అల్లూరి పోరాట పటిమ స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2022-07-04T05:50:21+05:30 IST

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమాన్ని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నాయకులు కృష్ణలంక భ్రమరాంబపురంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

అల్లూరి పోరాట పటిమ స్ఫూర్తిదాయకం
కృష్ణలంక భ్రమరాంబపురంలో అల్లూరి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నాయకులు

అల్లూరి పోరాట పటిమ స్ఫూర్తిదాయకం

ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి

కృష్ణలంక, జూలై 3 : అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమాన్ని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నాయకులు కృష్ణలంక భ్రమరాంబపురంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ, సీఐటీయూ, పౌరసంక్షేమ సంఘం, ఐద్వా, పీఎంఎం నాయకులు పాల్గొన్నారు. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణ, పౌరసంక్షేమ సంఘం నగర నాయకులు బత్తుల చిన్నారావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, మన్యం విప్లవ వీరుడు అల్లూరి దేశ స్వాతంత్య్రం కోసం కేవలం 27 సంవత్సరాలకే తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలారన్నారు. నేటి యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చే ఆయన పోరాట పటిమను స్మరించుకొంటూ వాడవాడలా ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి వుంటే పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టి పూర్తిచేయాలన్నారు. పీఎన్‌ఎం జిల్లా నాయకులు గోకా సూర్యనారాయణ, తాండవకృష్ణ, పౌరసంక్షేమ సంఘం నాయకులు వాజా శ్రీనివాస్‌, పసుపులేటి శ్రీనివాస్‌, ఐద్వా నాయకులు కాయల కుమారి, తవిటమ్మ, డీవైఎఫ్‌ఐ డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు జె.కొండా, బి.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

బైక్‌ ర్యాలీ

సత్యనారాయణపురం: ముత్యాలంపాడు గోకరాజు రంగరాజు కల్యాణ మండపం వద్ద ఆదివారం క్షత్రియ యువజన సంఘం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి మహోత్సవాలు జయప్రదం చేయాలని బైక్‌ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న 31వ డివిజన్‌ కార్పొరేటర్‌ పెనుమత్స శిరీష సత్యం జెండా ఊపి బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆఽద్వర్యంలో సోమవారం భీమవరంలో జరుగుతున్న 125వ అల్లూరి సీతారామరాజు జయంతి మహోత్సవాలు జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ర్యాలీ ముత్యాలంపాడు, లోటస్‌ ల్యాండ్‌మార్క్‌, అయోధ్యనగర్‌, రామకృష్ణాపురం, దేవినగర్‌ మీదుగా అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకూ సాగింది. ర్యాలీ ముగింపులో కార్పొరేటర్‌ బీహెచ్‌ఎస్‌వీ జానారెడ్డి పాల్గొని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఆయన  సేవలను కొనియాడారు. క్షత్రియ యువజన సంఘం అధ్యక్షుడు వలివర్తి రామరాజు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా  సోమవారం విజయవాడ నుంచి పెద్ద సంఖ్యలో భీమవరంకు తరలి వెళదామన్నారు. సంఘం గౌరవాధ్యక్షులు ఉద్దరాజు  విజయరామరాజు, ప్రధానకార్యదర్శి ప్రసాదరాజు, రాజేష్‌ వర్మ, మాజీ కార్పొరేటర్‌ పిన్నంరాజు త్రిమూర్తి రాజు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.           



Updated Date - 2022-07-04T05:50:21+05:30 IST