ఫార్మాసిటీకి 5 వేల కోట్లు కేటాయించండి

ABN , First Publish Date - 2022-01-24T08:52:11+05:30 IST

త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలకు భారీగా నిధులు కేటాయించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కోరారు.

ఫార్మాసిటీకి 5 వేల కోట్లు కేటాయించండి

  • ఈ ప్రాజెక్టుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల స్పందన.. 
  • ఇండస్ర్టియల్‌ కారిడార్‌లకు రూ.3 వేల కోట్లు అవసరం
  • డిఫెన్స్‌ కారిడార్‌లో హైదరాబాద్‌ను చేర్చండి: కేటీఆర్‌
  • కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలకు లేఖ 


హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో తెలంగాణ  ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలకు భారీగా నిధులు కేటాయించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆదివారం కేటీఆర్‌ లేఖ రాశారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన హైదరాబాద్‌ ఫార్మాసిటీకి ఆర్థిక సాయం అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఫార్మా రంగంలో అద్భుతమైన ప్రగతికి హైదరాబాద్‌ ఫార్మాసిటీ ఒక కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు. ఇప్పటికే ఫార్మాసిటీకి నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హోదాకు కేంద్రం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని, ఇది పూర్తయితే సుమారు రూ.64 వేల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు సుమారు 5.6 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాజెక్టు మౌలిక వసతుల కల్పనకు సంబంధించి రూ.5003 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించాలని కేటీఆర్‌ కోరారు. ఇక హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌-నాగపూర్‌ పారిశ్రామిక కారిడార్‌లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ ఫార్మాసిటీ, నేషనల్‌ ఇండస్ర్టియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌లకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని మరింత వేగంగా కల్పించాలన్నారు. ప్రతిపాదిత రెండు కారిడార్లలో మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ. 5 వేల కోట్లు ఖర్చవుతాయని తెలిపారు. దీంతోపాటు హైదరాబాద్‌-నాగపూర్‌ కారిడార్‌లో భాగంగా మంచిర్యాలను కొత్తగా గుర్తించాలన్నారు. 

 

2 కారిడార్ల ఏర్పాటు చేపట్టేందుకు సిద్ధం..

హైదరాబాద్‌- బెంగళూరు, హైదరాబాద్‌-విజయవాడ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లను జాతీయ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కార్యక్రమంలో భాగంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్థంగా ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.  ఇప్పటికే హుజురాబాద్‌, జడ్చర్ల- గద్వాల - కొత్తకోట నోడ్‌లను ఫాస్ట్‌ ట్రాక్‌ ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు సిద్థంగా ఉన్నామని వివరించారు. వీటి ప్రతిపాదనలు త్వరలోనే కేంద్రానికి పంపుతామన్నారు. ఈ రెండు ఇండస్ర్టియల్‌ కారిడార్‌ లలో ఒక్కోదానికి రూ.1500 కోట్ల చొప్పున రూ.3 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించాలని కేంద్రాన్ని కోరారు.  నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ కు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు డిఫెన్స్‌ ఇండస్ర్టియల్‌ ప్రొడక్షన్‌ కారిడార్ల పరిధిలో హైదరాబాద్‌ను చేర్చాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. దేశానికి తెలంగాణ భౌగోళికంగా కేంద్రస్థానంలో ఉందని, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా అత్యంత సులువని తెలిపారు.  

Updated Date - 2022-01-24T08:52:11+05:30 IST