Date - 2020-06-21T05:30:00+05:30 IST

ఎక్కడో ఏ మబ్బు అంచునుంచో జారిన తాడు పట్టుకు, రెండు కొండల మధ్య ఉయ్యాలలూగుతున్న బాలుడెవడు- ఈ కాలుతో ఈ కొండ నొక తన్ను తన్ని...

ఏ మబ్బు అంచునుంచో

ఎక్కడో ఏ మబ్బు అంచునుంచో

జారిన తాడు పట్టుకు, రెండు కొండల మధ్య

ఉయ్యాలలూగుతున్న బాలుడెవడు-

ఈ కాలుతో ఈ కొండ నొక తన్ను తన్ని

ఆ కాలుతో ఆ కొండ నొక తన్ను తన్ని

నిరపాయంగా నిరంతరం రెండు కొండల మధ్య

ఉయ్యాలలూగుతున్న పిల్లాడి నీడ

లోయలో పక్షిలా కదులుతుంది

లోయలు పాడిన పాట మంచు పచ్చికమీద

లీలగా వణుకుతుంది

యింకా జారిజారి పారుతున్న

నది మూపురం మీద కూచుంటాడు

ఆకాశాన్నీ భూమినీ రెండు పిట్టల్లా పట్టుకోగలడు

రాత్రీ పవళ్ల మధ్య పక్కనేసుకు పడుకోగలడు

ఏడేడులోకాల ఉధృత పవనాలు పంపిన సందేశమా వీడు

భూమి కాక కొత్త మెలకువను ప్రసాదించిపోతాడు

మరుగవుతున్న మృదుత్వాన్ని, లాలిత్యాన్ని

వెన్నెలతేట ప్రేమనీ నింపి పోతాడు

మీ గుప్పిట విప్పి చూడండి, నీ అరచేతిలో

ఉయ్యాల కనబడుతుంది, ఊర్ధ్వ దిశగా సాగుతున్న

నది కనబడుతుంది, మంచు కొండల మీద

జారినట్టు నదిమీద జారుతున్న నెలబాలుడు కనబడతాడు

ఆడమగా అందరూ గర్భాలు ధరించి

నీళ్లాడటానికి నొప్పులు పడుతుంటారు

పురిటికేక ఒకటి రోదసి కడ్డంగా

కాంతి మార్గంలా వినబడుతుంది

             ***

నిద్ర లేచేసరికి నిర్మలమయిన ఉషోదయం

నీ ముందు కూర్చుని వుంటుంది

కె. శివారెడ్డి


Updated Date - 2020-06-21T05:30:00+05:30 IST