మచ్చలకు వేపాకు, కలబంద పెడితే..

ABN , First Publish Date - 2021-12-11T21:16:05+05:30 IST

మానవ చర్మం చాలా సున్నితమైనది. దీనిని పరిరక్షించుకోవడానికి మన పూర్వీకులు అనేక సహజసిద్ధమైన మార్గాలను కనుగొన్నారు. ఈ మార్గాలన్నీ మన పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే- కృత్రిమమైన సౌందర్య సాధనాలను

మచ్చలకు వేపాకు, కలబంద పెడితే..

ఆంధ్రజ్యోతి(11-12-2021)

మానవ చర్మం చాలా సున్నితమైనది. దీనిని పరిరక్షించుకోవడానికి మన పూర్వీకులు అనేక సహజసిద్ధమైన మార్గాలను కనుగొన్నారు. ఈ మార్గాలన్నీ మన పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే- కృత్రిమమైన సౌందర్య సాధనాలను ఉపయోగించాల్సిన అవసరం లేదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. 


ఆయుర్వేద సిద్ధాంతాల ప్రకారం ఒక వ్యక్తి శరీరతత్వం వాత, పిత్త, కఫ సమతౌల్యంపై ఆధారపడి ఉంటుంది. వీటి ఆధారంగానే ఆ వ్యక్తి చర్మం, జుట్టు కూడా ఉంటాయి. వాత తత్వం ఉన్నవారికి జుట్టు పలచగా ఉంటుంది. చర్మం కొద్దిగా ముడతలు పడినట్లు కనిపిస్తుంది. పిత్త తత్వం ఉన్నవారికి చర్మంపై పొక్కులు ఎక్కువగా ఉంటాయి. ఇక కఫ తత్వం ఉన్నవారి జుట్టు పలచగా ఉంటుంది. చర్మం జిడ్డుకారుతూ ఉంటుంది. చర్మంపై పొక్కులు, నల్లమచ్చలు, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ కేవలం మౌలికమైన అంశాలు మాత్రమే. వాతావరణం, తినే ఆహారం, ఒత్తిడి మొదలైన అంశాల మీద కూడా చర్మ సౌందర్యం ఆఽధారపడి ఉంటుంది. 


కొబ్బరినూనె భేష్‌!

చర్మం మృదువుగా ఉండటానికి చాలామంది వెన్నను రాస్తూ ఉంటారు. కానీ ఆయుర్వేద నిపుణులు మాత్రం ప్రతి రోజూ చర్మానికి, జుట్టుకు కొబ్బరినూనెను రాసుకోవటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందంటున్నారు. ప్రతి రోజూ కొబ్బరి నూనె రాయటం వల్ల చర్మం పొడిబారిపోకుండా నిగనిగలాడుతూ ఉంటుంది. శరీరానికి కొబ్బరినూనె రాసి, ఆ తర్వాత శనగపిండిని నలుగుగా పెట్టి రుద్దుకుంటే - చర్మంపై ఉండే రంధ్రాలకు రక్తప్రసారం జరిగి అవి తిరిగి తెరుచుకుంటాయి. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. 


పాలు మంచివే!

కొందరి చర్మం ఎప్పుడూ జిడ్డు ఓడుతూ ఉంటుంది. దీని వల్ల దుమ్ము శరీరంపైకి చేరి తరచూ శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారు తమ చర్మాన్ని పాలతో శుభ్రం చేసుకుంటే అనేక ప్రయోజనాలుంటాయంటున్నారు నిపుణులు. పాలలో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌, కొవ్వులు సహజసిద్ధమైన పోషకాల పనిచేసి- చర్మంపై ఉన్న మృత కణాలన్నిటినీ తొలగిస్తాయి. దీని వల్ల చర్మంపై అదనంగా చేరిన మట్టి తొలగిపోతుంది. ఈ మధ్యకాలంలో జంతు ఉత్పత్తులను ఉపయోగించని వారు (వీగన్స్‌) పాలకు బదులుగా కొబ్బరిపాలను వాడుతున్నారు. దీని వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. 


మచ్చలకు వేపాకు... కలబంద

వేసవి కాలంలో కొందరికి చర్మం పగిలిపోతుంది. చిన్న చిన్న పొక్కులు వస్తాయి. ఇదే విధంగా కొందరికి శీతాకాలంలో అనేక చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ వేపనూనె మంచిదని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. పొక్కులపై రాత్రి నిద్రపోయే ముందు వేప నూనెను రాస్తే- ఉదయానికి ఉపశమనం లభిస్తుందంటున్నారు. ఇదే విధంగా కలబంద ఆకులను చీల్చి, దానిలోపల ఉండే జిగురును పొక్కులపై రాసిన వెంటనే ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో అలోవెరా జెల్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు.

Updated Date - 2021-12-11T21:16:05+05:30 IST