Jun 22 2021 @ 00:18AM

సారధిలో అల్లూరి

అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రణం రుధిరం’. సారధి స్టూడియోస్‌లో సోమవారం ప్రారంభమైన తాజా షెడ్యూల్‌లో ఆయన పాల్గొంటున్నారు. చరణ్‌ కోసం ముంబై నుంచి హైదరాబాద్‌కు ప్రముఖ హెయిర్‌ స్టయిలిస్ట్‌ అలీమ్‌ హకీమ్‌ వచ్చారు. అదీ ప్రత్యేకంగా హెయిర్‌కట్‌ చేయడం కోసమే. ‘‘ఈరోజు హైదరాబాద్‌లో ఉన్నాను. లాక్‌డౌన్‌ 2.0 ఎత్తేశారు. సినిమాలు మళ్లీ సెట్స్‌కు వస్తున్నాయి. ప్రతి ఒక్కరి అభిమాన దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కోసం సూపర్‌స్టార్‌ రామ్‌చరణ్‌కు హెయిర్‌కట్‌ చేయడంతో నా రోజు ప్రారంభించా’’ అని సోమవారం అలీమ్‌ హకీమ్‌ ట్వీట్‌ చేశారు. ఈ సినిమాలో కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం నుంచి ఆయన చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం. ఎన్టీఆర్‌ సరసన విదేశీ నటి ఒలీవియా మోరిస్‌, చరణ్‌కు జంటగా ఆలియా భట్‌ నటిస్తున్నారు. హీరోలపై ఓ పాట, చరణ్‌-ఆలియాపై మరో పాటను చిత్రీకరించాల్సి ఉందట. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరకర్త.