Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాదం పప్పుతో మేలు

బాదం పప్పు (ఆల్మండ్స్‌) రుచి కొంచెం తీయగా ఉంటుంది. వీటిని నేరుగా తినొచ్చు. కొన్నిరకాల డెజర్ట్స్‌ (ఐస్‌క్రీం), కేకులు, స్వీట్లలో ఆల్మండ్‌ను చిన్న ముక్కలుగా తరిగి వినియోగిస్తారు. దీని పౌడర్‌తో తయారు చేసే బాదం పాలు, బాదం టీ కూడా ప్రియమైనవే. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో ఆల్మండ్‌ చెట్లు పెరుగుతాయి. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ తదితర దేశాల్లో లభించే బాదం పప్పు మన దేశంలో లభించే వాటికన్నా పెద్దవిగా ఉంటాయి. వాణిజ్యపరంగా విదేశీ బాదం (ఆల్మండ్స్‌) మార్కెట్లో విరివిగా లభించడంతో వాటి వినియోగం గణనీయంగా పెరిగింది.  

ఆరోగ్యస్పృహ పెరగడంతో ఓట్సు, ఆక్రూట్లు, బాదం గింజలకు గిరాకీ పెరుగుతోంది. ప్రొటీన్లు, పీచు, ఒమెగా–3 పుష్కలంగా లభించే ఆల్మండ్‌ (బాదం) గింజలను నేరుగా తినొచ్చు. ఆరోగ్యాన్ని పెంపొందింపజేసే సుగుణాలు బాదంలో ఎన్నో ఉన్నాయి.


నానబెట్టినవి తినాలి 

రోజూ తీసుకునే ఆహారంలో బాదం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. బాదం గింజలను నేరుగా తీసుకునే కన్నా, వాటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తింటే మంచిదని ఒక అధ్యయనంలో వెల్లడైంది. నీటిలో నానడం వల్ల  ఆల్మండ్స్‌లో ఉండే నూట్రియంట్స్‌, విటమిన్లు దేహానికి మరింత తేలికగా అందుతాయని పరిశోధకులు చెబుతున్నారు. నీటిలో నానబెట్టడం రుచి కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. బాదం గింజ పెచ్చు (తోలు)పై టానిన్‌ ఉంటుంది. ఇది న్యూట్రియంట్ల అరుగుదలకు నిరోధకంగా పనిచేస్తుంది. అందువల్ల నానబెట్టిన బాదం గింజలపై పెచ్చును తేలికగా తొలగించడం సాధ్యపడుతుంది. పెచ్చు తీసిన బాదం గింజలను తింటే అందులో ఉండే నూట్రియంట్లు త్వరగా విడుదల అవుతాయి.


ఎంతసేపు నానబెట్టాలి?

నానబెట్టిన బాదం గింజలకు సులభంగా జీర్ణమయ్యే స్వభావం ఏర్పడుతుంది. సాధారణంగా నాలుగు నుంచి ఐదు గంటల సేపు నానబెడితే సరిపోతుంది. అయితే ఆల్మండ్స్‌ను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినడం మరింత మంచిది. ఒక కప్పు నీళ్ళలో ఓ గుప్పెడు బాదం గింజలను వేసి ఆరు నుంచి ఎనిమిది గంటలసేపు మునిగి ఉండేలా చూసుకోవాలి. ఉదయాన్నే ఆ నీటిని తీసేసి గింజలను పెచ్చును తొలగించి తాజాగా తినాలి. కావాలనుకుంటే ఒక ప్లాస్టిక్‌ కంటైనర్‌లో వాటిని వారం రోజుల వరకూ భద్రపరుచుకోవచ్చు. బాదం గింజలను నానబెట్టిన నీటిని తాగరాదు. గింజలపై పెచ్చును కూడా తినరాదు.


ఏఏ పోషకాలు ఉంటాయి?

బాదంలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్‌ ఈ, పీచు పదార్థం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఒమెగా 6 ప్యాటీ యాసిడ్స్‌, ప్రొటీన్లు వీటిలో ఉంటాయి. పోషకాలు పుష్కలంగా ఉండటవల్ల ఆల్మండ్స్‌ను సూపర్‌ ఫుడ్‌గా పరిగణిస్తారు. ఇందులో ఉండే ప్రొటీన్‌ వల్ల ఎముకల గట్టిదనానికి సహాయపడే మెగ్నీషియం లభిస్తుంది. రక్తంలో ఉండే చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది. రక్తపోటు సమస్యలు, కండరాలు, నరాల పనితీరులో సమస్యలు ఎదుర్కొనేవారికి బాదం ఎంతో ప్రయాజనకారి.


బరువు తగ్గిస్తుంది

నానబెట్టిన బాదం గింజల నుంచి లైపేస్‌ ఎంజైములు విడుదలవుతాయి. కొవ్వును కరిగించడంలో లైపేస్‌ సహాయపడుతుంది.  జీర్ణవ్యవస్థలో పిత్త లవణాలు కొవ్వు అణువులను (ఫ్యాటీ గ్లోబ్యూల్స్‌) చిన్న చిన్న అణువులుగా మారుస్తాయి. లైపేస్‌ ఎంజైమ్‌ దానిని ఫ్యాటీ యాసిడ్‌గా మార్పుచేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. మధ్యాహ్న భోజనం సమయంలో స్నాక్స్‌గా నానబెట్టిన ఆల్మండ్స్‌ను తింటే కడుపు నిండుగా అనిపిస్తుంది. దీంతో ఆకలి తగ్గిపోయి ఆహారం తక్కువగా తింటారు. పర్యవసానంగా బరువు తగ్గే వీలు కలుగుతుంది. 


