Advertisement
Advertisement
Abn logo
Advertisement

మధ్యప్రాచ్యంలో కుసుమించిన మైత్రి

పాలస్తీనా భూభాగాలను తమ దేశంలో కలుపుకోబోమంటూ ఇజ్రాయిల్ ఇచ్చిన హామీ మేరకు ఆ దేశంతో సంబంధాలను నెలకొల్పుకునే దిశగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ ముందడుగు వేసింది. ఒమాన్, ఖతర్ దేశాలతో పాటు బహ్రెయిన్ సైతం యు.ఏ.ఇ బాటన ఇజ్రాయిల్  తో సంబంధాలను నెలకొల్పుకునే ఆవకాశాలున్నాయి.


ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. సాధారణ ప్రజా జీవితాన్ని కొవిడ్ -19 మహమ్మారి ఛిద్రం చేస్తోంది. ప్రజల బతుకులు ఎలా ఉంటేనేం కరోనా విపత్తును ఆధారం చేసుకొని అనేక దేశాలలో స్వార్థ రాజకీయాలు ప్రబలిపోయాయి. కరోనా విషక్రిమిని నిర్మూలించేందుకు ఉద్దేశించిన వ్యాక్సిన్ రూపకల్పన, ఉత్పత్తిలో పైచేయి సాధించేందుకు అమెరికాతో సహా అనేక దేశాలు ఎంతగానో ఆరాటపడుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అనేక దేశాల ప్రభుత్వాధినేతలు కరోనా వ్యాక్సిన్ కోసం పరుగులు పెట్టడానికి కారణం ప్రజారోగ్యంపై శ్రద్ధేనా? కాదు. వ్యాక్సిన్ విజయంతో వారికి సమకూరే రాజకీయ ప్రయోజనాలే అందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు.


కరోనా వ్యాక్సిన్ను ఈ ఏడాది నవంబర్ (అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే నెల) లోగా అందుబాటులోకి తీసుకువస్తామని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇదిలావుండగా కరోనా వ్యాక్సిన్‌ను ఇప్పటికే తాము విజయవంతంగా రూపొందించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. అలాగే చైనా వ్యాక్సిన్ తయారీలో తామూ ముందంజ వేశామని ప్రకటించింది. సరే, ఆగస్టు లోగా వ్యాక్సిన్ను రూపొందించి ఎర్రకోటపై నుండి దీనికి సంబంధించి ప్రకటన చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సైతం భావించారని ఒక దశలో వార్తలు వచ్చాయి. వ్యాక్సిన్ను రూపొందించిన మొదటి దేశంగా లభించే జాతి గౌరవం కోసం ఇప్పుడు అన్ని దేశాలు తాపత్రయపడుతున్నాయి. ఏ దేశం వ్యాక్సిన్ విజయం సాధిస్తే ఆ దేశ ప్రభుత్వాధినేత, పాలక పక్షానికి రాజకీయంగా గరిష్ఠ లబ్ధి చేకూరుతుందని మరి చెప్పనవసరం లేదు.


