వైద్యాధికారి వేధింపుల కేసు మళ్లీ విచారణ!?

ABN , First Publish Date - 2021-03-08T03:46:19+05:30 IST

సమగ్ర విచారణ జరిగి వేటు పడ్డాక మళ్లీ విచారణ ! ఇది నిజమేనా ? అనుకుంటే విశ్వసనీయ సమాచారం మేరకు నిజమే అని తెలిసింది.

వైద్యాధికారి వేధింపుల కేసు మళ్లీ విచారణ!?
పీహెచ్‌సీ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఏఎన్‌ఎంలు (ఫైల్‌)

వేటు పడ్డాక విచారణ ఏమిటో ?

అల్లూరు, మార్చి 6: సమగ్ర విచారణ జరిగి వేటు పడ్డాక మళ్లీ విచారణ ! ఇది నిజమేనా ? అనుకుంటే విశ్వసనీయ సమాచారం మేరకు నిజమే అని తెలిసింది. ముగిసిన సమస్యను మళ్లీ ఉత్ఫన్నం చేయడంపై పలు అనుమానాలకు దారి తీస్తోంది. వివరాల్లోకెళితే... 2019 డిసెంబరు 16న మండలంలోని ఇస్కపల్లి పీహెచ్‌సీలో ఏఎన్‌ఎంలు అప్పటి వైద్యాధికారి శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖాధికారులు స్పందించకపోవడంతో కావలి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కలెక్టరుతో సంప్రదించి బాధితులకు న్యాయం చేయాలని కోరడంతో అప్పటి జిల్లా కలెక్టరు వైద్యఆరోగ్య శాఖాధికారులను విచారణకు ఆదేశించారు. ఉద్యోగ సంక్షేమ సంఘాలు మద్దతు పలికాయి. దీనిపై స్పందించి ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టి నిజనిర్థారణ చేసి నివేదికను జిల్లా వైద్యాధికారికి సమర్పించారు. ఈ నివేదికలో మహిళా సిబ్బంది, ఏఎన్‌ఎంలు పడిన నరకయాతనను కళ్లకు కట్టినట్లుగా తెలియజేశారు. ఆ వైద్యాధికారి చేసిన ఆగడాలను సాక్ష్యాధారాలతో సహా పూర్తిస్థాయిలో విచారణాధికారులు నివేదిక ఇవ్వడంతో అప్పటి జిల్లా వైద్యాధికారులు ఆ వైద్యాధికారిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. అయితే వేటుకు గురైన ఆ అధికారి అనతికాలంలోనే ప్రకాశం జిల్లాలో విధుల్లో చేరారు. ప్రస్తుతం అదే కేసును ఈనెల 9న మళ్లీ విచారణ చేపట్టేందుకు ఉన్నతాధికారులు సర్వం సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దీని వెనుక ఎవరు ఉన్నారు? ముగిసిన అగ్నికి ఆజ్యం పోస్తోంది ఎవరు? దీనికి సహకరిస్తున్నది ఎవరు? తదితర అంశాలు బాధితులను విస్మయానికి గురిచేస్తున్నాయి.

Updated Date - 2021-03-08T03:46:19+05:30 IST