అల్లూరులో దొంగతనాల జోరు

ABN , First Publish Date - 2022-08-12T03:30:43+05:30 IST

మండలంలో దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. ఇటీవల ఇందుపూరు పంచాయతీ పల్లిపాలెంలో చోరీ జరిగింది. అది మరువక

అల్లూరులో దొంగతనాల జోరు
దుండగులు పగులగొట్టిన తాళం

అల్లూరు, ఆగస్టు 11:   మండలంలో  దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారు. ఇటీవల  ఇందుపూరు పంచాయతీ పల్లిపాలెంలో చోరీ జరిగింది.  అది మరువకముందే రెండు చోట్ల చోరీలు జరిగిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు అల్లూరు నగర పంచాయతీలోని బలిజపాలెంవీధిలోని మహాలక్ష్మమ్మ అమ్మవారి గుడిలో మంగళవారం రాత్రి తాళాలు పగలగొట్టి రెండు సవర్ల బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశారు. అలాగే సింగపేటలోని మల్లవరపు బాలకిషోర్‌, మల్లవరపు అంకయ్య నివాసాల్లో దొంగలు పడ్డారు. బాలకిషోర్‌ ఉద్యోగరీత్యా సూళ్లూరుపేటలో ఉంటున్న క్రమంలో  కొంతకాలం క్రితం కుటుంబ సమేతంగా వచ్చి రెండు రోజులు ఉండి వెళ్లాడు. అదేవిధంగా అంకయ్య కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని తమ కుమారుడి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఈ రెండు నివాసాల్లో చోరీలు జరిగినట్టు స్థానికులు తెలిపారు. బాలకిషోర్‌ నివాసంలో బంగారు ఆభరణాలు, నగదు లేకపోవడంతో దుస్తులను దొంగలించుకుని వెళ్లగా, అంకయ్య నివాసంలో రూ50 వేలు నగదు, 2 సవర్ల బంగారు ఆభరణాలు దొంగలించినట్టు సమాచారం. పూర్తి సమాచారం కుటుంబ సభ్యులు వచ్చిన తరువాత తెలుస్తాయని స్థానికులు అంటున్నారు. ఇదిలా ఉండగా స్థానిక ఎస్‌ఐ నెల్లూరులోని రొట్టెల పండుగ విధుల్లో ఉండగా  మండలంలో దొంగలు ఇష్టానుసారంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులు నిఘా ఉంచి వారిని కట్టుదిట్టం చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. 


-------



Updated Date - 2022-08-12T03:30:43+05:30 IST