పొత్తుల కత్తులు!

ABN , First Publish Date - 2020-02-16T10:46:00+05:30 IST

న్‌డీఏలో చేరాలన్న ప్రతిపాదన వస్తే.. వైసీపీ పరిశీలిస్తుందన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. వైసీపీలో దీనిపై భిన్నాభిప్రాయాలు

పొత్తుల కత్తులు!

ఎన్‌డీఏలో చేరికపై వైసీపీలో భిన్నస్వరాలు

టీడీపీకి, వైసీపీకి మేం దూరం: బీజేపీ.. ఇది పాలక పక్షం ప్రచారమే: జనసేన

దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేందుకే.. వైసీపీ ప్రచారం: టీడీపీ


ఎన్‌డీఏలో చేరాలన్న ప్రతిపాదన వస్తే.. వైసీపీ పరిశీలిస్తుందన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. వైసీపీలో దీనిపై భిన్నాభిప్రాయాలు తలెత్తగా.. వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే కటీఫేనని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తేల్చిచెప్పారు. జనసేనతో మాత్రమే పొత్తుందని బీజేపీ స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేందుకే ఎన్‌డీఏలో చేరతామని మంత్రులు ప్రచారం చేస్తున్నారని టీడీపీ  విరుచుకుపడింది.


జగన్‌ సూచనతోనే బొత్స మాట్లాడారేమో! : టీజీ 

ఎన్‌డీఏలో వైసీపీ చేరికపై సీఎం జగన్‌ సూచనతోనే మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడి ఉంటారని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ అన్నారు. అయితే ఈ విషయమై బీజేపీ అధిష్ఠానం నుంచి తమకెలాంటి ఆదేశాలు అందలేదన్నారు. నాయకత్వం ఆదేశానుసారం నడుచుకోవడానికి తాము సిద్ధమేనని శనివారం కర్నూలులో మీడియాతో అన్నారు. 


వైసీపీతో పొత్తు పెట్టుకుంటే.. బీజేపీకి రాం రాం!

ఆ పార్టీల మధ్య చెలిమి లేదు

ఇదంతా వైసీపీ సృష్టే: పవన్‌ కల్యాణ్‌ 

గుంటూరు: బీజేపీతో వైసీపీకి ఎలాంటి పొత్తూ లేదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఒకవేళ వైసీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీతో జనసేన ఉండదని తేల్చిచెప్పారు. రాజధాని అమరావతి గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఉద్యమానికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కేంద్రంలో చేరతామని వైసీపీ వాళ్లు మభ్యపెడుతున్నారు. బీజేపీలో వైసీపీ కలిసే పరిస్థితే లేదు. ఇవన్నీ వైసీపీ సృష్టిస్తున్నవే. ఇది అబద్ధం.. పచ్చి బూటకం’ అని చెప్పారు. మూడు రాజధానుల అంశం సమ్మతం కాదని కేంద్ర పెద్దలు తనకు చెప్పారన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకునేటప్పుడే దీనిపై స్పష్టత తీసుకున్నానని తెలిపారు.  అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలకు సమన్యాయం జరగాలనే బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుందని చెప్పారు.


వైసీపీ, టీడీపీతో పొత్తుల్లేవ్‌

ఆ రెండూ చాలా ప్రమాదకరం

జనసేనతోనే మా చెలిమి

స్థానిక ఎన్నికల్లో కలిసే పోటీ : దేవధర్‌

విశాఖపట్నం: రాష్ట్రంలో అధికార వైసీపీతో గానీ, ప్రతిపక్షం టీడీపీతో గానీ తమకెలాంటి పొత్తుల్లేవని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌ స్పష్టంచేశారు. కొందరు వైసీపీ నాయకులు బీజేపీతో చేతులు కలుపుతామని మాట్లాడుతున్నారని.. దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. శనివారమిక్కడ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ, టీడీపీ రెండూ చాలా ప్రమాదకరమైన పార్టీలని, అనుభవంతోనే ఇది చెబుతున్నామని అన్నారు. జనసేనతో మాత్రమే బీజేపీకి పొత్తుందని, ఆ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ నటుడిగా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చారని.. చంద్రబాబు రాజకీయాల్లో ఎదిగి నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీని సీఎం జగన్‌ కలవడం సాధారణ విషయమని, అందులో ప్రత్యేకత ఏమీ లేదని చెప్పారు. సీఎంతో రహస్య ఒప్పందాలు చేసుకోవలసిన అవసరం లేదని, చట్టపరంగా రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని.. భవిష్యత్‌లో రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొనబోతోందని తెలిపారు. 


జగన్‌ ప్రకటిస్తేనే విశ్వసించాలి

వైసీపీ అవసరం బీజేపీకి రావచ్చు! 

రాజ్యసభలో దానికి బలం లేదు..రేపు మా బలం పెరుగుతుంది 

అప్పుడు హోదా కోసం ఒత్తిడి తెస్తాం: మంత్రి కొడాలి నాని వెల్లడి

విజయవాడ: వైసీపీ ఎన్డీఏలో భాగస్వామ్యం కావచ్చని పిచ్చాపాటిగా ఎవరైనా మాట్లాడితే అది కరెక్టు కాదని పౌరసరఫరాల మంత్రి కొడాలినాని అన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నుంచి అలాంటి ప్రకటన వస్తేనే విశ్వసనీయతగా తీసుకోవాలని చెప్పారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పరిస్థితులను బట్టి వైసీపీ అవసరం భవిష్యత్‌లో ఏర్పడవచ్చని తెలిపారు. రాజ్యసభలో ఆ పార్టీకి బలం తక్కువగా ఉందని, రానున్న రోజుల్లో వైసీపీ సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని.. బిల్లులను పాస్‌ చేయించుకునేందుకు తమ పార్టీ మద్దతు బీజేపీకి అవసరమవుతుందని చెప్పారు. అప్పుడు ప్రత్యేక హోదాను లేవనెత్తి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి సాకారం చేసుకునేందుకు కృషి చేస్తామనన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని నాడు బీజేపీ చెప్పిందని.. ఇవ్వాల్సిందేనని చెప్పారు.


‘ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ముగ్గురూ కలిసినప్పుడు వేదికలపై హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. తర్వాత దాని బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే వద్దంటే ఎలాగని ఇవే పార్టీలు అన్నాయి. ఇలాంటి యూటర్న్‌లు వైసీపీ ఎప్పుడూ తీసుకోలేదు. ఎన్నికల ముందు మెజారిటీ ఎంపీ సీట్లు వస్తే .. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చి హోదాను సాధించుకోవచ్చని మా అధినేత భావించారు. బీజేపీ సంపూర ్ణ మెజారిటీ సాధించడంతో వైసీపీ అవసరం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంతో ఘర్షణపడడం కంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ పోరాడదామని జగన్‌ చెబుతున్నారు’ అని తెలిపారు. 

Updated Date - 2020-02-16T10:46:00+05:30 IST