మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం స్పష్టత

ABN , First Publish Date - 2020-07-11T23:38:36+05:30 IST

కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖల కేటాయింపుపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారంనాడు..

మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం స్పష్టత

భోపాల్: కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖల కేటాయింపుపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారంనాడు స్పష్టత ఇచ్చారు. ఆదివారంనాడు కొత్త మంత్రులకు శాఖలను కేటాయించనున్నట్టు ప్రకటించారు.


సుమారు వారం రోజుల క్రితమే కేబినెట్ విస్తరణ జరిగినప్పటికీ మంత్రులకు శాఖల కేటాయింపు విషయంలో శివరాజ్ సుదీర్ఘ కసరత్తు చేశారు. గత గురువారం ఉదయం కేబినెట్ మీటింగ్ జరుగుతుందని జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ తొలుత ప్రకటించినప్పటికీ, అది సాయంత్రానికి వాయిదా పడి, చివరకు రద్దయింది. దీనికి ముందు మంగళవారం సమావేశం అనుకున్నప్పటికీ అది కూడా గురువారానికి వాయిదాపడింది. దీంతో మంత్రులకు శాఖలు కేటాయించడంలో జాప్యం చోటుచేసుకుంది. అయితే, కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న వారికి గదులు మాత్రం కేటాయించారు.


కాగా, కొన్ని శాఖలకు సంబంధించి జ్యోతిరాదిత్య సింధియా గ్రూపు వారికి, మొదట్నించీ బీజేపీలోనే ఉన్న వారికి మధ్య ఏకాభిప్రాయం కుదరనందునే ఈ జాప్యం తలెత్తినట్టు పార్టీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారంనాడు మంత్రులకు శాఖల కేటాయింపు ఉంటుందని శివరాజ్ ప్రకటించడంతో ఎవరికి ఏ శాఖ దక్కుతుందనే దానిపై బీజేపీ వర్గాల్లో ఒకింత ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2020-07-11T23:38:36+05:30 IST