బాలుడి నుంచే వీరుడిగా

ABN , First Publish Date - 2022-07-03T06:54:18+05:30 IST

అల్లూరి.. పౌరుషాగ్నికి చిరునామా. బ్రిటిష్‌ దొరలపై పోరాడి నేలకొరిగిన వీరుడు. అడవి బిడ్డల బానిస సంకెళ్లను తెంచడానికి జీవితాన్ని త్యాగంచేసిన మహనీయుడు.

బాలుడి నుంచే వీరుడిగా

 విశాఖ జిల్లా పాండ్రంగిలో అమ్మమ్మగారింట అల్లూరి సీతారామరాజు జననం
మోగల్లు, భీమవరం పరిసరాల్లో సాగిన బాల్యం
పలుచోట్ల విద్యాభ్యాసం
చిన్నప్పటి నుంచే విప్లవభావాలు
బ్రిటిష్‌ వారిపై కోపాగ్ని

 రంపచోడవరం: అల్లూరి.. పౌరుషాగ్నికి చిరునామా. బ్రిటిష్‌ దొరలపై పోరాడి నేలకొరిగిన వీరుడు. అడవి బిడ్డల బానిస సంకెళ్లను తెంచడానికి జీవితాన్ని త్యాగంచేసిన మహనీయుడు. జూలై 4వ తేదీ ఆయన జయంతి. ఏటా అల్లూరి సీతారామరాజు జయంతి, వర్ధంతులను జరుపుకుంటూనే ఉన్నాం. ఆయన పోరాటాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూనే ఉన్నాం. ఇది 125వ జయంతి. ఈ సందర్భంగా ఆయన బాల్యం నుంచి మన్యం వీరుడిగా ఎదిగిన క్రమం చాలా ఆసక్తికరం. బాల్యం నుంచే ఎన్నో ఇబ్బందులు, ఒక్కచోట సాగని చదువు, చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయి కొనసాగిన వలసలు.. ఇలా ఎన్నో కష్టాలు. అయినా సరే, తన మనోధైర్యం ముందు, తన ఆలోచనల్లో రూపుదిద్దుకున్న లక్ష్యం కోసం అల్లూరి సాగించిన జీవన గమనం.. గొప్ప పోరాట యోధుడిగా  మనసుల్లో నిలిచిపోయేలా చేసింది. గోదావరి జిల్లాల్లో ఆయన కుటుంబం ఎక్కడ ఉండేది, చదువు ఎలా సాగిందీ అనే విషయాలపై ప్రత్యేక కథనం..
అమ్మమ్మగారింట్లో జననం
అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న జన్మించారు. విశాఖ జిల్లా పాండ్రంగి గ్రామంలో తన తల్లి సూర్యనారాయణమ్మ పుట్టింట జన్మించారు. శ్రీరామరాజు అని పేరు పెట్టారు. తండ్రి వెంకటరామరాజు స్వగ్రామం భీమవరం పట్టణానికి పది కి.మీ. దూరంలో ఉన్న మోగల్లు గ్రామం. శ్రీరామరాజుకు ఏడాది వయసు వచ్చేవరకు పాండ్రంగిలోనే ఉండి తర్వాత సూర్యనారాయణమ్మ భర్తతో కలిసి మోగల్లు వెళ్లిపోయారు. ఇక రామరాజు తమ్ముడు పేరు సత్యనారాయణరాజు, సోదరి పేరు సీతమ్మ. హైస్కూల్‌లో చదువుతున్నప్పుడే విలక్షణమైన విద్యార్థిగా ఉండేవాడని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, రాజమహేంద్రవరానికి చెందిన మద్దూరి అన్నపూర్ణయ్య అల్లూరి ఆలోచనలను కొన్నింటిని తన గ్రంథంలో పేర్కొన్నారు. ఏదో చేయాలనే నిరంతరం తపనపడేవారని ఆయన చెబుతారు. కోనసీమ ప్రాంతంలోని రాజోలు తాలూకా కోమటిలంక, బట్టేలంక గ్రామాలకు చెందిన అల్లూరి వంశీయులు, కాలక్రమేణా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపాన గల మోగల్లు గ్రామానికి వెళ్లి స్థిరపడ్డారు. ఆ కుటుంబానికి చెందిన వారే అల్లూరి సీతారామరాజు తండ్రి వెంకటరామరాజు.
బాల్యం సాగిందిలా