మధ్య ప్రాచ్యంలో పుష్కల చమురు సంపాదనతో గల్ఫ్ దేశాలు ఆర్థికంగా ముందు వరుసలో ఉన్నాయి. అయితే వైజ్ఞానిక సంపత్తి, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అమెరికా మొదలైన పాశ్చాత్య దేశాలతో సంబంధాల విషయంలో ఇజ్రాయిల్ అగ్రగామిగా ఉంది. నిఘా, గూఢచర్యం, రక్షణ రంగాలలో ఇజ్రాయిల్ ఒక్క మధ్య ప్రాచ్యంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పేరున్న కొద్ది దేశాలలో ఒకటి. పౌరుల కదలికలను గమనించి, కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి సమీపంలో ఉంటే అవతలి వ్యక్తిని ముందస్తుగా హెచ్చరించే విధానాన్ని అమలు చేయడం ద్వారా కరోనా మహమ్మారిని తమ దేశంలో చాల వరకు ఇజ్రాయిల్ నిర్మూలించగల్గింది. మధ్య ప్రాచ్యంలో అందరి కంటే ముందుగా వ్యాక్సిన్ రూపకల్పనలో నిమగ్నమైన దేశం ఇజ్రాయిల్. రాజకీయంగా, దౌత్యపరంగా, సామాజికంగా చాలా శక్తిమంతమైన దేశం ఇజ్రాయిల్. పొరుగున ఉన్న అరబ్బు దేశాలతో ఇజ్రాయిల్ మైత్రి బాహాటంగా ఎలా ఉన్నప్పటికి ఆ దేశంతో పలు అరబ్ దేశాలకు లోపాయికారీ సంబంధాలున్నాయి. ప్రత్యేకించి అమెరికాలో సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ఈ సంబంధాలు మరింత బలపడ్డాయి. మరో వైపు ఈ ప్రాంతంలో అమెరికా చేసిన వ్యూహాత్మక తప్పిదాల కారణాన ఇరాన్ బలపడి పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు సవాల్గా మారిన నేపథ్యంలో ఇజ్రాయిల్ ప్రాధాన్యత మరింత పెరిగింది.


ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్యంగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యుఏఇ), ఇజ్రాయిల్ దేశాల మధ్య దౌత్య సంబంధాల స్థాపనకు మార్గం సుగమమైందని ప్రకటించడంతో అరబ్బు ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పలస్తీనా భూభాగాలను తమ దేశంలో కలుపుకోబోమంటూ ఇజ్రాయిల్ ఇచ్చిన హామీ మేరకు ఆ దేశంతో సంబంధాలను నెలకొల్పుకునే దిశగా ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో తాను టెలిఫోన్లో మాట్లాడినట్లుగా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ పక్షాన ఆబుధాబి యువరాజు శేఖ్ మహమ్మద్ అల్ నహ్యాన్ ప్రకటించారు. మరుసటి రోజే ఇజ్రాయిల్ ఫార్మాస్యూటికల్ సంస్థ ఒకటి కరోనా వ్యాక్సిన్ రూపకల్పన, ఉత్పత్తికి సంబంధించి యు.ఏ.ఇ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు యు.ఏ.ఇ అధికారిక వార్త సంస్థ వెల్లడించింది.


కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఒమాన్, ఖతర్ దేశాలతో పాటు బహ్రెయిన్ కూడా యు.ఏ.ఇ బాటన ఇజ్రాయిల్‌తో సంబంధాలను నెలకొల్పుకునే ఆవకాశాలున్నట్లుగా చెబుతున్నారు. గతంలో కూడ ఒమాన్, ఖతర్ దేశాలలో ఇజ్రాయిల్ తమ వాణిజ్య ప్రతినిధి కార్యాలయాలను ప్రారంభించింది. అమెరికా అంతర్గత రాజకీయాలు, అందునా అధ్యక్ష పదవీ ఎన్నికల తీరుతెన్నుల కారణాన ఇజ్రాయిల్- యుఏఇ మైత్రిపై మధ్య ప్రాచ్యంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని ఆసక్తి వ్యక్తమవుతున్నది. కరోనా విలయంపై కంటే కూడా ఈ అంశమే ఎల్లెడలా చర్చనీయాంశంగా ఉన్నదనడం సత్య దూరం కాదు. అమెరికాలో బలమైన యూదు లాబీ మద్దతును కూడగట్టుకోవడంలో ట్రంప్ ఇప్పటికే సఫలమయ్యారు. ఇక ఇజ్రాయిల్- యుఏఇ ల మధ్య మైత్రీ సాధన తన విదేశాంగ విధాన ఘన విజయాలలో ఒకటిగా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్ ట్రంప్ తప్పక చెప్పుకుంటారు. -మొహమ్మద్ ఇర్ఫాన్, ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

TAGS:
Advertisement
Advertisement