విప్లవ వీరుడిపై పాండ్రంగి ముద్ర!

ABN , First Publish Date - 2022-07-04T06:05:22+05:30 IST

బ్రిటిష్‌ పాలకులను గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలో జన్మించారన్న విషయం తెలిసిందే.

విప్లవ వీరుడిపై పాండ్రంగి ముద్ర!

అమ్మమ్మ ఇంట జన్మించిన అల్లూరి 

విజయనగరం జిల్లా నుంచి వలస వచ్చిన మాతామహుల కుటుంబం

పాండ్రంగిలో నివాసం

1875లో అల్లూరి మాతృమూర్తి సూర్యనారాయణమ్మ జననం

1895లో మోగల్లుకు చెందిన రామరాజుతో వివాహం 

చిన్నతనంలోనే తండ్రి కన్నుమూత... చదువుపై తీవ్రప్రభావం

లంబసింగిలో రోడ్డు నిర్మాణ కూలీలకు అన్యాయంపై పోరాటం

గిరిజనులతో కలిసి బ్రిటిష్‌ పాలకులపై తిరుగుబాటుకు శ్రీకారం

నాటి విశేషాలు వివరించిన మాజీ మంత్రి అప్పలనరసింహరాజు 

నేడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి


భీమునిపట్నం (రూరల్‌) జూలై 3:


బ్రిటిష్‌ పాలకులను గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలో జన్మించారన్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు ఆయన మాతామహులు ఎక్కడివారు, పాండ్రంగి ఎందుకువచ్చారు. ఆయన తల్లికి వివాహం జరిగిన తీరు...అల్లూరి సోదర, సోదరీమణుల గురించి చాలామంది తెలియదు. ఆ వివరాలను, అల్లూరి కుటుంబ నేపథ్యాన్ని అదే గ్రామానికి చెందిన మాజీ మంత్రి ఆర్‌ఎస్‌డీపీ అప్పలనరసింహరాజు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. 

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడకి చెందిన మందపాటి రామరాజు, అచ్యుతమ్మ దంపతులు 1875లో బతుకుతెరువు కోసం పద్మనాభం మండలం పాండ్రంగికి వలస వచ్చారు. గ్రామంలోని క్షత్రియ కుటుంబీకులు వీరికి ఒక పెంకుటిల్లు, మూడు ఎకరాల వ్యవసాయ భూమిని సమకూర్చారు. పొలంలో పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగించేవారు. రామరాజు, అచ్యుతమ్మ దంపతులకు 1875 ఫిబ్రవరిలో సూర్యనారాయణమ్మ జన్మించారు. ఏకైక కుమార్తె కావడంతో అల్లారు ముద్దుగా సాకేవారు. ఇంటి ముందున్న దేవాలయంలో అర్చకుల వద్ద పద్యాలు, శ్లోకాలు నేర్చుకునేవారు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకున్నారు.  


పాండ్రంగిలో జన్మించిన అల్లూరి

పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లుకు చెందిన అల్లూరి వెంకటరామరాజు ఫొటోగ్రాఫర్‌. గ్రామంలో ఫొటో స్టూడియోను నడిపేవారు. 1890లో ఆయన అనకాపల్లి వచ్చి కొంతకాలం ఉన్నారు. ఆ సమయంలో మందపాటి రామరాజు...వెంకటరామరాజు కుటుంబ పరిస్థితి, తల్లిదండ్రుల వివరాలు తెలుసుకున్నారు. తన కుమార్తె సూర్యనారాయణమ్మను వెంకటరామరాజుకు ఇచ్చి వివాహం చేయడానికి రామరాజు సంబంధం ఖాయం చేసుకున్నారు. అప్పట్లో పాండ్రంగి గ్రామానికి రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో కురపల్లి ప్రాంతంలో గోస్తనీ నదిని దాటుకుని అల్లూరి కుటుంబీకులు పెళ్లి చూపులకు వచ్చారు. అల్లూరి రామరాజు, సూర్యనారాయణమ్మల వివాహం 1895లో జరిగింది. గుర్రాల బగ్గీలో ఊరేగింపుగా అత్తవారింటికి పంపించారు. తర్వాత మొదటి కాన్పు కోసం 1896 చివరలో సూర్యనారాయణమ్మ పుట్టింటికి వచ్చారు. 1897 జూలై 4వ తేదీ సాయంత్రం 4.10 గంటలకు పాండ్రంగిలో శ్రీరామరాజు (సీతారామరాజు) జన్మించారు. బాబుకి ఏడాది వయసు వచ్చే వరకు ఇక్కడే ఉన్నారు. తర్వాత రామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులు కుమారుడిని తీసుకుని తిరిగి సొంతూరు మోగల్లు వెళ్లిపోయారు. వీరికి 1901లో కుమార్తె సీతమ్మ జన్మించింది. తరువాత వీరి కుటుంబం రాజమహేంద్రవరానికి మకాం మార్చింది. 1906లో రెండో కుమారుడు సూర్యనారాయణరాజు జన్మించారు.


