‘మా మంత్రి గారు నిప్పు లాంటి మనిషి’

ABN , First Publish Date - 2021-07-26T20:23:42+05:30 IST

నిప్పులేనిదే పొగ రాదనే సామెతను ఆయనపై ప్రత్యర్థులు ప్రయోగిస్తున్నారట. నిప్పు లాంటి మనిషి కాబట్టే నిప్పులు చెరుగుతున్నాడనేది అల్లోల్ల వారి అంతరంగికుల మాట.

‘మా మంత్రి గారు నిప్పు లాంటి మనిషి’

ఇది ఊరనుకున్నారా. అడివనుకున్నారా? ఇదెక్కడి ఆటవిక న్యాయం అంటున్నారట ఆ అమాత్యుడు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తనపై వస్తున్న ఆరోపణలను ఖరాఖండిగా ఖండిస్తున్న అడవులు, న్యాయశాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రత్యర్థుల నాలుకలను ఖండఖండలుగా కోయాల్సివస్తుందని హెచ్చరిస్తున్నారట. నిప్పులేనిదే పొగ రాదనే సామెతను ఆయనపై ప్రత్యర్థులు ప్రయోగిస్తున్నారట.  నిప్పు లాంటి మనిషి కాబట్టే నిప్పులు చెరుగుతున్నాడనేది అల్లోల్ల వారి అంతరంగికుల మాట. ఇంతకీ ఆ మంత్రిగారిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలేంటి? ఇందులో ఏది నిజం అనేది ఎలా నిరూపితం అవుతుంది? 


అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డికి ప్రతిపక్షాల నుంచి ముప్పేటదాడి ఎక్కువవుతోందట. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ సవాల్‌ విసిరితే తాజాగా రేవంత్‌ రెడ్డి రాకతో మంత్రిగారికి కాంగ్రెస్‌ పార్టీ కాక తగులుతోందట. తనపై వస్తున్న ఆరోపణలకు మంత్రి సైతం సవాల్‌కు రెడీ అనడంతో నిర్మలంగా ఉన్న నిర్మల్‌ నియోజకవర్గంలో నిప్పులు కురుస్తున్నాయట. అధికార ప్రతిపక్షాల ఆదిపత్యపోరులో అదుపుతప్పుతున్న శాంతి భద్రతలును మామూలు స్థితిలోకి తెచ్చేందుకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సివస్తోందట.  


పదే పదే విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు గట్టి సమాధానం ఇవ్వకుంటే వారు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మే అవకాశముందని భావిస్తున్న అల్లోల ఆగమేఘాలమీద సవాళ్లకు ప్రతిసవాళ్లు విసురుతున్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే తాట తీయాల్సివస్తుందని హెచ్చరిస్తున్నారు. ఒళ్లు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడకుంటే నాలుక కోయాల్సివస్తుందని మంత్రి గారు హెచ్చరించడంతో  సొంత నియోజకవర్గం నిర్మల్‌తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో హాట్‌హాట్‌ పొలిటికల్‌ టాక్‌కు దారితీస్తోందట. 


 

అధికారిక కార్యక్రమాలపై ఆరోపణలు చేస్తే మంత్రిగారు ఎక్కువగా పట్టించుకునేవారు కాదని, తన ప్యామిలీ వ్యాపారాల విశ్వసనీయతను దెబ్బతీసేలా అల్లుతున్న కుట్రలతో అల్లోలవారు అగ్గి రగులుతున్నారనేది అనుచరుల అంతరంగం. ఏకకాలంలో కాంగ్రెస్, బీజేపీలకు కౌంటర్‌ ఇస్తూ ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు వ్యూహాత్మకంగా ముందుకుపోతున్నారట.నిర్మల్‌ శాసనసభ నియోజకవర్గం పరిధిలో  దశాబ్దాలుగా మంత్రి కుటుంబ సభ్యులు వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా...నియోజకవర్గంలో ని ప్రభుత్వ భూములు, చెరువులు, చివరికి డి1 పట్టా భూములను కూడా మాయం  చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలు కొన్నాళ్లుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కోట్లాది రూపాయల భూములను మంత్రి కుటుంబం  అక్రమంగా సొంతం చేసుకుందని విమర్శలు చేస్తున్నారు. 