గుండెకు మంచిది

గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో బాదం చేసే సహాయం అమూల్యమైనది. రక్తంలో చెడు కొలెస్టరాల్‌ (ఎల్‌డీఎల్‌)ను  తగ్గించి మంచి కొలెస్టరాల్‌ (హెచ్‌డీఎల్‌)ను పెంచడానికి ఆల్మండ్స్‌ దోహదం చేస్తాయి. బాదంలో ఉండే విటమిన్‌ ఈ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అది ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించి వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడుతుంది. కడుపులో మంట రాకుండా నివారిస్తుంది.

 

క్యాన్సర్‌ను నివారణకు

బాదం పప్పులతో మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. బాదంలో విటమిన్‌ బీ17 సమృద్ధిగా ఉంటుంది. క్యాన్సర్‌తో పోరాడటంలో ఇది చాలా కీలకం. ఆల్మండ్స్‌లో ఉండే ఫ్లేవనాయిడ్లు కణతుల పెరుగుదలను అణచివేస్తాయి. అంతేకాదు రక్తంలో షుగర్‌ను, రక్తపోటును నియంత్రించడంలో ఇవి తోడ్పడతాయి. ఆల్మండ్‌లో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌ జనన సంబంధిత లోపాలను తగ్గిస్తాయి.


రోజుకు ఎన్ని తినాలి?

పావు కప్పు బాదం గింజలు లేదా గుప్పెడు గింజలు నానబెట్టినవి తినాలి. ఒక సర్వింగ్‌ బాదం అంటే 23 గింజలు. వీటి ద్వారా 162 క్యాలరీలు, గుండె ఆరోగ్యానికి మేలు చేసే 14 గ్రాముల అన్‌శాట్యురేటెడ్‌ ఫ్యాట్‌,  ఆరు  గ్రాముల ప్రొటీన్‌, నాలుగు గ్రాముల పీచు వీటి ద్వారా లభిస్తుంది. అంతేకాదు వీటి ద్వారా విటమిన్‌ ఈ (రోజుకు అవసరమైన విలువలో 35 శాతం), మెగ్నీషియం (20 శాతం), రైబోఫ్లేవిన్‌ (20 శాతం), క్యాల్షియం (8 శాతం), పొటాషియం (6 శాతం) శరీరానికి అందుతాయి. రైబోఫ్లేవిన్‌లో గాయాలు/పుండ్ల వల్ల చర్మంలో వచ్చే మార్పులను నివారించే విటమిన్‌ బి, బరువు తగ్గడానికి ఉపయోగపడే విటమిన్‌ బి2, విటమిన్‌ జి తదితరాలు ఉంటాయి. వీలుంటే నానబెట్టిన బాదం గింజలను ఉదయం 10, సాయంత్రం పది తినొచ్చు. ఉదయం వేళ పరగడుపున (ఖాళీ కడుపుతో) తింటే వీటిలో ఉండే న్యూట్రియంట్లను జీర్ణవ్యవస్థ త్వరగా గ్రహిస్తుంది.


బాదంపాలు

పాలకు ప్రత్యామ్నాయంగా సోయా పాల మాదిరిగా బాదం పాలు కూడా పౌడర్‌ ద్వారా తయారు చేస్తారు. బాదం గింజలను కొద్దిగా రోస్ట్‌ చేసి తయారు చేసిన పౌడర్‌తో బాదం పాలు చేయవచ్చు. అయితే వేడి చేయాల్సిన అవసరం లేకుండా చల్లటి బాదం పాలు తాగితే ఉత్తమం. బాదం ఫ్లేవర్‌ ఉన్న పౌడర్‌తో చేసిన బాదం టీకి కూడా ఆదరణ పెరుగుతోంది. ఆల్మండ్‌ సిరప్‌లు కూడా లభిస్తున్నాయి. 


రుచిలో మేటి మన బాదం

ఒకప్పుడు ఇళ్ళ చుట్టూ ఖాళీ స్థలం ఉందంటే, తప్పనిసరిగా బాదం చెట్టును పెంచేవారు. తులసికి ఎంత ప్రాధాన్యం ఇచ్చేవారో బాదం చెట్టుకు కూడా అంతే ప్రాధాన్యం ఉండేది. బాదం ఆకులను విస్తళ్ళుగా కుట్టి వినియోగించడమే కాదు, బాదం ఆకుల రసంతో ఆయుర్వేదంలో పలు రకాల ఔషధాలను తయారు చేసేవారు. బాదం కాయలను రాయితో కొట్టి అందులోని పప్పును తినడం అందరికీ తెలిసిందే. ఇతర దేశాల బాదంతో పోలిస్తే మన దేశంలో లభించే బాదం పప్పు రుచి బాగుంటుంది కూడా. నగరాల్లో చెట్లు మాయమవుతున్నా.. గ్రామాల్లో ప్రతి వీధిలో కనీసం ఒక బాదం చెట్టయినా కనపడుతుంది. దేశీయ బాదం పప్పులో ప్రతి వంద గ్రాములకు 575 కిలో క్యాలరీల శక్తి, 20 గ్రాముల ప్రొటీన్‌, 55.8 గ్రాముల ఫ్యాట్‌,  11 గ్రాముల పొటాషియం, రెండు గ్రాముల కాల్షియం, 18 మిల్లీగ్రాముల సోడియం, 11 మిల్లీగ్రాముల ఫ్రాస్ఫరస్‌, 10 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటాయి.

ఎన్‌ మృదులలిత


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...