పేదల ప్లాట్లలో పెద్దల పాగా!

ABN , First Publish Date - 2022-05-03T07:21:22+05:30 IST

జగనన్న లేఅవుట్లలో పేదలకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇస్తారు. మరి ఓ పోలీసు ఉద్యోగికి ఏవిధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నది మాత్రం అధికారులే చెప్పాలి.

పేదల ప్లాట్లలో  పెద్దల పాగా!
వెంకటాచలం మండలం యర్రగుంట వద్ద వేసిన లేఅవుట్‌, నిర్మాణంలో ఉన్న భారీ భవంతి

యర్రగుంట లేఅవుట్‌లో అక్రమాలు

వేసింది 218 ప్లాట్లు.. ఇచ్చింది 89

మిగిలిన వాటిలోనూ జోరుగా నిర్మాణాలు

ఓ ఉద్యోగి ఏకంగా రెండంతస్తులు నిర్మిస్తున్న వైనం

నాలుగు ప్లాట్లలో ఆశ్రమ నిర్మాణానికి ప్రయత్నాలు

పక్కనున్న చౌటపాలెంలో మాత్రం పేదలకు నిరాశ


అవును.. ఆ లేఅవుట్లో పెద్దలు పాగా వేశారు. పెద్దలు గూడు కట్టుకోవాల్సిన చోట భారీ భవంతులే నిర్మించేస్తున్నారు. మొత్తం 218 ప్లాట్లు వేసి 89 మంది పేదలకు ఇళ్ల ప్లాట్లు  ఇవ్వగా మిగిలిన స్థలాల్లోనూ జోరుగా నిర్మాణాలు సాగుతున్నాయి. నాలుగు ప్లాట్లను కలిపి ఒకటిగా చేసి ఓ ఆశ్రమం నిర్మించేందుకు కొందరు పనులు ప్రారంభించారు. మరోచోట ఓ ఉద్యోగి ఏకంగా రెండంతస్తుల భవనాన్నే నిర్మిస్తున్నాడు. ఇటువంటి అనేక చిత్రవిచిత్రాలు వెంకటాచలం మండలం యర్రగుంట వద్ద వేసిన జగనన్న లేఅవుట్‌లో కనిపిస్తున్నాయి.  అత్యంత విలువ కలిగిన ఈ లే అవుట్లోకి రాజకీయ, ఆర్థిక అండతో పేదల ప్లాట్లలో చొరబడ్డారు. కొన్నింటిని పేదలకు పంచగా మరికొన్నింటిని బేరం పెట్టి అమ్మేస్తున్నట్లు స్థానికులు  ఆరోపిస్తున్నారు.


నెల్లూరు, మే 2 (ఆంధ్రజ్యోతి) : 

