దళితుల గో(గూ)డు పట్టదా?

ABN , First Publish Date - 2020-07-07T10:12:06+05:30 IST

నిరుపేదల గూడు కలలు చెదరగొట్టి, మరొకరికి పట్టాలివ్వాలని చూస్తున్నారు. నిరుపేదలు కన్నీళ్లు పెట్టుకుంటున్నా..

దళితుల గో(గూ)డు పట్టదా?

బి.యాలేరులో 246 పట్టాల రద్దు

ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట

ఆ వర్గాలకే కొత్తగా ప్లాట్ల కేటాయింపు

టీడీపీ హయాంలో ఇవ్వటమే పాపమా?

లబోదిబోమంటున్న దళిత వర్గాలు


అనంతపురం, జూలై6(ఆంధ్రజ్యోతి): నిరుపేదల గూడు కలలు చెదరగొట్టి, మరొకరికి పట్టాలివ్వాలని చూస్తున్నారు. నిరుపేదలు కన్నీళ్లు పెట్టుకుంటున్నా.. పట్టించుకోవట్లేదు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం మాటలకు, క్షేత్రస్థాయిలో చేతలకు పొంతన లేకుండా పోతోంది. రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం బి. యాలేరులో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి పరిశీలనలో వెలుగుచూసిన దళితుల పట్టాల రద్దు వ్యవహారం ఇందుకు అద్దం పడుతోంది. వారంతా నిరుపేద దళితులు.


రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు వారివి. ఈ పరిస్థితుల్లో నిలువ నీడ కోసం గూడు ఏర్పరచుకోవాలన్న ఆలోచనతో అప్పటి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి హోదాలో ఉన్న పరిటాల సునీతను ఆశ్రయించారు. ఆ పేద దళితులు గూడు కోసం గోడు వెల్లబోసుకోగా.. ఆమె స్పందించారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగంతో చర్చించారు. అందరి ఆమోదంతో వారికి ఇళ్ల స్థలాల కోసం గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న 206 సర్వే నెంబరులో 2017లో ఐదెకరాల భూమిని రూ.5 లక్షలు వ్యయం చేసి, కొనుగోలు చేశారు. ఆ గ్రామానికి చెందిన 246 మంది దళితులకు రెండు సెంట్ల చొప్పున స్థలం పంపిణీ చేశారు. ఆ భూమిలో రోడ్లు ఏర్పాటు చేసి, ప్లాట్లు ఏర్పరిచారు. రెవెన్యూ అధికారుల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున పట్టాలు అందజేశారు. తమకు గూడు ఏర్పాటు చేసుకునేందుకు స్థలాలు పంపిణీ చేయటంతో అప్పట్లో ఆ పేద దళితులంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు. ప్లాట్లల్లో బండలు పాతుకునేందుకు సిద్ధం చేసుకున్నారు. 


అధికార మార్పుతో తల్లకిందులు..

రాష్ట్రంలో అధికార మార్పిడితో వైసీపీ కొలువుదీరిన విషయం తెలిసిందే. ఆ పేద దళితుల ప్లాట్లపై అధికార పార్టీ స్థానిక నేతల కన్ను పడింది. ఎలాగూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టడంతో స్థానిక నాయకులు రాజకీయ క్రీడకు శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు ఎలా అయితే రద్దు చేస్తున్నారో.. అదే ప్రక్రియను బి. యాలేరు దళితులపైనా ప్రయోగించారు. అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చారు. దళితుల ప్లాట్లను రద్దు చేశారు. అదే స్థలంలో అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన వారితో పాటు బలహీన వర్గాలు, పార్టీ కార్యకర్తలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు అధికారులు పూనుకున్నారు. ఆ మేరకు గతంలో ఇచ్చిన రెండు సెంట్ల స్థానంలో 1.25 సెంట్ల చొప్పున ప్లాట్లు పంపిణీ చేసేందుకు అధికారులు లేఅవుట్‌ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదంతా స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే నడుస్తోందని దళిత వర్గాలు వాపోతున్నాయి.


వైసీపీ మద్ధతుదారులకే పెద్దపీట

బి. యాలేరులో దళితుల ప్లాట్లను రద్దు చేసిన యంత్రాంగం వాటినే వైసీపీ మద్దతుదారులకు పంపిణీ చేసేందుకు సమాయత్తమవుతోంది. దీన్నిబట్టి చూస్తే.. రాజకీయం ఉందనటంలో సందేహం లేదు. స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సులు లేకుండా.. గత ప్రభుత్వంలో ఇచ్చిన ప్లాట్లను రద్దు చేసేంత సాహసం ప్రస్తుత పరిస్థితుల్లో ఏ అధికారీ చేయలేడన్నది జగమెరిగిన సత్యం. బి.యాలేరులోనే కాదు.. ఆత్మకూరు మండల కేంద్రంలో 321-2 సర్వే నెంబరులో గత ప్రభుత్వం ఐదెకరాలను రూ.5 లక్షలతో కొనుగోలు చేసి, 200 మందికి పట్టాలు పంపిణీ చేసింది. ప్రస్తుతం వాటిని రద్దు చేశారు.


