అత్యాచారానికి గురైన యువతికి చెప్పుల దండవేసి తిప్పిన మహిళలు

ABN , First Publish Date - 2022-01-27T19:45:15+05:30 IST

ఢిల్లీలోని 20 ఏళ్ల ఓ యువతిని స్థానికంగా అక్రమంగా మద్యం, డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కూడా ఆమెపై తీవ్ర స్థాయిలో మానసిక, భౌతిక దాడి జరిగింది. ఆమెకు గుండు కొట్టించి, ముఖానికి నలుపు రంగు పూసి...

అత్యాచారానికి గురైన యువతికి చెప్పుల దండవేసి తిప్పిన మహిళలు

న్యూఢిల్లీ: మన దేశ రాజధానిని ‘రేప్ క్యాపిటల్’ అని విమర్శిస్తుంటారు. ఈ విమర్శను జీర్ణంచుకోవడం కష్టమే అయినా మన దేశంలో ఎక్కవ అత్యాచారాలు జరుగుతున్నది ఢిల్లీలోనే అని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. తాజాగా జరిగిన ఒక ఘటన రేప్ స్థాయిని మించిపోయింది. అత్యాచారానికి గురైన యువతికి చేయూతనివ్వాల్సింది పోయి చెప్పుల దండ వేసి మరింతగా హింసించారు. ఇది ఆమెను రేప్ చేసిన మానసిక రోగులు చేసిన నిర్వాకం కాదు. ఆమెలాంటి సాటి మహిళలు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని 20 ఏళ్ల ఓ యువతిని స్థానికంగా అక్రమంగా మద్యం, డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కూడా ఆమెపై తీవ్ర స్థాయిలో మానసిక, భౌతిక దాడి జరిగింది. ఆమెకు గుండు కొట్టించి, ముఖానికి నలుపు రంగు పూసి, చెప్పుల దండ వేసి వీధుల్లో తిప్పుతూ చప్పట్లతో హేళన చేస్తూ రేప్‌కు ఏమాత్రం తీసిపోకుండా హింసించారు. సాటి మహిళలు ఆ బాధితురాలిపై చేసిన ఈ దుర్మార్గం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.


కాగా, వీడియోపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ స్పందించారు. సదరు వీడియోను షేర్ చేస్తూ ‘‘కస్తూర్బా నగర్‌లో 20 ఏళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమెకు శిరోముండనం చేశారు. ముఖానికి నలుపు రంగు పూశారు. అనంతరం చెప్పుల దండ మెడలో వేసి వీధుల్లో తిప్పారు. ఆమె నడుస్తూ ఉంటే చప్పట్లు కొడుతూ హేళన చేశారు. ఈ విషయమై ఢిల్లీ పోలీసులకు నేను నోటీసులు ఇస్తున్నాను. బాధితురాలిపై దౌర్జన్యానికి పాల్పడ్డ ఆడ, మగ అందరినీ వెంటనే అరెస్ట్ చేయండి. అలాగే బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించండి’’ అని పేర్కొన్నారు.


ఈ ఘటన అనంతరం బాధితురాలు సైతం పోలీసులు ఆశ్రయించి కేసు నమోదు చేసింది. తనపై జరిగిన సామూహిక అత్యాచారం, అనంతర మహిళల దాడి గురించి ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టంగా పేర్కొంది. తనను వీధుల్లో తిప్పుతున్న క్రమంలో కొందరు మహిళలు భౌతికంగా హింసించారని, కొట్టారని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, యువతి ఫిర్యాదును కూడా కలుపుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మహిళా కమిషన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2022-01-27T19:45:15+05:30 IST