తండ్రి కన్నుమూతతో చదువుపై తీవ్రప్రభావం

అల్లూరి సీతారామరాజు తండ్రి రామరాజు కలరా వ్యాధి సోకి 1908లో రాజమహేంద్రవరంలో కన్నుమూశారు. ఆ సమయానికి సీతారామరాజు వయసు పదకొండేళ్లు.    దీంతో చదువుపై తీవ్రప్రభావం పడింది. దీంతో ఫస్ట్‌ ఫారం (ప్రస్తుత ఆరో తరగతి) నుంచి ఫిఫ్ట్‌ ఫారం వరకు భీమవరంలో, రాజమహేంద్రవరంలో, కాకినాడ, నరసాపురం, విశాఖపట్నం ప్రాంతాల్లో చదవాల్సి వచ్చింది. 18 ఏళ్ల వయసులో రిషికేష్‌, బదరీనాథ్‌, గంగోత్రి, కాశీ ప్రయాగ తదితర ప్రాంతాలను సందర్శించారు. అక్కడి నుంచి వచ్చిన తరువాత ఏజెన్సీలో చిటికెల భాస్కరరావుతో పరిచయం, లంబసింగిలో తారురోడ్డు వేసే సమయంలో ఆరు అణాల కూలీ బదులు రెండు అణాలు ఇవ్వడంతో గిరిజనులతో కలిసి బ్రిటిష్‌ పాలకులపై తిరుగుబాటుకు శ్రీకారం చుట్టడంతో విప్లవ పోరాటం ప్రారంభమయింది.


స్మారక గ్రంథాలయంగా అల్లూరి జన్మించిన ఇల్లు

పాండ్రంగిలో మందపాటి రామరాజుకు చెందిన భూమిని కుటుంబ సభ్యులు విక్రయానికి పెట్టగా తొలుత ఎవరూ ముందుకు రాలేదు. అయితే 1913లో సాగి సన్యాసిరాజు కొనుగోలు చేశారు. (ఇతను మాజీ మంత్రి అప్పలనరసింహరాజుకు వరుసగా పెదనాన్న అవుతారు). భూమి క్రయవిక్రయం విషయాన్ని గోప్యంగా వుంచడానికి మజ్జివలసలో డాక్యుమెంట్‌ రాసుకుని డబ్బు చెల్లించారు. ఆ కాగితాలు పదిహేనేళ్ల క్రితం పాండ్రంగి అప్పటి సర్పంచ్‌ వజ్రకుమార్‌రాజు వద్ద కొంతకాలం వున్నాయి. కాగా అల్లూరి జన్మించిన ఇంటిని సంరక్షించాలన్న ప్రయత్నం 1996లో జరిగింది. అప్పుడు భీమిలి ఎమ్మెల్యేగా వున్న అప్పలనరసింహరాజు, శిథిలావస్థకు చేరిని ఇంటిని పడగొట్టించి, పాత పునాదులపై కొత్త ఇంటిని నిర్మించారు. ఆ తర్వాత దానిని అల్లూరి స్మారక గ్రంథాలయంగా మార్చి నాటి గవర్నర్‌ కృష్ణకాంత్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు.



Updated Date - 2022-07-04T06:05:22+05:30 IST