రామరాజు బాల్యం తండ్రి స్వగ్రామమైన మోగల్లు, భీమవరం పరిసర ప్రాంతాల్లో సాగింది. రామరాజు తండ్రి వెంకటరామరాజు స్కూల్‌ ఫైనల్‌ వరకు చదువుకున్నారు. చిన్నతనం నుంచి ఫొటోలు తీయడం, చిత్రలేఖనం వంటివి ఆయనకు హాబీ. దాంతో ఆయన ముంబై వెళ్లి ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం నేర్చుకొని వచ్చారు. ఫొటోలు తీసేవారు. నర్సాపురం, తణుకులలో ఫొటో స్టూడియోలు పెట్టి కొంతకాలం నడిపారు. 1895లో వివాహం జరిగింది. రామరాజు పుట్టిన తర్వాత 1902లో రాజమహేంద్రవరం వెళ్లి స్టూడియో పెట్టారు. అప్పట్లో ఉభయగోదావరి జిల్లాలో మంచి ఫొటోగ్రాఫర్‌గా ఈయనకు పేరు ఉండేదని చెబుతారు. నిజానికి రామరాజులో తొలిసారి బ్రిటిష్‌ వ్యతిరేక ఆలోచన కలిగింది రాజమహేంద్రిలోనే. రామరాజు తండ్రి వెంకటరామరాజు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో స్టూడియో నడుపుతూ అక్కడ ఆర్థికంగా కలిసిరాక మిత్రుల సూచన మేరకు 1902లో రాజమహేంద్రికి మార్చారు. ఈవిధంగా రామరాజు కుటుంబం అక్కడ స్థిరపడింది. ఇన్నీసుపేటలోని జువ్వాది వారి దుకాణాల సముదాయంలో ఈ స్టూడియో నడిచేది. రామరాజుకు పదేళ్ల ప్రాయంవచ్చాక ఒకరోజు తండ్రితో గోదావరి తీరానికి వ్యాహాళి(వాకింగ్‌)కి వెళ్లాడు. అదే సమయంలో బ్రిటిష్‌దొర ఒకరు అటుగా గుర్రంపై వచ్చారు. దొర రాకతో గోదావరి తీరానికి షికారుకు వచ్చిన వారంతా లేచి నిలబడి ఆ దొరకు వందనం చేయడం మొదలుపెట్టారు. వారిని చూసి రామరాజు కూడా దొరకు నమస్కారం చేశారు. దీనికి రామరాజు తండ్రి తీవ్రంగా ఆగ్రహం చెంది రామరాజు చెంపపై కొట్టారు. తెల్లదొరల అకృత్యాలను ఆ తండ్రి రామరాజుకు వివరించి మందలించారు. ఈ ఘటనతో రామరాజు మనసులో తెల్లవారి పట్ల వ్యతిరేక భావం కలిగి అది బలంగా నాటుకుంది. రామరాజు కుటుంబం రాజమహేంద్రవరంలో ప్లీడర్‌గా ఉన్న చింతలూరి లక్ష్మీనారాయణ ఇంట్లో కొంతకాలం అద్దెకు ఉండేవారు. ఇక్కడ ఉన్నప్పుడే 1906లో రెండో కొడుకు సత్యనారాయణరాజు జన్మించారు. 1908లో మళ్లీ భాస్కరరావు అనే వైశ్యుని ఇంట్లో కాపురం పెట్టారు. ఈ సంవత్సరమే గోదావరి పుష్కరాలు రావడంతో వీరి ఇంటికి అనేక మంది బంధువులు రావడంతో ఖర్చు కూడా భారీగానే చేశారు. 1908లోనే సీతారామరాజు తండ్రి వెంకటరామరాజు కలరా వ్యాధితో రాజమహేంద్రవరంలో చనిపోయారు.
అల్లూరి కుటుంబానికి కష్టాలు
తండ్రి చనిపోయినప్పుడు అల్లూరికి పదకొండేళ్లు.  చిన్నప్పుడే ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక ఊర్లో స్థిరపడలేకపోయారు. రాజమహేంద్రవరంలో ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో రామరాజు తల్లి సూర్యనారాయణమ్మ తన సోదరి అయిన అప్పలనరసయ్యమ్మ స్వగ్రామం భీమవరం సమీపంలోని కొవ్వాడకు చేరుకున్నారు. ్ఞ్ఞఅలా 1909లో మొదటిఫారం భీమవరంలో చదివారు. కానీ సీతారామరాజు చదువు అనారోగ్యం కారణంగా ఫస్ట్‌ ఫారం భీమవరంలో ఆగిపోవడంతోపాటు మళ్లీ రాజమహేంద్రవరం వెళ్లాల్సి వచ్చింది. బంధువు చెవిటి రామరాజుగా పిలవబడే అల్లూరి రామరాజు పర్యవేక్షణలో రామరాజు 1910లో