ఆ స్థానంలో ఏకపక్షంగా పట్టాల పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. సిద్దరాంపురం గ్రామంలోనూ గత ప్రభుత్వంలో 96 మందికి పట్టాలు పంపిణీ చేయగా.. వాటినీ రద్దు చేశారు. ఆ స్థానంలో వైసీపీ మద్దతుదారులకే ప్లాట్లు పంపిణీ చేసేందుకు పూనుకున్నారంటే.. ఏకపక్షంగా పట్టాల పంపిణీ కార్యక్రమం సాగుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక్కడ పేదల కంటే.. రాజకీయానికే అధికార పార్టీ నేతలు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆత్మకూరు మండలంలోనే 1226 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు జాబితా సిద్ధం చేశారు. ఇందులో గత ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన పట్టాలను రద్దు చేసి, ఆ స్థానంలో వైసీపీ మద్దతుదారులకు పంపిణీ చేస్తున్నారంటూ బాధిత వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందంటూ బాధితులు వాపోతుండటం గమనార్హం. ఇళ్ల స్థలాల పంపిణీలో అధికార రాజకీయమే నడుస్తోందని ఆ పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు బహిరంగంగానే చెబుతుండటం గమనార్హం.


గత ప్రభుత్వంలో ఇవ్వటమే పాపమా..

గూడులేని పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి, నీడ కల్పించాలని పట్టాలివ్వటమే గత ప్రభుత్వం చేసిన పాపమా అని ప్రస్తుతం ఇళ్ల స్థలాలు కోల్పోయిన బాధిత వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ప్రభుత్వాలు మారితే పేదలపై ఆ ప్రతాపం చూపుతారా అని ప్రశ్నిస్తున్నారు. తమ పట్టాలు రద్దు చేసి, ఇతరులకు ప్లాట్లు కేటాయిస్తే.. చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని బాధిత వర్గాలు, అందులోనూ దళితులు హెచ్చరిస్తున్నారు. ఆత్మహత్య చేసుకునేందుకైనా వెనకాడేది లేదని బి. యాలేరు బాధితులు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ తమ పట్టాల రద్దుపై స్పందించి, న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.


మా కడుపు కొట్టొద్దు:పెద్దన్న, బాధితుడు, బి. యాలేరు

చేతులెత్తి మొక్కుతున్నాం. గత ప్రభుత్వం భూములు కొని, మా పేద దళితులకు పట్టాలిచ్చింది. కూలీనాలీ చేసి బతికేవాళ్లం. మా గూడు కల చెదరగొట్టొద్దు. మాకు రాజకీయాలు తెలియవు. అధికారులే అప్పుడు దగ్గరుండి పట్టాలిచ్చారు. ఆరు నెలల కిందట ఆ పట్టాలు క్యాన్సిల్‌ చేశామంటున్నారు. ఇదెక్కడి న్యాయం? దళితులకు అన్యాయం చేయటం ధర్మం కాదు. మా పట్టాలు మాకు ఇప్పించాలి.


వైసీపీ సాయమిదేనా?:ఈశ్వరయ్య, వైసీపీ కార్యకర్త, బి.యాలేరు

గతంలో టీడీపీలో కార్యకర్తగా పనిచేశా. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నా. టీడీపీ హయాంలో పరిటాల కుటుంబం అడిగిన వెంటనే మా మొర ఆలకించి, పట్టా ఇచ్చింది. ఆ పట్టాను ప్రస్తుతం రద్దు చేశారు. వైసీపీ సాయమంటే ఇదేనా? గ్రామంలో అధికార పార్టీ సామాజికవర్గానికి ఒకే ఇంటికి రెండు పట్టాలిచ్చి, దళితుడినైన నా పట్టాను రద్దు చేయించటానికి మనసెలా వచ్చింది? రాజకీయాలు దళితులపై చూపొద్దు. పట్టా రద్దుపై స్థానిక వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి.


ఇదెక్కడి న్యాయం?నాగమ్మ, బాధితురాలు, బి.యాలేరు

కాటికి కాలుచాపిన వయసు నాది. నాకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. ఉన్న గుడిసెలో కొడుకులున్నారు. నాకు గూడు లేదు. కూతురికి పెళ్లిచేసి పంపితే.. భర్త వదిలేశాడు. ఆ పాప నా దగ్గరకొచ్చింది. పనిచేసే శక్తి నాలోలేదు. ఆ పాపను వెంట బెట్టుకుని ఎక్కడుండాలి? ఉన్న స్థలంలో కొట్టమేసుకుని బతుకుదామనుకున్నాం. ఆ స్థలాన్ని లాక్కుంటే ఎలా బతకాలి. మాలాంటి పేదల జీవితాలతో ఆడుకోవడం పెద్దలకు న్యాయమా?


ఒక్క అవకాశమన్నావే.. ఇప్పుడు గుర్తు రాలేదా?:రామాంజి, దళిత నాయకుడు, బి.యాలేరు

ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డిగారూ.. ఎన్నికల సమయంలో ఓట్లు అడిగేందుకు వచ్చినపుడు ఒక్క అవకాశమివ్వండని అడిగావే.. ఆ మాటలు ఇప్పుడు గుర్తుకు రావట్లేదా? అప్పటి ఎమ్మెల్యే పట్టాలిస్తే.. ఇప్పుడు రద్దు చేస్తావా.. ఇదెక్కడి న్యాయం? ఇళ్లు లేని వారికి స్థలాలివ్వాలనుకుంటే భూములు కొనివ్వండి. గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి, వాటిని ఇతరులకు ఇవ్వటం న్యాయం చేసినట్లా?

Updated Date - 2020-07-07T10:12:06+05:30 IST