జగనన్న లేఅవుట్లలో పేదలకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇస్తారు. మరి ఓ పోలీసు ఉద్యోగికి ఏవిధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నది మాత్రం అధికారులే చెప్పాలి. జాతీయ రహదారిపై వెళుతూ యర్రగుంట లే అవుట్‌ వైపు చూస్తే ఓ రెండంతస్తుల భవనం ఘనంగా కనిపిస్తుంది. అంత పెద్ద ఇల్లు నిర్మించే పేదవాళ్లు ఎవరబ్బా.. అని ఆరాతీస్తే ఆ ఇల్లు ఓ పోలీసు ఉద్యోగిదని స్థానికుల ద్వారా తెలిసింది. రెండు ప్లాట్లలో ఈ నిర్మాణం జరుగుతుండగా ఆ రెండు ప్లాట్లు ఎలా ఇచ్చారన్నది స్థానికులకు ఇప్పటికీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే ఉంది. రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం ఆ నిర్మాణం జరుగుతున్న 186, 187 ప్లాట్లకు పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. పేదల కోసం వేసిన లేఅవుట్‌లో పెద్దలకు ఎలా పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారని ప్రశ్నిస్తే మాత్రం వెంకటాచలం మండల అధికారుల నుంచి వింతైన సమాధానం వస్తుండటం గమనార్హం. మరోవైపు మొత్తం 218 ప్లాట్లలో 89 ప్లాట్లు పంపిణీ చేశారు. వీరికి ఇళ్లు కూడా మంజూరవగా కొన్నింటిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే ఖాళీగా ఉండాల్సిన ప్లాట్లలో దాదాపు 22 చోట్ల నిర్మాణాలు మొదలయ్యాయి. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇవే కాకుండా మరికొన్ని ప్లాట్లు కూడా అనధికారికంగా మరొకరి ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఈ ప్లాట్లను బహిరంగ మార్కెట్లో విక్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఓ వ్యక్తి నాలుగు ప్లాట్లను ఆక్రమించి ఓ ఆశ్రమం నిర్మించేందుకు పిల్లర్లు కూడా వేశారు. ఇక స్థానికులు కాని వారికి కూడా ఈ లేఅవుట్‌లో ప్లాట్లు కేటాయించడం గమనార్హం. 215 ప్లాటును పేదవాడిగా ఓ వ్యక్తికి అధికారులు కేటాయించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం సదరు వ్యక్తి చిరునామా నెల్లూరు రూరల్‌ మండలం వెల్లంటి గ్రామంగా నమోదైంది. మరి ఇక్కడ ఎలా ఇచ్చారన్నది మాత్రం అర్థం కావడం లేదు. 

చౌటపాలెం పేదలకు మొండిచేయి

యర్రగుంట లేఅవుట్‌లో మొదటగా యర్రగుంట, చౌటపాలెం గ్రామాల్లోని పేదలకు స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు తొలుత 187 మందితో జాబితాను రూపొందించారు. అయితే తర్వాత చౌటపాలెం, యర్రగుంట గ్రామాలు వేర్వేరు పంచాయతీలుగా ఏర్పడడంతో ఇక్కడ కేవలం యర్రగుంట వాసులైన 89 మందికి మాత్రమే స్థలాలు పంపిణీ చేశారు. చౌటపాలెం గ్రామస్థులకు ఆ ఊరిలోనే ఇస్తామని చెప్పి ఈ జాబితా నుంచి పేర్లను వేరు చేశారు. అయితే ఇప్పటికీ వారికి స్థలాలు అందలేదు. యర్రగుంటలో ఏమో స్థలాలు మిగిలిపోగా, చౌటపాలెంలో ఏమో భూమి కొనుగోలుకు ప్రయత్నించారు. అధికారులు ఇలా చేయడంలో ఆంతర్యమేమిటన్నది ఆ గ్రామస్థులకు కూడా అర్థం కావడం లేదు. యర్రగుంట వద్ద స్థలం తీసుకుంటామన్న వారికి ఇచ్చేస్తే భూమి కొనుగోలు ఖర్చు కూడా తగ్గుతుందన్న విషయం తెలియదా.. అన్న చర్చ జరుగుతోంది. ఈ లేఅవుట్‌లో జరిగిన వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


ఏం చర్యలు తీసుకోమంటారు? 

- ఐఎస్‌ ప్రసాద్‌, వెంకటాచలం తహసీల్దార్‌

యర్రగుంట లేఅవుట్‌లో 89 మందికి పట్టాలిచ్చాం. బయట ప్రాంతాల వారికి ఇవ్వలేదు. మిగిలిన ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న వాటిలో నిర్మాణాలు జరుగుతున్న విషయం మా దృష్టికి రాలేదు. రెండు ప్లాట్లకు మాత్రం పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చాం. రెగ్యులర్‌ పద్ధతిలో వారు దరఖాస్తు చేసుకున్నారు మేము ఇచ్చేశాం. వారు పోలీసా ఇంకెవరోనా అన్నది మాకెలా తెలుస్తుంది. వారు పోలీసు ఉద్యోగి అని తర్వాత తెలిసింది. ఇప్పుడు ఏం చర్యలు తీసుకోమంటారు?. 

Read more