తిరిగి ఫస్ట్‌ ఫారంలో చదువు ప్రారంభించారు. చెవిటి రామరాజు అప్పటికే బీఏ గ్రాడ్యుయేట్‌. ఈయన కాశీలో కూడా చదువుకున్నారు. యోగాభ్యాసంలో ఆయన నిష్ణాతులు కావడంతో అప్పట్లోనే ఆ ప్రభావం రామరాజుపై పడింది. ఆయన దగ్గర ఉన్న హఠయోగము, పతంజలి యోగము, వేదాంతము వంటి పుస్తకాలు రామరాజు ఆసక్తికరంగా చదివేవాడు. ఈ సమయంలోనే తెలుగు కావ్యాలను పూర్తిగా చదివేవాడు. ఇక్కడే ఫస్ట్‌ ఫారం పూర్తి చేశారు. ఇక్కడ ఫస్ట్‌ ఫారం పూర్తయ్యాక ఆయన పినతండ్రి రామకృష్ణంరాజు రామచంద్రపురంలో మేజిస్ట్రేట్‌గా ఉండడంతో 1911లో సీతారామరాజును అక్కడ రెండో ఫారంలో చేర్పించారు. అయితే ఆయనకు మధ్యలో బదిలీ కావడంతో కొంతకాలం తల్లి వెళ్లి అతని చదువుకు సహకరించింది. అక్కడ నుంచి పిఠాపురం బదిలీ కావడంతో పిఠాపురం హైస్కూల్లో మూడవ ఫారంలో చేరాడు. సమరయోధుడు మద్దూరి అన్నపూర్ణయ్య ఆయన సహచరుడుగా ఇక్కడే చదువుకున్నారు.
శశిరేఖ పాత్రలో అల్లూరి
సీతారామరాజుకు ఊరు నాటకాల్లో వేషాలు వేయడం ఆసక్తి. 1912 డిసెంబరు 12న జార్జ్జి చక్రవర్తి పట్టాభిషేకం సందర్భంగా పిఠాపురం రాజా కళాశాలలో ‘శశిరేఖ పరిణయం’ నాటకం ప్రదర్శించారు. అందులో సీతారామరాజు సురేఖ పాత్ర వేశారట. ఈ విషయాన్ని మద్దూరి అన్నపూర్ణయ్య 1928లో కాంగ్రెస్‌ పత్రికలో ప్రస్తావించారు. అల్లూరికి సంబంధించి మరో సంఘటన కూడా ఇందులో ప్రస్తావించారు. జార్జి చక్రవర్తి బొమ్మ ఉన్న పతకాన్ని పెట్టుకోమన్నప్పుడు అభ్యంతరం తెలిపిన ఆయన మళ్లీ  ‘‘వాడు (బ్రిటిష్‌వారు) మన గుండెల మీద ఉన్నాడని గుర్తు తెచ్చుకోవడానికి ఈ పతకం పెట్టుకుంటున్నాను’’ అని వ్యాఖ్యానించినట్టు మద్దురి అన్నపూర్ణయ్య వివరించారు. ఇలా స్వాతంత్రోద్యమ స్వేచ్ఛ భావాలు హైస్కూల్‌లోనే అల్లూరికి అలవడ్డాయి. తిరిగి ఆయన తన పినతండ్రి సూచనల మేరకు విశాఖపట్నం వెళ్లి ఏవీఎన్‌ కాలేజీ హైస్కూల్లో ఫోర్త్‌ ఫారంలో చేరారు. అయితే జబ్బు చేయడంతో చదువు ఆగిపోయింది. విశాఖపట్నంలో చదువు ఆగిపోవడంతో పినతండ్రి ఉద్యోగం చేస్తున్న నరసాపురంలో చదువుకోవడానికి రమ్మనడంతో ఆయన నరసాపురం టేలర్‌ స్కూల్లో 1913 జూలై 2వ తేదీన తిరిగి ఫోర్త్‌ ఫారంలో చేరారు. మళ్లీ విశాఖపట్నం వచ్చి ఏవీఎన్‌ కళాశాలలో ఫిఫ్త్‌ ఫారం చదివారు. 15 ఏళ్ల వయసులోనే బ్రిటిష్‌ పాలకులపై ద్వేషభావం ఆయనకు విపరీతంగా ఉండేది. 18 సంవత్సరాల వయసులో రుషీకేష్‌, బదరీనాథ్‌, గంగోత్రి, కాశీ, ప్రయాగను సందర్శించారు. కొంతకాలం తర్వాత వీరి కుటుంబం తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న బంధువుల ఊరుకు వచ్చి స్థిరపడింది. ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్‌ వారి ఆగడాల గురించి తెలుసుకున్న ఆయన పేరిచర్ల సూర్యనారాయణరాజుతో కలిసి తూర్పు కనుమల్లో పర్యటించారు. విప్లవానికి అనువుగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు.

Updated Date - 2022-07-03T06:54:18+05:30 IST