స్థలం కేటాయిస్తారా!

ABN , First Publish Date - 2021-03-01T05:05:27+05:30 IST

ప్రైవేటు రియల్‌ ఎస్టేట్‌ యజమానులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజులే చెల్లించని పరిస్థితిలో వారు వేసే లే అవుట్‌లో కొంత స్థలం ప్రభుత్వానికి కేటాయిస్తారా? అంటే ఏమో! అని సమాధానమే ఎక్కువ మంది నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వం మాత్రం ఏప్రిల్‌ నుంచి కొత్త మార్గదర్శకాలు అమలవుతాయని స్పష్టంచేసింది.

స్థలం కేటాయిస్తారా!
రియల్‌ ఎస్టేట్‌

ప్రైవేటు లే అవుట్లలో ఏప్రిల్‌ నెల నుంచి కొత్త నిబంధన

ప్రభుత్వానికి కొంత స్థలం ఇవ్వాలని షరతు

ఆచరణలో సాధ్యమేనా?

క్రమబద్ధీకరణకే ముందుకు రాని యజమానులు

(పార్వతీపురం)

ప్రైవేటు రియల్‌ ఎస్టేట్‌ యజమానులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజులే చెల్లించని పరిస్థితిలో వారు వేసే లే అవుట్‌లో కొంత స్థలం ప్రభుత్వానికి కేటాయిస్తారా? అంటే ఏమో! అని సమాధానమే ఎక్కువ మంది నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వం మాత్రం ఏప్రిల్‌ నుంచి కొత్త మార్గదర్శకాలు అమలవుతాయని స్పష్టంచేసింది. మొత్తం లే అవుట్‌లో ఐదు శాతం స్థలాన్ని కేటాయించాలని పేర్కొంది. ఆ స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయిస్తామంటోంది. కొత్త నిబంధన అమలుకు రియల్‌ వ్యాపారులు సహకరిస్తారా! అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

లే అవుట్‌ వేసేటప్పుడు క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వానికి నిబంధనల ప్రకారం యజమానులు కొంత సొమ్ము ఫీజు కింద చెల్లించాలి. కానీ ఈ తంతు లేకుండానే చాలాచోట్ల ప్లాట్లును విక్రయిస్తున్నారు. కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ యజమానులు వారు వేసిన ప్లాట్లు కంటే ఎక్కువ ప్లాట్లను విక్రయిస్తూ డబుల్‌ రిజిస్ట్రేషన్లు చేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. మరికొంతమంది రియల్‌ ఎస్టేట్‌ యజమానులు మరో అడుగు ముందుకేసి వాయిదాల ప్రకారం డబ్బులు మొత్తం వసూలు చేసి ఏళ్లు గడుస్తున్నా వినియోగదారులకు స్థలాన్ని చూపించడం లేదు. రియల్‌ మోసాలకు మధ్య తరగతి ప్రజలు లబోదిబోమన్న సంఘటనలు జిల్లాలో కోకొల్లలు. ఇటువంటి సంఘటనలపై కొంతమంది పోలీస్‌స్టేషన్లు లేదా పెద్దలను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతున్నారు. కొంతమంది రియల్‌ వ్యాపారులు వారు వేసిన ప్లాట్లుకు దగ్గరలో ప్రభుత్వ పోరంబోకు భూమి ఉన్నా, శ్మశాన వాటికలు ఉన్నా వాటిని సైతం ఆక్రమించేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రభుత్వ కొత్త నిబంధనలను అమలు చేస్తారా అన్నది ప్రశ్నార్థకమే.

10 శాతం స్థలం అక్కడక్కడే..

ప్రైవేటు లేఅవుట్లలో పార్కు, కమ్యూనిటీ హాలు తదితర అవసరాలకు 10 శాతం స్థలాన్ని కేటాయించాలని నిబంధన ఉంది.  కానీ జిల్లాలో చాలాచోట్ల అమలు కావడం లేదు. కాగితాలకే పరిమితమవుతోంది. దీనిపై పట్టించుకొనే అధికార యంత్రాంగం లేకపోవడం విచారకరం. సొంత ఇల్లు కట్టుకోవాలని కొంతమంది  రెక్కల కష్టంతో ప్లాటును కొనుగోలు చేసుకుంటూ సొంతింటి కలను నిజం చేసుకొనే ప్రయత్నంలో  ఉన్నారు తప్ప ప్రభుత్వ నిబంధనలను ఆ లేఅవుట్‌ యజమానులు అనుసరిస్తున్నారా? లేదా? గమనించే పరిస్థితి లేదు.  దీనిపై ప్రభుత్వమే రంగంలోకి దిగి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.


నిబంధనలు పాటించాలి

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. జిల్లాలో సుమారు 250 లేఅవుట్లు ఇంకా క్రమబద్ధీకరణ కావాల్సి ఉంది. కొత్త నిబంధనల అమల్లోకి వస్తే ప్రతి లేఅవుట్‌లో ఐదు శాతం స్థలం ప్రభుత్వానికి అప్పగించాలి.

- సత్యనారాయణ, బుడా అధికారి


Updated Date - 2021-03-01T05:05:27+05:30 IST