విమర్శలు రోజురోజుకి ఎక్కువవుతుండటంతో మంత్రిగారికి గుండెలు మండిపోతున్నాయట. ఉత్తమాటలు మాట్లాడొద్దని దమ్ముంటే  నిరూపించాలని  సవాల్‌ విసిరారట. మంత్రి సవాల్‌ను స్వీకరించిన బీజేపీ నేతలు బహిరంగ చర్చకు సిద్దమని ప్రకటించారు. ఎనీ సెంటర్‌ సింగిల్‌ హ్యాండ్ గణేష్‌ అన్నట్లు రెండు పార్టీలు సై అంటే సై అంటూ శివాజీ చౌక్‌ను వేదికగా ఎంచుకోవడంతో  నిర్మల్‌లో నివురుగప్పిన నిప్పు ఒక్కసారిగా ఎగజిమ్మినట్లుగా పరిస్థితి తయారైంది. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ ఆధ్వర్యంలో మంత్రి అనుచరులు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ అప్పాల గణేష్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు రెడీ అయ్యారు.ఢీ అంటే ఢీ అంటున్న స్టేట్‌ పార్టీ, సెంట్రల్‌పార్టీ టీమ్‌లు ఎదురుపడితే పరిస్థితి అదుపుతప్పుతుందని పోలీసులు జోక్యం చేసుకున్నారు. రెండు వర్గాలను అదుపులోకి తీసుకుని బహిరంగ చర్చకు భగ్నం చేశారు. ఆ తర్వాత కూడా విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. 


మంత్రిగారికి బీజేపీ సెగ చాలదన్నట్లు కాంగ్రెస్‌ కాక కూడా ఎక్కువైపోయిందట. మంత్రిగారి ఇలాకాలో పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ కార్యకర్తలకు జోష్‌ ఇచ్చాయి. మంత్రిగారి అక్రమాలు ఎక్కువైపోయాయని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ఆగమాగం కాకతప్పదని కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ హెచ్చరించడంతో నిర్మల్‌లో హస్తం పార్టీ లైన్‌లోకి వచ్చినట్లైంది. ఏకంగా కాంగ్రెస్‌ క్యాండిడేట్‌గా మహేశ్వర్‌ రెడ్డిని ప్రకటించాక అక్కడ హస్తంపార్టీ ఆక్టివిటీస్‌ పెరిగిపోయాయట. కాంగ్రెస్‌ హీట్‌తో అల్లోల రెడ్డి ..అనుముల రెడ్డిపై అగ్గిమీద గుగ్గిలమయ్యారట. అబద్దాలతో ఆరోపణలు చేస్తే నాలుక కోస్తానని గట్టిగా హెచ్చరించారు. 


మంత్రిగారి కుటుంబ వ్యాపారాలపై వారి కబ్జాలపై ఆరోపణలు చేస్తున్న వారికి భారీ వర్షాలు విమర్శల వేడిని పెంచేలా చేస్తున్నాయట. మంత్రిగారి కుటుంబం చెరువులు, కుంటలు కబ్జా చేయడంతోనే నిర్మల్‌ నియోజకవర్గంలో ముంపులో మునిగిపోవాల్సివస్తుందని కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఆరోపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలోనూ ఆదిలాబాద్‌ జిల్లాలో ఆగం ఆగం ఉన్న పరిస్థితిపై ట్రోల్స్‌ వస్తున్నాయి.  


జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీపై, తనపై వస్తున్న ప్రతిపక్షాల విమర్శలకు ఏమాత్రం తగ్గకుండా ఇంద్రకరణ్‌ రెడ్డి ఘాటుగా కౌంటరిస్తున్నాడు. ప్రకృతి జిల్లా ఆదిలాబాద్‌కు వరదలు కొత్తేమీ కాదని, భారీ వరదలకు చెరువులు, కుంటలు, రోడ్లు తెగిపోవడం ఎప్పుడూ జరిగేదే అని కార్యకర్తలు జనాలకు సర్దిచెబుతున్నారు. మంత్రిగారు నిర్మల్‌కు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని గులాబీ శ్రేణులు లేట్ తీసుకుంటున్నాయి.

Updated Date - 2021-07-26T20:23:42+05:30 IST