వరిపై ఆంక్షలతో అనుబంధ రంగాలు కుదేలు

ABN , First Publish Date - 2021-12-26T05:10:02+05:30 IST

యాసంగిలో వరి సాగుపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో రైతులపైనే గాక అనుబంధరంగాలపై కూడా ప్రభావంపడనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా వ్యవసాయ కూలీలకు ఉపాధి కరువుకానుంది. అదేవిధంగా పురుగుమందుల దుకాణాలు, వ్యవసాయ పరికరాలు తయారుచేసే వెల్డింగ్‌ పరిశ్రమకు ఎలాంటి పనులు ఉండవు.

వరిపై ఆంక్షలతో అనుబంధ రంగాలు కుదేలు

ఉపాధి కోల్పోనున్న కూలీలు 

ఉమ్మడి జిల్లాలో 19.44లక్షల మందికిపైగా కూలీలు

పనులు లేక ఖాళీగా కులవృత్తిదారులు

(చౌటుప్పల్‌ రూరల్‌)

యాసంగిలో వరి సాగుపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో రైతులపైనే గాక అనుబంధరంగాలపై కూడా ప్రభావంపడనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా వ్యవసాయ కూలీలకు ఉపాధి కరువుకానుంది. అదేవిధంగా పురుగుమందుల దుకాణాలు, వ్యవసాయ పరికరాలు తయారుచేసే వెల్డింగ్‌ పరిశ్రమకు ఎలాంటి పనులు ఉండవు.

నల్లగొండ జిల్లాలో మొత్తం 4.88లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా, వానాకాలంలో సుమారు 3లక్షల ఎకరాలకుపైగా వరిసాగైం ది. కాగా, ప్రస్తుత యాసంగి సీజన్‌లో 30వేల ఎకరాల్లో మాత్రమే ఆరుతడి పంటలు సాగయ్యాయి. యాదాద్రి జిల్లాలో ... లక్షల ఎకరా లు, సూర్యాపేట జిల్లాలో 3లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. కా గా ఇప్పటి వరకు 4వేల ఎకరాల్లో వరి సాగుకాగా, 850 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగయ్యాయి. కాగా, యాసంగిలో వరి సాగు వద్దని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు అయోమయంలో పడ్డా రు. కొందరు రైతులు ఆరుతడి పంటల సిద్ధపడగా, మిగతా రైతులు ఎటూ తేల్చులేకపోతున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో కేవ లం 10శాతం మాత్రమే ఆరుతడి పంటలు సాగయ్యాయి.

అనుబంధ రంగాలదీ అదే పరిస్థితి

వ్యవసాయంపై పలు రంగాలు ఆధారపడ్డాయి. గ్రామీణ ప్రాంతా ల్లో వడ్రంగి, కమ్మరి తదితర వృత్తిదారులు సాగు పనుల ఆధారంగా జీవనం వెళ్లదీస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో వెల్డింగ్‌ పరిశ్రమ, ఎరువులు, పురుగు మందుల దుకాణాలు, బోర్‌వెల్‌, వ్యాపార రంగాలు వ్యవసా యం ఆధారంగా కొనసాగుతున్నాయి. అయితే వరిపై ఆంక్షలతో ఈ రంగాలకు పనిలేకుండా పోయింది. వ్యవసాయ సీజన్ల లో కమ్మరి కొలిమి, వడ్రంగుల ఇళ్ల వద్ద సందడిగా ఉండేది. కాగా, ప్రస్తుతం బోసిపోయాయి. ఈ వృత్తిదారులు రోజుకు రూ.300 నుం చి రూ.500కుపైగా సంపాదించేవారు. ప్రస్తుతం పనులు లేక ఖాళీ గా ఉంటున్నారు. ఇటీవల వరిసాగు విస్తీర్ణం పెరగడంతో చాలామం ది ఫైనాన్స్‌ల కింద ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. ఆ ట్రాక్టర్లకు పను లు లేక ఇంటి వద్దే ఉంటున్నాయి. దీంతో ఫైనాన్స్‌ ఎలా చెల్లించాలో తెలియక మదనపడుతున్నారు. అదేవిధంగా వరి నూర్పిడి చేసే హార్వెస్టర్ల యజమానులు సైతం అయోమయంలో పడ్డారు. వరిసాగు లేకపోవడం బోరువెల్‌ రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఆరుతడి పంటలకు నీటి అవసరం ఎక్కువగా ఉండదు. దీంతో నూతనంగా బోర్లు వేసేవారు లేక యజమానులు వాహనాలను ఇంటి వద్దే పార్కింగ్‌ చేసి ఖాళీగా ఉన్నారు.

కూలీలకు పనులు కరువు

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడి కూలీలు జీవనం వెళ్లదీస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 19.44లక్షల మంది కూలీలు వ్యవసాయరంగంపై ఆధారపడి ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 9.36లక్షల మందికిపైగా, సూర్యాపేట జిల్లాలో 6.51లక్షలు, యాదాద్రి జిల్లాలో 3.57లక్షల మందికి పైగా కూలీలు ఉన్నారు. అయితే ప్రభుత్వం వరి సాగుపై ఆంక్షలు విధించడంతో ఆమేరకు రైతులు ఆరుతడి పంట లు సాగుచేస్తే కూలీల అవసరం అంతగా ఉండదు. అదీగాక ఆరుతడి పంటల కూలీకి వెళ్తే అంతగా గిట్టుబాటు కూడా కాదు. అదే వరిసాగుచేస్తే నాటు మొదలు కలుపు తీత, పంట నూర్పిడి వరకు కూలీల అవసరం అధికంగా ఉంటుంది. ఆరుతడి పంటలకు కేవలం విత్తనాలు విత్తేప్పుడు, పంట కోత సమయంలో మాత్రమే కూలీల అవసరం ఉంటుంది. అది కూడా తక్కువగానే. దీంతో యాసంగిలో కూలీలకు ఉపాధి కరువు కానుంది.

కౌలు రైతుల పరిస్థితి గమాగం

భూములు లేని చాలా మంది కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేవలం కౌలు భూమిసాగుపైనే ఆధారపడి జీవనం సాగించే రైతులు ప్రస్తుతం వరి సాగులేకపోవడంతో ఏంచేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. వరిసాగు లేకుంటే కుటుంబపోషణ ఎలా అని మదనపడుతున్నారు. అదేవిధంగా వ్యవసాయరంగంపై ఆధారపడ్డా వ్యాపార సంస్థలు, విత్తనాలు విక్రయించే దుకాణాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలు, పంపుసెట్ల విక్రయం, మరమ్మతులు, ఎలక్ట్రికల్‌ దుకాణాలకు గిరాకీ కరువై వెలవెలబోతున్నాయి.

సంక్షోభంలో వెల్డింగ్‌ పరిశ్రమ

సాగు పనుల్లో అధునాతన యంత్రాల వినియోగం పెరిగింది. దీంతో పలు వెల్డింగ్‌ షాపులు పట్టణాల్లో వెలిశాయి. ఇవన్నీ 90శాతం వ్యవసాయరంగంపైనే ఆధారపడ్డాయి. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్‌ వీల్స్‌, కల్టివేటర్లు, ట్రాలీలు, తదితర సామగ్రిని తయారుచేస్తాయి. వరిసాగులో వీల్స్‌, కల్టివేటర్ల వినియోగం ఎక్కువ. ఈ రంగంపై ఆధారపడి వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయ సీజన్ల సమయంలో పనిముట్ల కొనుగోలుతో కళకళలాడే వెల్డింగ్‌షాపులు నేడు వెలవెలబోతున్నాయి. గిరాకీ లేక షాపుల్లో పనిచేసే కార్మికులను యజమానులు తొలగిస్తున్నారు. గతంలో నవంబరు, డిసెంబరు నాటికి ప్రతీ దుకాణాదారుడు 200, 300 జతల వీల్స్‌, కల్టివేటర్లు విక్రయించేవారు. ఈ సీ జన్‌లో 20జతల వీల్స్‌ కూడా విక్రయించలేదని వెల్డింగ్‌ షాపుల య జమానులు వాపొతున్నారు. 


కూలి దొరక్కుంటే ఇళ్లు గడిచేదెలా? : తొర్పునురి రాజమ్మ, లింగారెడ్డిగూడెం, చౌటుప్పల్‌

ప్రభుత్వం వరి సాగు వద్దని చెప్పింది. రైతు లు వరి సాగుచేస్తేనే మాకు కూలి దొరుకుతుం ది. మెట్ట పంటలకు కూలీల అవసరం అంతగా ఉండదు. అంతేగాక కూలి గిట్టుబాటుకాదు. వరి కూలి కి వెళ్తే రూ.300 నుంచి రూ.500 వరకు వచ్చేవి. ఆరుతడి పంటలకు అంత కూలిరాదు. కూలీ పనులు లేకుంటే ఇళ్లు గడిచేదెలా?


ప్రభుత్వ ప్రకటన ప్రభావం చూపింది : బొడ్డుపల్లి రాములు, వెల్డింగ్‌షాపు యజమాని

రైతులు వరిసాగు చేయకపోవడంతో వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయడం లేదు. దీంతో వెల్డింగ్‌ షాపులకు గిరాకీలు లేవు. ఇప్పటివరకు 20జతల వీల్స్‌ కూడా విక్రయించలేదు. పనులు లేక షాపుల అద్దె చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. షాపులో పనిచేసే కార్మికులను పని నుంచి తీసేయాల్సి వచ్చింది.


దుకాణాలు వెలవెలబోతున్నాయి : జాల మల్లేష్‌, ఎరువుల దుకాణ యజమాని, చౌటుప్పల్‌

వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైదంటే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు దుకాణాలు కళకళలాడేవి. ప్రభుత్వం వరి సాగువద్దని ప్రకటించడంతో దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఆరుతడి పంటలకు ఎరువులు, పురుగు మందుల అవసరం అంతగా ఉండదు. దీంతో రైతులు ఇటుగా రావడమే మానేశారు.



Updated Date - 2021-12-26T05:10:02+05:30 IST